మోదీ, బాబు మళ్లీ భాయీ భాయీ

ఎపిలో టిడిపి, బిజెపి, జనసేన పొత్తును ఖరారు చేసుకునేందుకు చంద్రబాబు నాయడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపారు.

Update: 2024-03-08 03:16 GMT
ఫైల్ ఫోటో

ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ చేతులు కలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అయిదేళ్ల తర్వాత మళ్లీ తెలుగుదేశం,బిజెపిలు దగ్గరవుతున్నాయి. చంద్రబాబు నేతృత్వంలోని టిడిపి మళ్లీ బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ఎలయన్స్ (ఎన్ డి ఎ) లోచేరబోతున్నది. 2014 ఎన్నికల్లో బాబు,మోదీ, జనసేన నేత పవన్ కల్యాణ్ తో కలసి ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం చేశారు.

ఈ పరిణామానికి బాట వేస్తూ గురు వారం రాత్రి పొద్దుపోయేదా ఈ పార్టీల మధ్య చర్చలు జరిగాయి. ఈ పొత్తును ఖరారు చేసుకునేందుకు చంద్రబాబు నాయడు, తన మిత్రుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో కలసి ఢిల్లీ కి వచ్చారు. బిజెపిఅధ్యక్షుడు నద్దాతో, హోం మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపారు. అమిత్‌షాతో ఆయన నివాసంలో  వారంతా భేటీ అయ్యారు. పొత్తు ఖరారయినట్లు, సీట్లు పంపకం మాత్రం పెండింగులో ఉందని తెలిసింది. సీట్ల పంపకం మీద నేడు కూడా చర్చలు కొనసాగే అవకాశం ఉందని పార్టీ ఎంపి ఒకరు తెలంగాణ ఫెడరల్ కు చెప్పారు.

పొత్తులో భాగంగా బీజేపీకి ఎన్ని స్థానాలు ఇవ్వాలనే అంశంపై టిడిపిలో అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే బిజెపికి ఎక్కువ సీట్లు ఇస్తే వచ్చే పరిణామాల మీద చంద్రబాబు సహచరులు రామ్మోహన్‌ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్‌, రఘురామకృష్ణం రాజు, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, లావు కృష్ణదేవరాయలు తదితరులతో చంద్రబాబు చర్చలు జరిపారు.

లోక్‌సభలో కనీసం 370 స్థానాలు నెగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ముఖ్యంగా దక్షిణాదిలో పార్టీ సీట్ల సంఖ్య పెంచుకోవాలని భావిస్తున్నదని చెబుతూ బిజెపికి ఎక్కువ సీట్లు కేటాయించాలని షా కోరినట్లు సమాచారం. బిజెపికి 8 నుంచి 10 లోక్‌సభ స్థానాలు తమకు కేటాయించాలని కోరినట్లు తెలిసింది. అసెంబ్లీ సీట్ల వ్యవహారాన్ని మాత్రం బిజెపి నేతలు చంద్రబాబుకు వదిలేసినట్లు తెలిసింది.

బీజేపీ ఆశిస్తున్నన్నట్లు లోక్ సభకు మరీ ఎక్కువగా ఇస్తే వచ్చే నష్టం గురించి వివరిస్తూ 4 లోక్‌సభ, 6అసెంబ్లీ సీట్లలో పోటీ చేసేందుకు బిజెపి ముందుకు రావాలని చంద్రబాబు కోరినట్లు తెలిసింది. ఎక్కవ సీట్లు ఇస్తే టిడిపిలో వచ్చే సమస్యలు కూడా ఆయన బిజెపి నేతలకు వివరించినట్లు తెలిసింది.

చంద్రబాబు 2019 ఎన్నికల ముందు మోదీ విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ ఎన్డీయేనుంచి బయటకు వచ్చారు. కాంగ్రెస్ తో చేతులు కలిపారు. మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించడం లేదని, ఈ విద్రో హమని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి మోదీనే బాధ్యులని ఆయన తీవ్రంగా విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ ను విభజించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నపుడు 2014 లో అప్పటి కేంద్ర ప్రభుత్వం రాఫ్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించి, రాజధానిని కోల్పోయిన లోటు పూరిస్తామని హామీ ఇచ్చారు. అయితే, దానిని మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదు. దీనితో 2018 మార్చిలో నాలుగేళ్ల జత తర్వాత చంద్రబాబు నాయుడు నిరసన వ్యక్తం చేస్తూ ఎన్డీయే ప్రభుత్వం నుంచి వైదొలిగారు. 2019 ఎన్నికల్లో పొత్తులేకుండా పోటీ చేశారు.

అయితే, ఆయన ప్రయోగం ఫలితంచలేదు. అటూ బిజెపితో,ఇటు జనసేనతో పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్ ఆర్ కాంగ్రెస్అఖండ ఆధితక్యతతో అధికారంలోకి వచ్చింది. దీనితో కంగుతున్న చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చి తప్పు చేశానని, కాంగ్రెస్ తో కలవకుండాల్సింద ని చెప్పి బిజెపికి మోదీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు. ఈ ప్రయత్నాలు గురువారం రాత్రి ఒక కొలిక్కి వచ్చాయి.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ పొత్త కుదిరింది. పొత్తులో ఈ ప్రస్తావన వచ్చిందో లేదో తెలియదు. పొత్తు గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ పొత్తు కేవలం ఎన్నికల పొత్తుగా కాకుండా రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే పొత్తుగా మార్చాలని మాజీ ఐపిఎస్ అధికారి, జైభారత్ పార్టీ అధినేత వివి లక్ష్మీనారాయణ కోరారు. రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే ప్రత్యేక హోదాను తప్పక ఇస్తామని, పొత్తు సందర్బంగా చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షానుంచి రాతపూర్వకంగా హామీ తీసుకోవాలని సూచించారు.


Tags:    

Similar News