గీత దాటిన సజ్జలపై వేటు వేయమన్న టీడీపీ!
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డినే టీడీపీ టార్గెట్ చేసింది. ఆయన చేస్తున్నది ప్రభుత్వ పనా లేక రాజకీయమా అంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది;
By : The Federal
Update: 2024-03-25 13:08 GMT
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డినే టీడీపీ టార్గెట్ చేసింది. ఆయన చేస్తున్నది ప్రభుత్వ పనా లేక రాజకీయమా అంటూ మండిపడింది. అంతటితో ఆగకుండా సజ్జలపై ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేరుగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ సలహాదారంటే ప్రభుత్వ కార్యకలాపాలకే పరిమితం కావాలన్నారు. ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నాయకునిలా మాట్లాడుతున్నారని ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఐదేళ్ళుగా ప్రభుత్వ సలహాదారునిలా కాకుండా వైసీఈ కార్యకర్తలా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలపై విషం చిమ్ముతున్నారన్నది అచ్చెన్నాయుడి ఆరోపణ. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ప్రెస్‌మీట్‌లు పెట్టి విపక్షాలపై ఆరోణలు చేస్తున్నారన్నది ఆయన ఫిర్యాదు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు సజ్జలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎన్నికలు సజావుగా జరగాలంటే వెంటనే ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించాలని అచ్చెన్నాయుడు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాను కోరారు. ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటూ అధికార పార్టీ పనులు ఎలా చేస్తారన్నారు. అచ్చెన్నాయుడి లేఖలో ఏముందంటే...’ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ మార్చి 18, 22వ తేదీల్లో ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షాలపై బహిరంగ ఆరోపణలు చేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం రాజకీయ నాయకులు, అధికారుల మధ్య వ్యక్తిగతంగా లేదా సమష్టిగా వీడియో కాన్ఫరెన్సులు నిషేధించారు. అందుకు విరుద్ధంగా వైసీపీ నాయకులు, అభ్యర్థులతో సజ్జల భేటీలు, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. ఐపీసీ 171, 123, 129, 134, 134 ఏ సెక్షన్లను సజ్జల ఉల్లంఘించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించనందుకు సజ్జలపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అచ్చెన్నాయుడు కోరారు.