అక్కడ ఎప్పుడూ టీడీపీదే గెలుపు

అక్కడ తెలుగుదేశం పార్టీ వారిని తప్ప వేరెవరినీ గెలిపించడం లేదు. ఇంతకూ ఆపట్టణం ఎక్కడుంది. ఎందుకు అక్కడి ప్రజలు తెలుగుదేశం పార్టీనే గెలిపిస్తున్నారు.

Update: 2024-01-18 10:18 GMT
N Balakrishna, MLA

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత నుంచి అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే గెలుస్తున్నారు. 1955లో కాంగ్రెస్ వారు గెలిచారు. ఆ తరువాత 1962, 1967లో స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. తరువాత రెండు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. అనంతరం పి రంగనాయకులు 1983లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. తరువాత పోటీ చేసిన ఎన్ టి రామారావు 1985, 1989, 1994లో ఘనవిజయం సాధించారు. అనంతరం కూడా టీడీపీ వారే గెలిచారు. 2014, 2019లో పోటీ చేసిన ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ రెండు సార్లూ ఘన విజయం సాధించారు. మూడో సారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు సిద్దమయ్యారు. ఇంతకూ ఆ నియోజకవర్గం ఎక్కడుందనుకుంటున్నారా? సత్యసాయి జిల్లాలో వుంది.

హిందూపురం ఈ పేరు చెప్పగానే మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గుర్తుకొస్తారు. హిందూపురానికి గొప్ప గుర్తింపు తీసుకొచ్చింది ఎన్టీ రామారావుగా చెబుతుంటారు. ఆయన అక్కడి నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ సాధించారు.

ఎందుకు టీడీపీనే గెలుస్తూ వస్తుంది?

నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గాల వారు ఎక్కువగా ఉన్నారు. మొదటి నుంచీ బీసీలు ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తూ వచ్చారు. అందుకు కారణాలు ఉన్నాయి. ఎంతో కాలంగా మిడిల్ క్లాస్ పీపుల్ గానే బీసీలు మిగిలిపోయారు. ఎన్టీ రామారావు సీఎం అయిన తరువాత బీసీలకోసం చాలా పథకాలు ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి రోజూ తినటానికి తిండిలేక ఇబ్బందులు పడుతున్న వారికి పట్టెడన్నం దొరికింది. కిలో రూపాయి బియ్యం బీసీల జీవితాలను గట్టెక్కించింది. కొన్ని సబ్సిడీ పథకాలు కూడా వారికోసం రామారావు తీసుకొచ్చారు. అప్పటి వరకు పాలించిన కాంగ్రెస్ వారి గురించి పట్టించుకోలేదు. బీసీల జీవితాల్లో వెలుగు నింపింది ఎన్టీఆర్ కాబట్టి తెలుగుదేశం పార్టీని మరిచే ప్రసక్తే లేదని వరుసగా వారి పిల్లలకు ఓట్లు వచ్చినా తెలుగుదేశం పార్టీకే పట్టం కడుతున్నారు.

ఫలించని వైఎస్సార్ ప్రయత్నం

హిందూపూర్ కు తాగునీటిని తెప్పేంచేందుకు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సక్సెస్ అయ్యారు. సుమారు 400 కిలో మీటర్ల దూరం నుంచి పైప్లైన్ వేయించి తాగునీరు అందించారు. అప్పట్లో ఎంతో ప్రయత్నం చేస్తేనే కాని తాగునీరు అందే పరిస్థితి లేదు. అయినా ఎన్నకల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి చెందారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కూడా కాంగ్రెస్ ను నియోజకవర్గ ప్రజలు దూరం పెడుతూనే వచ్చారు.

వైఎస్సార్సీపీ 2014లో నవీన్ నిశ్చల్ ను రంగంలోకి దించింది. ఓటమి చెందారు. ఆ తరువాత 2019లో మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ అహ్మద్ ను రంగంలోకి దించింది. అయినా ఇరువురూ బాలకృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు.

బాలకృష్ణ హ్యాట్రిక్ ఖాయమా

వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ హాట్రిక్ సాధించడం ఖాయమని పలువురు అభిమానులు అంటున్నారు. వైఎస్ఆర్సీపీ ఒక మహిళను రంగంలోకి దించుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎవరు ఉన్నా ఓటమి తప్పదని టీడీపీ వారు భావిస్తున్నారు. తండ్రికే ఓడించడం చేతకాలేదంటే తనయునికి ఏమాత్రం సాధ్యం కాదని బాలకృష్ణ అభిమానులు అంటున్నారు.

Tags:    

Similar News