Kadapa ZP | ఒకే సీటు గెలిచి జెడ్పీ కుర్చీ రేసులో టీడీపీ

కడప జెడ్పీ చైర్మన్ ఎంపికపై ఆసక్తి ఏర్పడింది. జగన్ ను దెబ్బకొట్టడానికి తిరుపతి కార్పొరేషన్ ఫార్ములా అమలు చేస్తారా?;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-03-23 07:27 GMT

ఎక్కువ స్థానాలు సాధించిన పార్టీకి అధికారం రావడం సహజం. ఒక సీటు సాధించినా అది సాధ్యం చేస్తున్నారు. టీడీపీకి తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ పదవి టీడీపీకి అలాగే దక్కింది. ఇదే సీన్ కడప జిల్లా పరిషత్ (Zilla Parishat - Kadapa ) రిపీట్ అవుతుందా? చైర్మన్ పదవి దక్కించుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ కు ఝలక్ ఇవ్వాలనేది టీడీపీ కూటమి ఎత్తుగడ. ఈ వ్యవహారం ఏమిటో పరిశీలిద్దాం.
కడప జెడ్పీ చైర్మన్ పదవికి రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి రాజీనామా చేశారు. ఆయన ఒంటిమిట్ట మండల జెడ్పీటీసీగా గెలిచారు. ఆ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఉపఎన్నిక అనివార్యమైంది. ఆయన స్థానంలో ప్రస్తుతం వైసీపీ (YCP) వైస్ చైర్ పర్సన్ శారద ఇన్చార్జి చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో కడప జిల్లా పరిషత్ చైర్మన్ ( kadap zilla parishat Chairman) పదవి ఎవరికి దక్కుతుందనే విషయంలో ఆసక్తికర రాజకీయం నడుస్తోంది. మాజీ సీఎం వైఎస్. జగన్ కు సొంత జిల్లాలో దెబ్బకొట్టాలనే టీడీపీ కూటమి ఎత్తులు వేస్తోంది. కొన్ని నెలలుగా సాగుతున్న ఈ వ్యవహారంపై జగన్ కూడా తమ పార్టీ జెడ్పీటీసీ సభ్యులను కాపాడుకోవంలో కడప నేతలకు బాధ్యతలు అప్పగించారు.
మినీ ఎన్నికల సంగ్రామం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల తరువాత స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీకి రాష్ర్ట ఎన్నికల కమిషన్ (STATE Election Commission) రెండు రోజుల కిందట నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. కడప జెడ్పీ చైర్మన్, కర్నూలు జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు ( Co-option members), 28 మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవులు, 23 మంది వైస్ ఎంపీపీలు, 214 మంది ఉప సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఖాళీగా ఉన్న స్థానాల పదవుల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 27వ తేదీ ఎన్నికలు నిర్వహించాలని షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో కడప జెడ్పీ చైర్మన్ పదవి తోపాటు ఖాజీపేట, రాయచోటి, ఒంటిమిట్ట మండల ప్రజా పరిషత్ (Mandala Praja parishat - MPP) ఉపాధ్యక్ష పదవులు దక్కించుకోవడం కూడా వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారినట్లు భావిస్తున్నారు.
కడప జెడ్పీ స్థితి
2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప జిల్లాలోని 50 మంది జెడ్పీటీసీ స్థానాలకు నిర్వహించారు. అప్పటి అధికార వైసీపీ ప్రభుత్వంలో అన్ని స్థానాలు తమ ఖాతాలో వేసుకుంటే బాగుండదని భావించినట్లు ఉంది. బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలం నుంచి మాత్రమే జయరామిరెడ్డి టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు విజయం సాధించారు. మిగతా 49 స్థానాల్లో వైసీపీ జెడ్పీటీసీ సభ్యులు విజయం సాధించారు.
వారిలో పులివెందుల జెడ్పీటీసీ సభ్యుడు మరణించడం, రాజంపేట నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన అమరనాథరెడ్డి ఒంటిమిట్ట జెడ్పీటీసీ సభ్యుడి పదవికి రాజీనామా చేయడం వల్ల ఖాళీ ఏర్పాడ్డాయి. కడప జెడ్పీలో వైసీపీ బలం 47 మంది జడ్పీటీసీ సభ్యులు.
కడప జెడ్పీలోని38 స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నారు. 11 మండలాల్లో మాత్రమే జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికకు పోలింగ్ జరిగింది.
కూటమి బలం ఎంత?
ప్రస్తుతం టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు ఒకరే ఉన్నారు. పది అసెంబ్లీ స్థానాల్లో ఏడుగురు ఎమ్మెల్యేలు కూటమి నుంచి, ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఈ లెక్కన చూసినా, టీడీపీ ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపినా 8 మందే ఉంటారు. టీడీపీ నుంచి ఒక ఎంఎల్సీ, వైసీపీకి ముగ్గురు ఎంపీల్లో ఒకరు రాజ్యసభ సభ్యుడు ఉన్నారు.
ఇక్కడే తిర'కాసు'..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నేతలపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. అందులో ప్రధానంగా కడప జిల్లాలో దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడం ద్వారా వైఎస్. జగన్ కు చెక్ పెట్టడానికి సీఎం ఎన్. చంద్రబాబు తోపాటు జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రయత్నాలు సాగిస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఆ పార్టీ నేతలు కార్యాచరణ అమలు చేస్తున్నారు. అందులో ప్రధానంగా మాజీ ఎంఎల్సీసీ బీ.టెక్ రవి, ఎంఎల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కడపలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసులు రెడ్డి, ఆయన భార్య కడప ఎమ్మెల్యే మాధవి, రాయచోటి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే
కడప మున్సిపల్ కార్పొరేషన్ లో పాగా వేసే దిశగా ఎమ్మెల్యే మాధవి, ఆమె భర్త శ్రీనివాసులురెడ్డి, టీడీపీ నేతలు వేసిన ఎత్తుతో మాజీ సీఎం వైఎస్. జగన్ కు షాక్ ఇచ్చారు. దాదాపు ఎనిమిది మంది వైసీపీ కార్పొరేటర్లు అమరావతిలో సీఎం చంద్రబాబు సమక్షం లో టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అదేవిధంగా..
జెడ్పీటీసీలు కూడా..
కడప జిల్లాలో వైసీపీకి గుడ్ బై చెప్పిన జెడ్పీటీసీ సభ్యులు టీడీపీ నేతలకు టచ్ లోకి వెళ్లారు. గతంలోనే టీడీపీలో చేరిన ఆరుగురు జెడ్పీటీసీ సభ్యులు మాజీ ఎంఎల్సీ బీ.టెక్ రవి, ఎంఎల్సీ భూమిరెడ్డికి కనుసైగ దగ్గరలో ఉన్నట్లు సమాచారం. ఇంకొందరికి కూడా గాలం వేయడం ద్వారా కడప జెడ్పీలో పాగా వేయాలనేది టీడీపీ ఆలోచనగా ఉన్నట్లు చెబుతున్నారు.
జగన్ అలర్ట్..
ఎన్నికలకు ముందే కొందరు అసంతృప్తితో టీడీపీలో చేరడం వైసీపీకి దెబ్బ తగిలింది. ఆ తరువాత కడప, ప్రొద్దుటూరులో కార్పొరేటర్లు పార్టీని వీడడంతో వైఎస్. జగన్ అలర్ట్ అయ్యారు. జిల్లాలోని పార్టీ నేతలు, తన తమ్ముడు, కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డి, మేనమామ, మాజీ ఎమ్మెల్యే పి. రవీంద్రనాథరెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ద్వారా మిగతా కార్పొరేటర్లు, జెడ్పీటీసీ సభ్యులను తాడేపల్లికి పిలిపించుకుని, మాట్లాడారు.
"మళ్లీ మనమే అధికారంలోకి వస్తాం. కష్టాలు కొన్నాళ్లే. ఓపిక పట్టండి" అని వారందరికి వైఎస్. జగన్ ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఎక్కడికక్కడ టీడీపీ కూటమి నేతలు అవకాశం దొరికిన చోటల్లా వైసీపీకి చెక్ పెట్టడానికి ప్రయత్నాలు చేయడంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. సుతిమెత్తగానే కార్యాచరణలోకి దిగుతున్నారు. అందుకు నిదర్శనం..
తిరుపతిలో ఏమి జరిగింది?
వైసీపీ అధికారంలో ఉండగానే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. తిరుపతి కార్పొరేషన్ లోని 50 డివిజన్లలో టీడీపీ సీనియర్ నేత ఆర్ సీ. మునికృష్ణ మాత్రమే గెలిచారు. మిగతా 49 స్థానాలు వైసీపీ ఏకపక్షంగా దక్కించుకుంది. ప్రభుత్వం మారిన తరువాత గత నెలలో నిర్వహించిన డిప్యూటీ మేయర్ ఎన్నికలో వైసీపీ నుంచి టీడీపీ వెళ్లిన 26 మంది మద్దతు తెలపడంతో అధికార పార్టీ నేత డిప్యూటీ మేయర్ అయ్యారు. ఇదే తరహా ప్లాన్ కడప జెడ్పీ చైర్మన్ దక్కించుకోవడంలో కూడా టీడీపీ కూటమి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
వైసీపీకి ప్రతిష్టగా మారడంతో గతంలోనే జెడ్పీటీసీ సభ్యులను తాడేపల్లికి పిలిపించుకున్న మాజీ సీఎం వైఎస్. జగన్ మాట్లాడారు. పులివెందు పర్యటన సమయాల్లో కూడా అప్రమత్తం చేస్తూనే ఉన్నారు.
రాజంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ముందు ఆకేపాటి అమరనాథరెడ్డి జెడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో వైసీపీ అభ్యర్థికి మైదుకూరు నియోజకవర్గం బ్రంహ్మంగారి మఠం (బి.మఠం) జెడ్పీటీసీ సభ్యుడు రామ గోవిందరెడ్డిని ఆ పదవికి వైసీపీ ఎంపిక చేసింది. ఈయనపై కూడా కొందరి సభ్యుల్లో అసంతృ ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ సభ్యులు పక్కచూపులు చూస్తున్నట్లు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డి పందేరాలకు కూడా తెరతీసినట్లు చెబుతున్నారు. ఇది ఎంత వరకు సఫలం అవుతుంది. కడప జెడ్పీని టీడీపీ దక్కించుకుంటే మాత్రం, వైఎస్. జగన్ కు గట్టి దెబ్బ తగిలినట్లే.
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు కాంట్రాక్టు పనులు చేశారు. దీనికి సంబంధించిన బిల్లులు మాత్రం సకాలంలో మంజూరు కాలేదు. వడ్డీలకు అప్పు చేసి, పనులు చేసినా బిల్లలు మంజూరు కాని స్థితిలో వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. పులివెందుల ప్రాంతంలో అయితే, జగన్ ముందే బాహాటంగా నిలదీసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. రూ. కోట్ల రూపాయల బిల్లుల కోసం పడిగాపులు కాస్తున్నారు. వడ్డీలు చెల్లించలేని స్థితిలో సతమతం అవుతున్నామని పులివెందుల పర్యటనలో జగన్ ముందు గోడు వెళ్లబోసుకున్న నేతలకు "అన్నా.. అవసరమైతే కోర్టుకు పోదాంలే" అని జగన్ చేసిన వ్యాఖ్యలు పుండుమీద కారం చల్లినట్లు మండిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో జెడ్పీని వైసిపీనే దక్కించుకుంటుందా? కూటమి నేతల వ్యూహం ఏమిటనేది వేచిచూడాల్సిందే.

Similar News