రాత్రి 9 గంటలకు జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ సెక్యూరిటీ మధ్య వేదికపై రావడమే ఆలస్యం. సభ హోరెత్తింది. వచ్చీ రాగానే తనకు కేటాయించిన కుర్చీ వద్ద ఉంచిన ఉపన్యాసం ప్రతులను చేతికి తీసుకుని ఉపన్యాసం ప్రారంభించారు. తన సహజ శైలిలో పూనకంతో ఊగిపోయిన పవన్ కల్యాణ్ జన సైనికులను ఊర్రూతలూగించారు
మెగా ఎంట్రీ కూడా..
అది 2008 ఆగష్టు 6 తిరుపతి నగరం
రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మాజీ మంత్రి, సినీ కథానాయకుడు కొణిదెల చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి క్లాప్ కొట్టిన తీరు, ఆయన వేదికపైకి రావడం అనేది సినిమా సీన్ కు ఏమాత్రం తీసిపోలేదు. తిరుమలలో శ్రీవారి దర్శనం తరువాత కుటుంబం తోసహా చిరంజీవి తిరుమలలో మకాం వేశారు.
తిరుపతి నగరం అవిలాల చెరువులో పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాటు చేశారు. సాయంత్రం సుమారు ఐదు నుంచి 5.30 గంటల మధ్య ఠాకూర్ చిత్రంలోని సినీగేయం
"నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం భువనఘోషకి అశ్రువొక్కటి ధారపోశాను" అనే గీతం బ్యాక్ డ్రాప్ లో మారుమోగుతుండగా, చిరంజీవి వేదికపైకి వచ్చారు. ఆయన మినహా మిగతా నాయకులు ఎవరీని వేదికపై ఉంచలేదు. భారీ బోర్డు సమీపంలో నిలయడిన భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిని కూడా పార్టీ శ్రేణులు కిందికి దించేశాయి.
సీన్ మారింది...
పిఠాపురంలో కూడా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు మాట్లాడిన తరువాతే. రాత్రి 8.50 నిమిషాలకు పవన్ కల్యాణ్ కూడా భీమ్లానాయక్ సినిమాలో పాట బ్లాక్ డ్రాప్ లో హోరెత్తిస్తుండగా, వేదికపైకి చేరుకున్నారు. ఆయన పెద్దన్న మెగాస్టార్ చిరంజీవి అనుసరించిన పద్ధతికి వినూత్నంగా వ్యవహరించారు. వేదికపై తనతో పాటు 250 మందికి అవకాశం కల్పించడం ద్వారా తీన ప్రత్యేకత చాటుకున్నారు.
పిఠాపురం ప్లీనరీ వేదికపై నుంచి పవన్ కల్యాణ్ తన సహజసిద్ధ హావభావాలతో పూనకంతో ఊగిపోవడం ద్వారా జనసైనికులకు మరింత ఉత్సాహం ఊపు ఇచ్చారు.
టీడీపీని నిలిపా...
ప్రసంగం ప్రారంభంలోనే పవన్ కల్యాణ్ టీడీపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"పదేళ్లపాటు పార్టీని నడపడానికి చాలా కష్టపడ్డాను. ఇన్నేళ్లకు ప్రజల ఆశీస్సులతో కల సాకారమైంది. ఇదే పరిస్థితిలో టీడీపీకి కూడా అధికారం రావడానికి ఊరిపిపోశాం" అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
"తాను ప్రధానంగా జనసేన వల్లే టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి కారణం" అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో సభ దద్దరిల్లింది. కూటమి అధికారంలోకి రావడానికి జనసేన పాత్రే కీలకమైందని ఆయన మితిమీరిన ధీమా వ్యక్తం చేసినట్లు కనిపించింది. జనసేన 21 సీట్లు సాధించింది అంటే, పార్టీపై ప్రజలకు విశ్వాసం ఏర్పడింది. టీడీపీకి కూడా లాభించిందనే అభిప్రాయం ఆయన నుంచి వ్యక్తమైంది.
అంతేకాకుండా రాష్ట్రాన్ని అభివృద్దిలోనే కాదు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి, అరాచక శక్తుల పీకమణచడానికి రుద్రవీణ మోగిస్తా... అగ్నిధారలు పారిస్తా.. కృష్ణమాచార్యలు మాటలను పవన్ కల్యాణ్ ప్రస్తావించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రేకెత్తించారు.