చంద్రబాబు రెండో నియోజవర్గం వెదుకుతున్నారా? అదెక్కడ?

సిఎం జగన్ కుప్పం మీద ప్రత్యేక దృష్టిపెట్టడంతో ఎందుకైనా మంచిదని టిడిపి అధినేత చంద్రబాబు రెండో సురక్షిత చోటు కోసం అన్వేషిస్తున్నట్లు సంకేతాలు. ఎక్కడది?

Update: 2023-12-28 06:50 GMT
చంద్రబాబు రెండో నియోజకవర్గం గురించి యోచిస్తున్నట్లు సమాచారం


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175లో ముందుకు దూసుకుపోతున్నా, ఆయన కూడా ప్రమాద సంకేతాలను పసిగడుతున్నారు.  ఎన్నికల ప్రవాహం సుడిగుండాలను దాటుకునేందుకు చాలా కసరత్తు చేస్తున్నారు.  ఎమ్మెల్యేలను మారుస్తున్నారు. కొత్త గుర్రాలను వెదుకుతున్నారు. పాతగుర్రాలను బయటికి పంపుతున్నారు. ఇంకా ఏమేమి చేస్తారో తెలియదు.

తెలంగాణలో బాహుబలి అని పేరున్న కెసిఆర్ చతికిల పడ్డాక, ప్రమాదాలు ఎక్కడైనా, ఎవరికైనా ఎదురు కావచ్చని ఆంధ్రా బా హుబలి అని బావిస్తున్న జగన్ లో కూడా మార్పు వచ్చింది.

ఇదే ప్రమాద భయం తెలుగుదేశం పార్టీలో కనిపిస్తూ ఉంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి వాతావరణం కొద్దిగా అనుకూలంగా మారినట్లు కనిపిస్తున్నా, లోన భయం వెంటాడుతూనే ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు ఎపుడు లేని విధంగా తీర్థయాత్రలు, యాగాలు, క్రతువులు చేస్తున్నారు.ఇంకా ఏమిచేస్తారో ఎవరూ వూహించలేకపోతున్నారు.

ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ క్యాంపు నుంచి కొన్ని ఆసక్తికరమయిన సంకేతాలు వెలువడుతున్నాయి.

2024 ఎన్నికల్లో ఆయన రెండు నియోజకవర్గాలనుంచి పోటీ చేయవచ్చట. ఇపుడాయన కుప్పం నియోజవవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ ఆయనకు ఎపుడూ ఒటమి ఎదురుకాలేదు. అయితే, ఈ సారి ఎలాగైన కుప్పం లో బాబు ను ఓడించాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. ఆయనకు తోడుగా చంద్రబాబు పాత ప్రత్యర్థి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి తోడయ్యారు. చిత్తూరు జిల్లాలో పార్టీ రాకపోయినా పర్వాలేదు, చంద్రబాబు ను ఒక్కసారి కుప్పంలో ఓడించాలని వాళ్లు ధ్యేయంగా పెట్టుకున్నారట. అలా గే పనిచేస్తున్నారు. ఈ భయం టిడిపిలో ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. "చంద్రబాాబు రాయలసీమను వదలుకోరు. అయితే, ఈ సారి ఉత్తరాంధ్ర నుంచి కూడా పోటీచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి," సీనియర్ నాయకులొకరు వెల్లడించారు.

కుప్పంలో ప్రమాదం ఎదురయ్యే సూచనలు పసిగట్టే చంద్రబాబు 2024లో రెండు నియోజకవర్గాలలో పోటీ చేస్తారా?  ఆరోజుల్లో చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకునేందుకు కారణం ఇక్కడ రెడ్లు ఎక్కవగా లేకపోవడం, బిసిలు ఎక్కువగా ఉండటం. ఇలాంటి మరొక నియోజకవర్గం కోసం ఆయన అన్వేషిస్తున్నట్లు తెలుస్తున్నది.

ఇలా ప్రత్యర్థి రెడ్ల ప్రాబల్యం తక్కువగా ఉండి, బిసిలు లేదా ఇతర నాన్ రెడ్డి లు అధికంగా ఉండే ఏరియా ఆంధ్రాలో ఉత్తరాంధ్ర ఒక్కటే. అందువల్ల ఆయన ఆ ప్రాంతానికి చెందిన మరొక వర్గం నుంచి పోటీచేస్తే ఎలా ఉంటుందనే చర్చ జరుగుతూ ఉన్నట్లు సమాచారం. ఉత్తరాంధ్రలోని భీమిలి నియోజకవర్గం గురించి దీనికోసం ఆరా తీస్తున్నట్లు, కొన్ని సర్వేలు కూడా చెేయిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో వినబడుతూ ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో పార్టీనేతలు రెండు చోట్ల పోటీ చేయడం సాధారణంగా జరగదు . ఇలా చేసిన వాళ్లు నష్టపోయారు. ఉదాహరణకు ఎన్టీరామారావు రెండో నియోజకవర్గంగా ఎన్నుకున్న తెలంగాణ కల్వకుర్తి నియోజకవర్గం(1989)లో ఓడిపోయారు. తర్వాత ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పాలకొల్లు, తిరుపతి నుంచి 2009 ఎన్నికల్లో పోటీ చేసి తిరుపతి నుంచి మాత్రమే గెలిచారు. పాలకొల్లులో ఓడిపోయారు. తర్వాత ఆయన సోదరుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవణ్ కల్యాణ్ భీమవరం,గాజువాక నుంచి 2019 ఎన్నికలో పోటీ చేసి రెండుచోట్ల ఓడిపోయారు. తర్వాత తెలంగాణలో బిఆర్ ఎస్ ముఖ్యమంత్రి 2023 ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేసి కామారెడ్డి లో ఓడిపోయారు.

ఏదో ఒకచోటనైనా గెలవొచ్చననే ఉద్దేశంతోనే చంద్రబాబు రెండు బిసి నియోజకవర్గాలనుంచి పోటీచేయాలని భావిస్తున్నట్లు వినికిడి.భీమిలి నియోజకర్గం రెడ్ల ప్రాబల్యం తక్కువ. కాపులు ఎక్కువ. జనసేనతో పొత్తు ఉంటుంది కాబట్టి కాపుల ఓట్లు చీల్చవచ్చు. అది టిడిపికి పనికొస్తుంది.

ఇలాంటి నియోకవర్గం మరొకటేమయినా ఉందా అనేది కూడా పార్టీనేతలు అన్వేషిస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News