రాయలసీమ బడుల్లో పిల్లలు అయ్యవార్లు ఎలా ఉంటారు?

వృత్తి ఒకటే అయినా ప్రాంతీయ అనుభవాలు వేరుగా ఉంటాయి. కొంతమంది టీచర్ల రాయలసీమ ప్రాంతీయ అనుభవాల ముచ్చటైన కథా సంకలనం

Update: 2024-09-03 06:55 GMT

-కెపి ఆశోక్ కుమార్

ఉపాధ్యాయ వృత్తి - వారి జీవితాలను వివరిస్తూ తెలుగులో వందలాది కథలు వచ్చాయి, వస్తున్నాయి. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు, లేనివారు కూడా ఇలాంటి కథలు రాసినా, ఈ కథలలో అత్యధిక శాతం ఆదర్శవాద ధోరణులను ప్రతిబింబించేవే. "బడి, బడి కథలు, చదువు, టీచర్ " మొదలైన ఉపాధ్యాయ కథా సంకలనాలు కూడా వచ్చాయి. ఇప్పటివరకు వచ్చిన ఇలాంటి సంకలనాలు వేరు."రాయలసీమ ఉపాధ్యాయ కథలు" పేరిట వచ్చిన ఈ సంకలనం వేరు. రాయలసీమకి ప్రత్యేకమైన రాయలసీమ రచయితల వస్తు వైవిధ్యాన్ని అంశాల వారిగా విభజిస్తూ, "రాయలసీమ రచయిత్రుల కథలు,
రాయలసీమ ప్రేమకథలు, రాయలసీమ కరువు కథలు, రాయలసీమ హాస్య కథలు, రాయలసీమ వ్యంగ్య కథలు" సంకలనాలుగా తీసుకువస్తున్న డాక్టర్ ఎం హరి కిషన్ - ఈసారి" రాయలసీమ ఉపాధ్యాయ కథల"ను తీసుకువచ్చారు.
రాయలసీమకు చెందిన ఉపాధ్యాయులు విద్యావ్యవస్థ, విద్యార్థుల చుట్టూ రాసిన కథలను ఇందులో ఎంపిక చేసుకోవడం జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు అన్న తేడా లేకుండా పాఠశాల నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఉన్న అన్ని కథలు, అందరి కథలు ఇందులో తీసుకున్నారు. అంతేకాకుండా స్వల్పకాలం మాత్రమే ఉపాధ్యాయులుగా పనిచేసి ఇతర రంగాలకు వెళ్లిపోయిన వారిని, టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి టీచర్ కాలేకపోయిన, ఒకరిద్దరి కథలు పిల్లల పట్ల వారికి ఉన్న ప్రేమ వల్ల తీసుకున్నామని సంపాదకులు తెలియజేస్తున్నారు.
ఈ సంకలనంలో నాలుగు తరాల కథకులు ఉన్నారు. ఇందులో ఊరి బడిలో పని చేసే ఉపాధ్యాయుల దగ్గర నుంచి విశ్వవిద్యాలయాల్లో పనిచేసే ఆచార్యుల వరకు ఉన్నారు. అది ఊరి బడి అయినా విశ్వవిద్యాలయమైనా నిత్యం అనేక వర్గాల, నేపథ్యాల, మనస్తత్వాల పిల్లలను వారి తల్లిదండ్రులను దగ్గరగా చూసి అవకాశం అధ్యాపకులకు ఉంటుంది. అంతేకాదు. అనివార్యంగా నైనా ఆయా విద్యాసంస్థల చుట్టూ కొన్ని రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, స్థానిక సమాజం ఉంటాయి. వాటన్నింటిని పరిశీలించి స్వయంగా ఉపాధ్యాయులైన వారు తమదైన సామాజిక దృష్టితో ఈ కథలను చెప్పడం వల్ల ఈ సంకలనానికి ఒక నిండుదనం, ప్రత్యేకత వచ్చింది. ముఖ్యంగా రాయలసీమలోని కొన్ని పల్లెల్లో ఈనాటికి కొనసాగుతున్న భూస్వామ్య భావజాలం, కులవివక్షతతో పాటు - ఈ కార్పోరేట్ యుగంలో విద్యావ్యవస్థలో ఎన్ని రకాల జాడ్యాలు ఉన్నాయో అన్నింటిని " రాయలసీమ ఉపాధ్యాయ కథలు" పట్టుకోగలిగాయి. వైవిద్య భరితమైన 42 కథలతో ఉన్న ఈ సంకలనం ఆసక్తిగా చదివింపజేస్తుంది. (కెపిఆశోక్ కుమార్ ఎఫ్  బి వాల్ నుంచి తీసుకున్నది.)
("రాయలసీమ ఉపాధ్యాయ కథలు" సంపాదకత్వం: డాక్టర్ ఎం హరికిషన్ ప్రచురణ మరియు ప్రతులకు: దీప్తి ప్రచురణలు.,విజయవాడ -2 మరియూ 94410 32 212 పేజీలు 304 వెల 300రు.)


Tags:    

Similar News