టీటీడీ యాజమాన్యాన్ని దేవుడు కూడా క్షమించడు: సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని
రెండవ రోజు నిరవధిక దీక్షలో ఉన్న కందారపు మురళిని టిటిడి అటవీ కార్మికులను తెలంగాణ సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని పరామర్శించారు. సంఘీభావం తెలిపారు.
By : The Federal
Update: 2024-01-28 12:41 GMT
టీటీడీ యాజమాన్యాన్ని పాలక మండలి దేవుడు కూడా క్షమించడని తెలంగాణ సిపిఐ ఎమ్మెల్యే, తెలంగాణ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ రోజు రెండవ రోజు నిరవధిక దీక్షలో ఉన్న కందారపు మురళిని, టిటిడి అటవీ కార్మికులను ఆయన పరామర్శించారు ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ 1159 రోజులుగా టీటీడీ అటవీ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే టీటీడీ యాజమాన్యం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ గా ఉన్నా ఆమరణ నిరాహార దీక్షలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందంటే పరిస్థితి ఏమిటో అర్థం అవుతుందని తక్షణం ఈ సమస్యల్ని పరిష్కరించాలని కోరారు.
జూనియర్లను పర్మినెంట్ చేసి, సీనియర్లను వీధుల పాల్జేయటం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని అన్నారు. మూడు సంవత్సరాల రెండు నెలలుగా నిరాహార దీక్షలు చేస్తున్న అటవీ కార్మికులకు, వారి విజయాన్ని కాంక్షిస్తూ నిరవధిక నిరాహార దీక్షలకు కూర్చున్న కందారపు మురళి మరో ఎనిమిది మంది అటవీ కార్మికులకు ఆయన రెడ్ సెల్యూట్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మురళి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ సిపిఎం జిల్లా కార్యదర్శి వనవాసి నాగరాజు సిఐటియు జిల్లా అధ్యక్షులు జి. బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
ఫారెస్ట్ కార్మికుల సమస్యపై ఉయ్యాల పాటతో అలరించిన నాగరాజు
అటవీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి పోరాటం, అధికార పార్టీ అవకాశవాదం తదితర అంశాలతో అప్పటికప్పుడు తయారుచేసిన పాటను సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు ఉయ్యాల - ఉయ్యాల పేరుతో పాడిన పాట కార్మికులను, సంఘీభావంగా వచ్చిన ప్రజలను అలరించింది.
అంగన్వాడి మహిళల కోలాటం, గొబ్బెమ్మ పాట
నిరవధిక దీక్షలకు మద్దతుగా విచ్చేసిన అంగన్వాడీ యూనియన్ నేత నాగరాజమ్మ అంగన్వాడీ మహిళలు కోలాటాన్ని గొబ్బెమ్మ పాటలను దీక్షా శిబిరం ఎదుట ప్రదర్శించారు ఎంతగానో ఆకట్టుకున్నది. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు చంద్రశేఖర్ భాగవతార్ ఆధ్వర్యంలో తమ పాటలతో కచేరిని నిర్వహించారు.
వివిధ కార్మిక సంఘాల సంఘీభావం
రెండవ రోజు నిరవధిక దీక్షలకు తిరుపతి నగరంలోని వివిధ కార్మిక సంఘాలు, జిల్లాలోని వివిధ యూనియన్లు, ప్రముఖులు హాజరై సంఘీభావం ప్రకటించారు. మరొక వైపు, ఈ రోజు రమాదేవి హాస్పిటల్ తరపున వైద్యులు, వారి సిబ్బంది దీక్షలలో ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. బిపి, షుగర్, పల్స్ ను చెక్ చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అటవీ కార్మికుల యూనియన్ నేతలు ఈశ్వర్ రెడ్డి, ఏ. పురుషోత్తం, బి. మునికృష్ణయ్య, ఏ. కృష్ణమూర్తి, ఆర్. విశ్వనాథం, ఏ. రామ్మూర్తి రెడ్డి, వై. శ్రీనివాసులు ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు ప్రకటించారు.