కడపలో టెన్షన్..టెన్షన్
ఎంపీడీవోపై దాడిని కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు బాధితుడిని పరామర్శించనున్నారు.
By : The Federal
Update: 2024-12-28 06:20 GMT
కడప జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో టెన్షన్ నెలకొంది. వైఎస్‌ఆర్‌సీపీ నేతల దాడిలో గాయపడిన ఎంపీడీవో జవహర్‌బాబు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడుని పరామర్శించేందుకు పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. ఆసుపత్రికి వెళ్లి జవహర్‌బాబును కలిసి ధైర్యం చెప్పనున్నారు. మరో వైపు నిన్నటి వరకు కడప జిల్లా పర్యటనలో ఉన్న మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బెంగుళూరుకు వెళ్లి పోయారు. ఒక వేళ జగన్ బెంగుళూరుకు వెళ్లకుండా కడపలోనే ఉండి ఉంటే ఏమి జరుగుతుందో అనే ఉత్కంఠ ఉండేది. అయితే జగన్ బెంగుళూరుకు వెళ్లి పోవడంతో ఆ ఉత్కంఠ వాతావరణం కాస్తా తగ్గింది.
ఉమ్మడి కడప జిల్లాలో విధినిర్వహణలో ఉన్న ఎంపీడీవోపై దాడి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన నాయకులు ఎంపీడీవో మీద దాడికి దిగడం కలకలం రేపింది. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపైన వైఎస్‌ఆర్‌సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, అతని అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం ఈ సంఘటనను చాలా సీరియస్‌గా తీసుకుంది. దాడికి పాల్పడిన వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. నిందితుడు సుదర్శన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈడ్చుకుంటూ పోలీస్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎంపీడీవో దాడిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న అధికారిపై దాడికి చేయడాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ తీసుందన్నారు. గాయపడిన ఎంపీడీవో జవహర్‌బాబు ప్రస్తుతం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో దౌర్జన్యాలు, రౌడీ చర్యలకు తావు లేదని, గాయపడిన ఎంపీడీవోకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.