ఏపీ ఐపీఎస్‌ల్లో బదిలీల టెన్షన్‌

సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఐపీఎస్‌ల ట్రాన్స్‌ఫర్లపై కసరత్తు ముమ్మరం చేసింది. ఎంత మందికి పోస్టులిస్తారు? ఎంత మందిని జీఏడీకి అటాచ్‌ చేస్తారనేది హాట్‌ టాపిక్‌గా మారింది.

Byline :  The Federal
Update: 2024-06-29 12:47 GMT

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు అధికారుల బదిలీలు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఐఏఎస్‌ అధికారుల బదిలీల ప్రక్రియను చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తాజాగా ఐపీఎస్‌ అదికారుల ట్రాన్స్‌ఫర్లపై దృష్టి సారించింది. అదనపు డీజీలు, ఐజీలు, డీఐజీలతో పాటు జిల్లా ఎస్పీల బదిలీలపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇదే సమయంలో ఐపీఎస్‌ అధికారుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ఎవరిని ఎక్కడకు బదిలీ చేస్తారు, ఎలాంటి పోస్టులు ఇస్తారు, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారనే కారణంతో ఎవరిని జీఏడీకి అటాచ్‌ చేస్తారనే దానిపై అధికార వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

ఎన్నికలకు ముందు డీజీపీగా పని చేసిన రాజేంద్రనాథ్‌రెడికి ఇది వరకు ఏబీ వెంకటేశ్వరరావు పని చేసిన ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌గా బదిలీ చేసింది. విశాఖపట్నం పోలీసు కమిషనర్‌గా ఉన్న రవిశంకర్‌ అయ్యన్నార్‌ను సీఐడీ ఏడీజీగా బదిలీ చేసింది. ఆ స్థానంలో ఇప్పటి వరకు శాంతి భద్రతల అదనపు డీజీగా ఉన్న మరో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి శంకర్‌ బ్రత బాగ్చీని నియమించింది. ఎన్నికల సమయంలో డీజీపీగా పని చేసిన హరిష్‌కుమార్‌ గుప్తాను ఆ బాధ్యతల నుంచి రిలీవ్‌ చేసింది. కొత్త పోలీసు బాస్‌గా సిహెచ్‌ ద్వారకా తిరుమలరావును నియమించింది. ఏపీఎస్పీ బెటాలియన్‌ అదనపు డీజీగా ఉన్న అతుల్‌ సింగ్‌ను ఏసీబీ డైరెక్టర్‌గా నియమించింది.
ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా మహేష్‌ చంద్ర లడ్హా
ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి మహేష్‌ చంద్ర లడ్హాను నియమించేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న లడ్హాను ఏపీకి రిలీవ్‌ చేయాలని ఇది వరకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం, దానిని కేంద్రం ఆమోదించడం జరిగాయని పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. లడ్హా ఇప్పటి వరకు సెంట్రల్‌ సర్వీసుల్లో ఉన్నారు. 2019లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లారు. సీఆర్‌పీఎఫ్‌ ఐజీగా ఉన్నారు.
ఏపీఎస్‌ఆర్‌టీసీ ఎండీ అండ్‌ వైస్‌ చైర్మన్‌గా బాలసుబ్రహ్మణ్యం
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఎన్‌ బాలసుబ్రహ్మణ్యంకు ఏపీఎస్‌ఆర్‌టీసీ ఎండీ, వైస్‌ చైర్మన్‌ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. బాలసుబ్రహ్మణ్యం గత టీడీపీ ప్రభుత్వంలో కీలక అధికారిగా పని చేశారు. 2014లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ట్రాన్స్‌ పోర్టు కమిషనర్‌గాను, ఇంటెలిజెన్స్‌ ఐజీగా పని చేశారు. 2019లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో బాలసుబ్రహ్మణ్యంకు తిరిగి మంచి పోస్టింగ్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాల్లో చర్చ ఉంది.
ఇది వరకే పలువురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను సాధారణ పరిపాలన శాఖకు అటాచ్‌ చేశారు. గత ప్రభుత్వంలో కీలకంగా పని చేశారనే కారణంతో ఫైర్‌ అదనపు డీజీగా ఉన్న పీవీ సునీల్‌ కుమార్‌ను, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న మరో అదనపు డీజీ ర్యాంకు అధికారి పీ సీతారామాంజనేయులును, సిట్‌ ఇన్‌చార్జిగా ఉన్న ఐజీ ర్యాంకు అధికారి డాక్టర్‌ కొల్లిరఘురామిరెడ్డిని, చిత్తూరు జిల్లా ఎస్పీగా పని చేసిన రిశాంత్‌రెడ్డిని జీఏడికి రిపోర్టు చేయాలని ఆదేశించారు.
Tags:    

Similar News