అలా చేరారు.. ఇలా టికెట్‌ కొట్టేశారు

కొంత మందికి ఏళ్ల తరబడి ఒకే పార్టీని నమ్ముకున్నా టికెట్లు దక్కడం లేదు. మరి కొంత మంది అలా పార్టీలో చేరుతారు. ఇలా టికెట్లు కొట్టేస్తున్నారు.

Update: 2024-04-02 12:45 GMT
పవన్ కళ్యాణ్

జి. విజయ కుమార్ 

ఎప్పుడు వచ్చామన్నది కాదు.. బుల్లెట్‌ దిగిందా లేదా అనేది పోకిరి సినిమాలో మహేష్‌ బాబు ఫేమస్‌ డైలాగ్‌. సరిగ్గా ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రాజకీయ పార్టీల్లో జరుగుతోంది. ఎమ్మెల్యే టికెట్ల కోసం పార్టీలను అలా వదిలేస్తున్నారు.. అప్పటి వరకు ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలో ఇలా చేరేస్తున్నారు. అంతటితో ఆగరు. ఆయా పార్టీల కోసం పని చేసిన వారిని తొక్కి పడేసి చిటికెలో టికెట్‌ కొట్టేస్తున్నారు. ఏళ్ల తరబడి తెలుగుదేశం పార్టీలో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన మండలి బుద్దప్రసాద్, తెలుగుదేశం పార్టీకి నమ్మిన బంటుగా పని చేస్తూ వచ్చిన నిమ్మక జయకృష్ణలు ఆ పార్టీని వదిలేసి సింపుల్‌గా స్థానాలు సంపాదించుకున్నారు. తాజాగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పార్టీలు.. వాటి సిద్ధాలు ముఖ్యం కాదు. సీట్లు.. అధికారమే ముఖ్యమన్నట్లుగా నేతలు, పార్టీల పెద్దలు మారిపోయారు.

మండలి బుద్దప్రసాద్‌
ఈయన రాజకీయ ప్రయాణం కాంగ్రెస్‌తో మొదలైంది. తండ్రి మండలి వెంకటకృష్ణారావు రాజకీయ వారసత్వంతో పాలిటిక్స్‌లోకి ప్రవేశించారు. ఆ పార్టీలో రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రి వర్గంలో కూడా ఆయన ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేశారు. విభజన అనంతరం ఆ పార్టీ కష్టాల్లోకి కూరుకొని పోయింది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఉనికే లేకుండా పోయింది. దీంతో ఆయన ఆలోచనలో పడ్డారు. దీనిలోనే ఉంటే రాజకీయ భవిష్యత్‌ ప్రశ్నార్థకమే అని భావించారు. తెలుగుదేశం పార్టీలోకి చేరారు. 2014లో అదే పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా పదవి దక్కించుకున్నారు. 2019లో టీడీపీ అభ్యర్థిగానే అవనిగడ్డ నుంచి బరిలోకి దిగారు. అయితే ఆ ఎన్నికల్లో మండలి బుద్దప్రసాద్‌ ఓడిపోయారు. 2024 ఎన్నికల నాటికి స్వరూపం మారిపోయింది. టీడీపీ, జనసేన, బిజెపీ పొత్తుల్లో భాగంగా అవనిగడ్డను జనసేనకు కేటాయించాలని నిర్ణయం చేసుకున్నారు. అంటే టీడీపీకి ఆ సీటు లేనట్టే అనేది ఆయనకు అర్థమైంది. టీడీపీలో ఉంటే ఆయనకు సీటు దక్కదు. పార్టీ మారాల్సిందే. అంటే జనసేనకు వెళ్తే తప్ప ఆయనకు సీటు దక్కదు. సీటునైనా ఒదులు కుంటారు కానీ పార్టీని వదులు కోరు అని ఆయన అనుచరులు, స్థానికులు భావించారు. కానీ వారి అంచనాలను తారు మారు చేస్తూ రెండు రోజుల క్రితం పిఠాపురం ఎన్నికల ప్రచారంలో ఉన్న పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో మండలి బుద్దప్రసాద్‌ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఇంకేముంది. ఆయనకు అవనిగడ్డ సీటు ఖరారైపోయింది.
నిమ్మక జయకృష్ణ
నిమ్మక కృష్ణ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారు. తండ్రి రాజకీయ వారసుడిగా పాలిటిక్స్‌లోకి వచ్చినా విజయం సాధించలేక పోయారు. టీడీపీ అభ్యర్థిగా పాలకొండ నుంచి రెండు సార్లు వైసీపీ అభ్యర్థి విశ్వసరాయి కళావతిపై పోటీ చేసి ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీలో గ్రూపులు ఏర్పడటం తనకు సహకరించక పోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. నిమ్మక జయకృష్ణ తండ్రి గోపాల్‌రావు ఐదు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి నాలుగు సార్లు విజయం సాధించారు. ఒక సారి అంటే 2009లో నిమ్మక సుగ్రీవుడుపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. అయితే 2024 ఎన్నికల్లో జయకృష్ణ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా పాలకొండ నుంచి రంగంలోకి దిగుతున్నారు. తెలుగుదేశం పార్టీలోనే గ్రూపులతో ఓటమి చవిచూసిన జయకృష్ణ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారా లేదా అనే సందేహమే అంటూ పలువురు వ్యాఖ్యానించడం విశేషం.
Tags:    

Similar News