ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తమ కష్టాలను చెప్పుకునేందుకు వస్తున్న బాధితులను కలవడం మొదలు పెట్టారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలను కూడా కలుస్తూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారం కోసం శ్రీకారం చుట్టారు. ఇదే సమయంలో పోలీసులకు కూడా కొన్ని సూచనలు చేశారు. ప్రజలకు, పార్టీ శ్రేణులకు తనకు మధ్య బ్యారీకేడ్లు వేసి దూరం పెట్టొద్దని, సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలు, పార్టీ శ్రేణులను కలిసేందుకు వచ్చిన సమయంలో నెట్టి వేయొద్దని ఆదేశాలు కూడా ఇవచ్చారు. అంతే కాకుండా మార్గ మధ్యలో కూడా తన కాన్వాయ్‌ని ఆపి ప్రజల వినతులు స్వీకరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పోయిన శనివారం ఒక సంచల నిర్ణయం కూడా ప్రకటించారు. తన కాళ్ళకు ఎవ్వరూ మొక్కొద్దని, కాళ్ళకు దండం పెట్టే సంస్కృతి వద్దని, తల్లిదండ్రులు, గురువులు, భగవంతుడికి మాత్రమే కాళ్ళు మొక్కాలని, నాయకుల కాళ్ళకు ప్రజలు దండాలు పెట్టే విధానం వద్దని, ఈ రోజు నుంచి ఎవరు చేయొద్దని, ఈ దండం పెట్టే విధానానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కాళ్ళకు ఎవరైనా దండం పెడితే మరల తాను వాళ్ళ కాళ్ళకు దండం పెడతానని చెప్పారు. చంద్రబాబు చెప్పిన ఈ మాటలు సంచలనంగానే మారాయి. దీంతో మారో సారి ప్రజలు, పార్టీ శ్రేణుల దృష్టిని ఆకర్షించారు. మంచి నిర్ణయమని అందరూ స్వాగతించారు.
అయితే ఇవన్నీ చేయడానికి ఒక ప్రధాన కారణం ఉందని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహార శైలికి భిన్నంగా వ్యవహరించి, ప్రజల్లో సముచిత స్థానం సంపాదించాలనే దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారనే టాక్ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. గత ఐదేళ్లు జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహార శైలి ప్రజల్లో తిరుగుబాటుకు కారణంగా చంద్రబాబు భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అద్దాల మేడకు మాత్రమే పరిమితమయ్యారు. ప్రజలతో కానీ, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కానీ, చివరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కానీ జగన్ పెద్దగా కలిసింది లేదు. అధికారంలో ఉన్న ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కాకుండా రాజులాగా నియంతృత్వంగా వ్యవహరించారు. దీంతో అటు ప్రజల్లోను, ఇటు ఆ పార్టీ శ్రేణుల్లోను తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇలాంటి వాతావరణం తన పార్టీలో కానీ, తన ప్రభుత్వంలో కానీ రాకుండా జాగ్రత్తలు చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్‌లా కాకుండా చంద్రబాబు అందరిని కలిసి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు పోతున్నారనే ఇండికేషన్ అటు ప్రజలు, ఇటు టీడీపీ శ్రేణులకు ఇచ్చేందుకే తన వ్యవహార శైలిని మార్చుకున్నారనే చర్చ సాగుతోంది. గతంలో మాదిరిగా ఉంటే తన పార్టీకి కష్టాలు తప్పవని, ప్రజలు, పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటేనే భవిష్యత్ ఉంటుందనే ఆలోచనల్లో చంద్రబాబు ఉన్నారని, అందువల్ల ఇదివరకటిలా కాకుండా ఇప్పుడు తన వ్యవహార శైలని మార్చుకున్నారని, అయితే ఇది ఎంత కాలం సాగుతుందనేది వేచి చూడాలనే టాక్ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.