అందుకే మాజీ ఐపీఎస్ ఇక్బాల్‌ను సీఎం చంద్రబాబు పక్కన పెట్టారా?
సీఎం చంద్రబాబుకు వద్ద మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ గతంలో సీఎస్‌ఓగా పని చేశారు. సీ రామచంద్రయ్యకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన చంద్రబాబు ఇక్బాల్‌ను పక్కన పెట్టారు. ఇద్దరు వైసీపీ నుంచి వచ్చిన వారే.
Byline : The Federal
Update: 2024-07-03 06:29 GMT
మాజీ ఐపీఎస్ అధికారి, మాజీ ఎమ్మెల్సీ, ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన నేత షేక్ మహమ్మద్ ఇక్బాల్‌కు టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఇచ్చారా, లేక అంతకంటే మంచి స్థానం ప్రభుత్వంలో కల్పిస్తామని మాట ఇచ్చారా అనేది అటు టీడీపీ శ్రేణులు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని మైనారిటీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
షేక్ మహమ్మద్ ఇక్బాల్ మాజీ ఐపీఎస్ అదికారి. పోలీసు శాఖలో వివిధ హోదాలో పని చేసి ఐజీగా పదవీ విరమణ పొందారు. మంచి అధికారిగా ఆయనకు పోలీసు శాఖలో పేరుంది. అటు మైనారిటీ వర్గాలతో పాటు బడుగు, బలహీన వర్గాల ప్రజలకు తన పరిధిలో న్యాయం చేసేందుకు ముందుండే వారు. పోలీసు అధికారిగా ఉన్నా.. పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు సేవలు అందించడంలో ఆసక్తి కనబరిచేవారు. ప్రత్యేకించి సంక్షేమ ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన రెసిడెన్షియల్ స్కూల్స్‌లో చదువుతున్న పిల్లలను అటు విద్యతో పాటు క్రీడలు వంటి ఇతర ఎక్ట్రా కరిక్యులమ్ యాక్టివిటీస్‌లో ప్రోత్సహించడంలో ముందుండే విధంగా తోడ్పాటును అందించే వారు. వసతి గృహాల్లో సురక్షిత మంచి నీరు సౌకర్యం కల్పించడంలోను, ముళ్ళ కంపలు, ఇతర పిచ్చి చెట్లతో వినియోగానికి పనికి రాకుండ పోయిన ఆట స్థలాలను తనతో పాటు తన పోలీసు సిబ్బందితో క్లీన్ చేయించి విద్యార్థులు ఆటలాడుకునేందుకు అందుబాటులోకి తెచ్చే వారు. దాతల సహాయంతో స్పోర్ట్స్ కిట్‌లు విద్యార్థులకు అందించే వారు. శానిటేషన్ సౌకర్యాలను కూడా కల్పించే వారు. పదవీ విరమణ కాక ముందు రాయలసీమ ఐజీగా పని చేసిన రోజుల్లో కూడా అటు లా అండ్ ఆర్డర్‌తో పాటు ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యారు.
ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పటికీ మైనారిటీ వర్గాల మీద ఉన్న మక్కువతో, వారికి సేవ చేయాలనే లక్ష్యంతో రాష్ట్రం విభజన తర్వాత మైనారిటీ వెల్ఫేర్ తొలి కార్యదర్శిగా, వక్ఫ్ బోర్డు స్పెషల్ ఆఫీసర్‌గా ఇక్బాల్ పని చేశారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుతో సత్సంబంధాలు కలిగి ఉండటంతో మైనారిటీ వెల్ఫేర్ కార్యదర్శిగా వెళ్తాను, అవకాశమివ్వండి అని అడగడంతో వెంటనే ఆదేశాలు జారీ చేస్తూ ఇక్బాల్‌కి కార్యదర్శిగా చంద్రబాబు అవకాశం ఇచ్చారు. దీంతో మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. ప్రత్యేకించి వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం, అవి అన్యాక్రాంతం కాకుండా కాపాడటం కోసం, అప్పటికే ఆక్రమణకు గురైన ఆస్తులను తిరిగి ప్రభుత్వం పరం చేసేందుకు ఎంతగానో కృషి చేశారు. అందుకోసం ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో మోనటరింగ్ కమిటీలను వేసి, అందులో జిల్లా ఎస్పీలను కూడా మెంబర్లుగా నియమించి, తరచుగా సమీక్షలు నిర్వహిస్తూ గట్టిగానే కృషి చేశారు. వక్ఫ్ ఆస్తులను గ్రోత్ ఇంజన్లుగా ఉపయోగించుకోవాలని, తద్వారా వచ్చే ఆదాయాన్ని మైనారిటీల వర్గాల అభివృద్ధికే ఉపయోగించాలనే లక్ష్యంతో పని చేశారు. కానీ ఆయన ఆశించిన మేరకు ఫలితాలు సాధించలేక పోవడంతో, తిరిగి పోలీసు విభాగానికే ఐజీగా వెళ్లి పోయారు. తర్వాత అక్కడే పదవీ విరమణ పొందారు.
ఐజీగా పదవీ విరమణ పొందిన ఇక్బాల్ నాటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పీపీటీల ద్వారా చూపించే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల ఆ ప్రభుత్వంపై ఆసక్తిని కోల్పోయారు. అభివృద్ధిలో అంకెల గారడీలు చేసి చూపిస్తున్నారని నాడు విమర్శలు వెల్లువెత్తడంతో ఆలోచనలో పడిన ఆయన, అవి రియాల్టీకి దగ్గరగా లేవని, దీంతో వైఎస్‌ఆర్‌సీపీలోకి వెళ్లి పోయారు. నాడు టీడీపీలో కూడా ఆయనకు ఆహ్వానం ఉన్నప్పటికీ నాడు టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యక్తమైన వ్యతిరేకత వల్ల వైఎస్‌ఆర్‌సీపీలోకి వెళ్లారనే టాక్ అప్పట్లో వచ్చింది. వైఎస్‌ఆర్‌సీపీలోకి వెళ్లిన ఇక్బాల్‌కు ఆ పార్టీ హిందూపూర్ అభ్యర్థిగా జగన్‌మోహన్‌రెడ్డి అవకాశం కల్పించి 2019లో రంగంలోకి దింపారు. ఆ ఎన్నికల్లో ఓడి పోవడంతో ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని చెప్పిన జగన్ ఆ ప్రకారం ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.
ఎన్నికల ముందు వరకు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీగా కొనసాగిన ఇక్బాల్, నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒంటెద్దు పోకడలు నచ్చక పోవడంతో తన ఎమ్మెల్సీ పదవితో పాటు, వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేసి ఎన్నికల ముందు చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే తిరిగి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారనే ఒప్పందంతోనే వైఎస్‌ఆర్‌సీపీని వీడి టీడీపీలోకి వెళ్లారనే టాక్ అప్పట్లో వినిపించాయి.
ఖాళీ అయిన రెండు స్థానాలు టీడీపీకే కేటాయిస్తారని, సీ రామచంద్రయ్యకు, ఇక్బాల్‌కే తిరిగి అవకాశం కల్పిస్తారని అంచనా వేశారు. కానీ వాటిని తారు మారు చేస్తూ ఒకటి టీడీపీకి, రెండోది జనసేనకు కేటాయించి అందరి ఆశ్చర్యానికి గురి చేశారు. టీడీపీ నుంచి సీ రామచంద్రయ్యకే కేటాయించిన చంద్రబాబు, జనసేన నుంచి హరిప్రసాద్‌కు కేటాయించడంతో ఇక్బాల్‌కు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఇక్బాల్‌కు ఏ పదవి లేకుండా పోయిందనే టాక్ కూడా ఆ పార్టీ వర్గాల్లో ఉంది. గతంలో చంద్రబాబును, ఆయన ప్రభుత్వాన్ని విమర్శించడం వల్లే ఈ సారి అవకాశం ఇవ్వలేదనే టాక్ కూడా ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. అయితే సీఎం చంద్రబాబుకు, ఇక్బాల్‌కు సత్సంబంధాలే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సయమంలో ఇక్బాల్ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి చీఫ్ సెక్యురిటీ అధికారిగా చంద్రబాబు వద్ద పని చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కంటే మంచి అవకాశమే ప్రభుత్వంలో కల్పిస్తారనే టాక్ కూడా ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.