‘తిరుపతి’పట్టణ 894వ ఆవిర్భావ వేడుక ప్రారంభం

‘ఇతింతై వటుడింతై’ అన్నట్లు శ్రీ రామానుజాచార్యులు శేషాచలం కొండల కింద గోవిందరాజపురం అనే గ్రామానికి పునాదీ రాయి వేశారు. అది కాస్త నేడు తిరుపతిగా ప్రసిద్దికెక్కింది.

Update: 2024-02-24 05:48 GMT

తిరుపతి: మన ‘తిరుపతి’కి శనివారం 894వ పుట్టిన రోజు పండగ. దాంతో సంబరాలు అంబరాన్ని అంటాయి. పుర ప్రజలంతా ఏకమై.. తమను అక్కున చేర్చుకున్న తిరుపతి జన్మదిన వేడుకల్లో మేము సైతం అంటూ పాలుపంచుకున్నారు. తిరుపతి పుట్టిన రోజును పురష్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామి చతుర్మాఢ వీధుల్లో నిర్వహించిన ఆధ్యాత్మిక శోభాయాత్రతో తిరునగరి పులకించి పోయింది. గోవింద నామస్మరణతో పరవశించిపోయింది. సద్గురు శ్రీ రామానుజాచార్యులు, తన అమృత హస్తాలతో 24.02.1130 న ఈ పట్టణానికి శంకుస్థాపన చేయడంతో పాటు గోవిందరాజపురంగా నామకరణ చేశారు. అదే నేడు తిరుపతి గా భాసిల్లుతోంది.



 

టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో వరసగా మూడో సంవత్సరంలో కూడా ఆవిర్భావ వేడుకను వైభవోపేతంగా నిర్వహించారు. రెండేళ్ల కిందట నుంచే మన తిరుపతి పుట్టిన రోజు పండగ నిర్వహించే నూతన సంప్రదాయానికి భూమన శ్రీకారం చుట్టి, మూడో సంవత్సరం కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలోనే భూమన కరుణాకర రెడ్డి స్థానిక శ్రీగోవిందరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శోభాయాత్రను ప్రారంభించారు.


 


గోవింద నామ కీర్తనలు, భజనలు చేస్తూ పురప్రజలు భక్తి ప్రపత్తులు చాటారు. ఇటు చెక్క భజనలు, కోలాటాలతో కళాబృందాలు లయబద్ధంగా ఆడుతూ పాడుతూ ముందు వరసలో కదిలాయి. పౌరాణిక వేషధారణలు ఆకట్టుకున్నాయి. వేదపండితులు మంత్రోచ్చారణల మధ్య భక్తి చైతన్య యాత్ర కొనసాగింది.


 


భక్త జనులు బిందెలతో పసుపు నీళ్లు పోసి, ముగ్గులేసి భక్తిపూర్వకంగా స్వాగతించారు. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు తిరుపతి నగర పాలక సంస్థ సహకరించింది. తిరుపతి పుట్టిన రోజు సందర్భంగా పురప్రజలకు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, నగర మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ పాల్గొన్నారు.


Tags:    

Similar News