కేంద్రం వరాలు.. ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం
ఇది తెలుగు ప్రజల విజయం. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం వరాలివ్వడానికి ప్రజల తీర్పే కారణం. ఆ భయంతోనే ఏపీకి కేంద్రం నిధులు కేటాయించింది.
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సముచిత ప్రాధాన్యత నిచ్చింది. ఒక విధంగా వరాల వర్షం కురిపించిందని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ చట్టంలోని అన్ని అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపించింది. ఏపీ రీ ఆర్గనైజేషన్ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన రాయితీలు పదేళ్లు గడిచినా.. కేంద్ర ప్రభుత్వం ఇవ్వ లేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమిలో ప్రధానంగా టీడీపీ, జనసేన, బీజేపీలు అనుకున్న ప్రకారం విజయం సాధించాయి. దీంతో కేంద్రం తన అభిప్రాయాన్ని మార్చుకొని ఏపీ అభివృద్ధికి నిధుల కేటాయింపుల్లో పెద్ద మనసు చేసుకుంది. ప్రధానంగా రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వంటి అంశాలకు నిధులు కేటాయించాల్సి ఉంది. అయితే రైల్వే జోన్ ప్రస్తావనే బడ్జెట్ ప్రసంగంలో కనిపించ లేదు. రైల్వే జోన్ వల్ల వేలాది మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంది. అమరావతి నిర్మాణానికి రూ. 15వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. దీంతో పాటుగా అమరావతి నిర్మాణానికి అవసరమైతే అధిక నిధులు కూడా కేటాయిస్తామని పార్లమెంట్ సాక్షిగా వెల్లడించారు.