నిద్రపోతానని వెళ్లి ఉరేసుకున్న పెళ్లికూతురు
మూడు రోజుల క్రితం ఘనంగా వివాహం జరిగింది. సారె తీసుకెళ్లి సమయంలో పెళ్లికూతురు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది.;
By : The Federal
Update: 2025-02-19 05:44 GMT
అప్పటి వరకు అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రులు గుర్తుకు రావడం లేదు. కష్టాల్లో, బాధల్లో కన్నీళ్లు తుడిచిన కుటుంబ సభ్యులను మరిచి పోతున్నారు. తాను చదువుకున్న చదువు, చేస్తున్న ఉద్యోగం అన్నీ మరిచిపోయి ఇష్టం లేని పెళ్లి చేశారని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాళ్ల పారాణి ఆరక ముందే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగుల్చుతున్నారు. ఇలాంటి దుర్ఘటనే ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. పెళ్లైన మూడో రోజే ఉరిపోసుకొని పెళ్లికూతురు ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఇరు కుటుంబాలు శోక సముద్రంలో మునిగి పోయాయి.
ప్రకాశం జిల్లా కంభం మండలం దేవనగరం గ్రామానికి చెందిన బి లింగయ్య, సువార్తమ్మ దంపతుల కుమార్తె సుస్మితకు, పెద్దారవీడు మండలం సిద్దినాయుడుపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుకు ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. ఇరుకుటుంబాలు అంగీకారం మేరకు మూడు రోజుల క్రింతం ఫిబ్రవరి 16వ తేదీన ఆదివారం నాడు
సుస్మిత, వెంకటేశ్వర్లు పెళ్లిన ఘనంగా జరిపించారు. పెళ్లి వరుడి గ్రామం సిద్దినాయుడుపల్లిలో ఈ వివాహం జరిగింది. అక్కడ నుంచి దేవనగరంలోని అత్తగారి ఇంటికి నూతన పెళ్లి జంట వెంకటేశ్వర్లు, సుస్మిత, బంధువులు వచ్చారు. తిరిగి అత్తగారి ఊరైన దేవనగరం నుంచి సిదిద్దనాయుడుపల్లిలోని వరుడి ఇంటి బుధవారం వెళ్లాల్సి ఉంది. బుధవారం సారె తీసుకొని వెళ్లాలి. దీని కోసం అటు పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు, నూతన జంటతో దేవనగరం వచ్చిన వరుడు బంధువులు సారె పనుల్లో బిజీ బిజీ ఉన్నారు. సారెకు తీసుకెళ్లాల్సిన వస్తువులను సమకూర్చుకోవడంలో పెళ్లి కూతురు తల్లిదండ్రులు, ఇతర బంధువులు బిజీ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో దేవనగరంలోని పెళ్లి కూతురు సుస్మిత ఇంట సందడితో కూడిన హడావుడి వాతావరణం ఉంది.
అయితే ఈ సమయంలో పెళ్లికూతురు సుస్మిత పక్కనే ఉన్న తన బాబాయి వాళ్ల ఇంట్లో కాసేపు పడుకొని రెస్టు తీసుకుంటానని తల్లిదండ్రులు, బంధువులకు చెప్పి వెళ్లింది. పెళ్లికుమారు వెంకటేశ్వర్లు మాత్రం అత్తగారింట్లోనే పడుకొని నిద్రపోయాడు. అయితే మధ్యాహ్నం భోజన సమయం కావడంతో పెళ్లికూతురు సుస్మితను తీసుకొచ్చేందుకు ఆమె సోదరుడు మహేష్ తన బాబాయి ఇంటికెళ్లాడు. నిద్రపోతానని చెప్పి వచ్చిన చెల్లి సుస్మిత బాబాయి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతుండటంతో ఆందోళనకు గురైన మహేష్ ఫ్యాన్‌కు వేలాడుతున్న సుస్మితను కిందికి దింపాడు. ఈ విషయం సమీపంలోనే ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులకు తెలియడంతో పరుగు పరుగున వెళ్లారు. అయితే కొత్తపెళ్లికూతురు సుస్మిత అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. సుస్మిత ఆత్మహత్యకు పాల్పడటంతో ఆమె తల్లిదండ్రులు ఒక్క సారిగా కుప్పకూలారు. ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. పెళ్లికుమారుడు, వారి బంధువులు కూడా విలపించారు.
సారెతో వస్తారని ఎదురు చూసిన పెళ్లికుమారుడి సిద్దినాయుపల్లిలోని వరుడి కుటుంబానికి పెళ్లికుమార్తె సుస్మిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందనే విషయం తెలియడంతో ఒక్క సారిగా షాక్‌కు గురైంది. దీంతో నూతన వధువరుల కుటంబాల్లో విషాదం నెలకొంది. పెళ్లైన మూడు రోజుల్లోనే నవ వధువు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడటంతో రెండు గ్రామాల్లో విషాదం అలుముకుంది. అయితే కొత్త పెళ్లికూతురు సుస్మిత ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే కారణాలు తెలియాల్సి ఉంది. మరో వైపు సుస్మితకు ఇష్టం లేని పెళ్లి చేశారని, అందుకే సుస్మిత ఆత్మహత్యకు పాల్పడిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయాన్ని పెళ్లికుమారుడు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.