ఉలిక్కి పడ్డ డీడీవోలు!

డీడీవో అకౌంట్స్‌ డీటెయిల్స్, రీ కన్సలేషన్‌ వివరాలు ఇవ్వకుంటే జనవరి నెల జీతాలు ఆగుతాయని హెచ్చరించిన ప్రభుత్వం;

Byline :  The Federal
Update: 2024-01-01 14:26 GMT
AP Secretariat

ఉద్యోగులకు నెలవారీ జీతాలు రావాలంటే ప్రతినెలా 20 నుంచి 25వ తేదీలోపు జీతాల బిల్లు ఆన్‌లైన్‌లో సబ్‌మిట్‌ చేయాలి. అలా జరగని పక్షంలో మరుసటి నెల 5వ తేదీపైన సప్లిమెంటరీ బిల్‌ పెట్టుకోవాలి. ఫిబ్రవరి నెల జీతం రావాలంటే ఆ ఏడాదికి సంబంధించి ఇన్‌కంట్యాక్స్‌ పూర్తిగా చెల్లించి, ఐటీ రిటన్‌ పే బిల్‌తో జత చేయాలి. ఇది ఆనవాయితీ.

ఎందుకో ఈ లింక్‌
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఈ ఏడాది జనవరి నెల జీతం రావాలంటేనే డిసెంబరు పే బిల్స్‌ సమర్పించడానికి డ్రాయింగ్‌ అండ్‌ డిజ్బర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ (డిడివో) అకౌంట్‌ డీటెయిల్స్, జీత భత్యాల రీకన్సలేషన్‌ డీటెయిల్స్‌ అప్‌డేట్‌ చేయాలని ప్రభుత్వం లింక్‌ పెట్టింది. ఇప్పటి వరకు ఎప్పుడూ లేనిది ఎందుకు ఇలా చేయమన్నారోననే సందేహం అధికారుల్లో వచ్చింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. డిపార్ట్‌మెంట్స్‌లో కింద నుంచి పై స్థాయి వరకు డిష్కషన్‌ జరిగి అధికారులు వివరాలు ఇవ్వడానికి మల్లగుల్లాలు పడ్డారు.
గతంలో జీపీఎఫ్‌నూ వదల్లేదు..
గతంలో ఉద్యోగుల జీపీఎఫ్‌ అకౌంట్స్‌లో నిల్వ ఉన్న మొత్తాలను ఉద్యోగుల ప్రమేయం లేకుండానే ప్రభుత్వం వేరే అవసరాలకు ఉపయోగించింది. ఉద్యోగులు అత్యవసరాలకు, ఆరోగ్య సమస్యలకు వాడుకునే ఈ నిధిని వేరే అవసరాలకు మళ్లించడంతో తీవ్ర అవస్థలు పడ్డారు. అప్పట్లో కనీసం రెండేళ్లపాటు జీపీఎఫ్‌ విత్‌డ్రాకు ఉద్యోగులు నిరీక్షించాల్సి వచ్చింది.
పెద్దమొత్తంలో పెండింగ్‌ బిల్స్‌
అదే విధంగా డీడీవో అకౌంట్స్‌లో ఉన్న మొత్తాలను కూడా ప్రభుత్వం లాగేస్తుందేమోననే భయం డీడీవోల్లో కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా డీడీవో అకౌంట్స్‌లో సుమారు రూ. 600 కోట్ల పైచిలుకు ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు డీడీవోల వద్ద ఉన్న పెండింగ్‌ బిల్స్‌ క్లియర్‌ చేసే పనిలో పడ్డారు.
ప్రభుత్వం లాగేసేలోపు డీడీవోలు వారి అకౌంట్స్‌లో ఉన్న నిధులు పూర్తి స్థాయిలో ఖర్చు చేస్తారా? ఇప్పటి వరకు ఏవైనా పనులు చేయించి ఉంటే ఆ పనులకు చెల్లించాల్సిన మొత్తాలు ఇవ్వగలమా? లేదా అనే సందేహం అధికారుల్లో ఉంది.
కేంద్ర నిధులకు ప్రత్యేక అకౌంట్స్‌
గత ప్రభుత్వాల కాలంలో సెంట్రల్లీ స్పాన్సర్డ్‌ ప్రోగ్రామ్స్‌కు సంబంధించిన నిధులు నేరుగా సంబంధిత శాఖల అధికారుల అకౌంట్స్‌కు జమయ్యేవి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా మొదటి రెండేళ్లు ఇదే పరిస్థితి కొనసాగింది. అయితే ప్రభుత్వం అనుకున్న పథకాలకు నిధులు కావాల్సి రావడంతో కేంద్రం ఇచ్చిన నిధులు ఆయా పథకాలకు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలకు మళ్లించారు. దీంతో రాష్ట్ర ఉన్నతాధికారులు కేంద్రానికి యుటిలైజేషన్‌ సర్టిఫికెట్స్‌ (యూసీ) ఏమని ఇవ్వాలో అర్థంకాక గగ్గోలు పెట్టారు. కొంతమంది కార్యదర్శి స్థాయి అధికారులను కేంద్ర ప్రభుత్వం ఢిల్లీకి పిలిపించి మరీ చీవాట్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి.
ఇది గమనించిన కేంద్ర ప్రభుత్వం కేంద్రం నుంచి విడుదలయ్యే నిధులకు ప్రత్యేక బ్యాంకు అకౌంట్స్‌ ఏర్పాటు చేయించింది. అవసరాన్ని బట్టి విడతల వారీగా ఆయా అకౌంట్స్‌కు నేరుగా నిధులు జమ చేస్తూ వస్తున్నది. ఈ అకౌంట్స్‌లో ఉండే నిధులు వేరే పథకాలకు ఖర్చుచేయడానికి అవకాశం లేకుండా నిబంధనలు విధించింది.
ఈ విభిన్నమైన పరిస్థితులు అధికారులకు సంకటంగా మారాయి. డీడీవో అకౌంట్స్‌లో ఉన్న నిధులు ప్రభుత్వం లాక్కుంటుందా? లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.
Tags:    

Similar News