High alert Zones | ఆధ్యాత్మిక నగరాలపై నిఘా సంస్థల డేగ కన్ను

రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలను హై అలర్ట్ జోన్లుగా గుర్తించారు. స్లీపర్ సెల్స్ కలకలం సృష్టించిన పట్టణాల్లో నిఘా సంస్థలు డేగకన్నుతో దృష్టి సారించాయి.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-04-27 02:30 GMT
Tirupati: అలిపిరి వద్ద తనిఖీలు చేస్తున్న టీటీడీ విజిలెన్స్, పోలీస్ అధికారులు

పహల్ గావ్ మారణకాండ నేపథ్యంలో దేశంలో భద్రతా బలగాలను అప్రమత్తం అప్రమత్తం చేశారు. రక్షణ దళాలతో పాటు సివిల్ పోలీసులు, ప్రధానంగా నిఘావర్గాలు కూడా అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేకంగా దృష్టిసారించారు.

కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలు, నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 14 ప్రదేశాలను అత్యంత సున్నితమైన హై అలర్ట్ జోన్లు ( High alert zones )గా ప్రకటించినట్లు పోలీసు వర్గాల తెలిపిన సమాచారం. అందులో తిరుపతితో పాటు తిరుమల క్షేత్రాలు అంతర్జాతీయ విమానాశ్రయాలు పొరుగు రాష్ట్రాల నుంచి రవాణా సదుపాయం ఉన్న బస్టాండ్లను కూడా ఆ జోన్ పరిధిలో చేర్చాయి.

"పనులు ఉంటే మినహా రాష్ట్రంలోని హై అలర్ట్ జోన్ల పరిధిలోకి వెళ్లవద్దు" అనే సూచనలతో కూడా హెచ్చరికలు జారీ చేసినట్లు పోలీసు వర్గాల సమాచారం.
ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తోపాటు అలిపిరిలో కూడా అక్టోపస్ దళాలు రంగంలోకి దిగాయి. అనుబంధ ఆలయాలతో పాటు శ్రీకాళహస్తి, కాణిపాకం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, రేణిగుంట విమానాశ్రయం, శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంతో పాటు అంతర్జాయ విమానాశ్రయాల్లో కూడా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (Special Protection Force SPF), కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (Central Industrial Security Force CISF) తోపాటు నిఘా వర్గాలు కూడా మరింత అప్రమత్తం అయ్యాయి.
పని ఉంటేనే...
ప్రయాణాలు చేయడానికో.. దర్శన సదుపాయం, అవసరం అయితే మినహా ఆ ప్రాంతాలకు వెళ్లకుండా కూడా భద్రతా సంస్థలు ప్రజలకు సూచిస్తున్నాయి. తనిఖీల సమయంలో అవసరమైన పత్రాలు చూపించడానికి కూడా సిద్ధంగా ఉండాలనే సూచనలు చేస్తున్నారు.
తిరుమలకు వెళ్లే సమయంలో యాత్రికులపై సందేహాలు ఉంటే, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ట్యాక్సీ డ్రైవర్లకు తిరుపతి పోలీసులు ప్రత్యేక సూచనలు చేశారు.
హై అలెర్ట్ జోన్లు..
రాష్ట్రంలోనే కాకుండా, తెలంగాణలో కూడా కొన్ని సున్నితమైన ప్రదేశాలను కేంద్ర నిఘా సంస్థలు గుర్తించాయి. గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఉగ్రవాదుల కదలికలు, వారి సానుభూతిపరులు ఉంటారనే సందేహంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని భద్రతా సంస్థలు, గూఢచారవర్గాలను మరింత అప్రమత్తం చేసినట్లు సమాచారం. దీంతో ఈ ప్రాంతాల్లో రాష్ట్రానికి చెందిన సివిల్ పోలీసులతో పాటు నిఘా సిబ్బంది రేయింబవళ్లు నిఘా నేత్రాలు ఉంచారని తిరుపతిలోని ఓ పోలీస్ అధికారి చెప్పారు.
తిరుపతి : తిరుమల, అలిపిరి
విశాఖపట్నం: రైల్వే స్టేషన్
రామకృష్ణ బీచ్
జగదాంబ జంక్షన్
విజయవాడ : రైల్వే స్టేషన్
పండిట్ నెహ్రూ బస్ స్టేషన్
ఎం.జి. రోడ్
హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
కూకట్‌పల్లి, నాంపల్లి
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
మహాత్మా గాంధీ బస్ స్టేషన్
ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో స్థానిక పోలీసు యంత్రాంగంతో పాటు కేంద్ర నిఘా వర్గాలు కూడా దృష్టి నిలిపాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు.
చురుగ్గా తనిఖీలు
కర్నూలు జిల్లాలో జిల్లా అంతటా ఏక కాలంలో తనిఖీలు కొనసాగించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల తో శనివారం రాత్రి జిల్లాలో దేవాలయాలు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు, లాడ్జిలు తదితర ప్రదేశాలలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సరిహద్దుల్లో, చెక్ పోస్టులలో ఆయా పోలీసులతో పాటు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ప్రత్యేక పోలీసు బృందాలతో తనిఖీ చేశారు.

స్లీపర్ షెల్స్
దేశంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా అటు హైదరాబాద్, ఏపీలో చిత్తూరు జిల్లా మదనపల్లె ప్రాంతంలో లింకులు బయటపడిన సందర్బాలు అనేకం ఉన్నాయి. అటు కర్ణాటక, ఇటు తమిళనాడుకు సమీపంలో ఉన్న చిత్తూరు జిల్లాల్లోని పట్టణాల్లో తీవ్రవాదులు స్లీపర్ సెల్స్ గా ఆశ్రయం పొందిన సంఘటనలు వెలుగు చూసిన సంఘటనలతో ఈ ప్రాంత పోలీసు వర్గాలు ఉలిక్కిపడ్డాయి.
కుట్ర భగ్నం..
2017 సెప్టెంబర్ 1
చిత్తూరు జిల్లాలోని పుత్తూరు పట్టణం గేటు పుత్తూరు ప్రాంతంలోని మేదరవీధిలో బిలాల్, ఇస్మాయిల్ కుటుంబంతో సహా జీవనం సాగించారు. వారిద్దరు సిమి తీవ్రవాదులు. ఏడాదిపాటు తమిళనాడుకు చెందిన ఇద్దరు తీవ్రవాదులు, పాత్రలు విక్రయిస్తూ, సాధారణ పౌరుల్లా జీవనం సాగిస్తూ, రహస్యంగా ఆపరేషన్ నిర్వహించడానికి పథకం సిద్ధం చేసుకుంటున్నారు. అదే సమయంలో తమిళనాడులోని నిఘా వర్గాలకు ఈ సమాచారం అందింది. వెంటనే చెన్నై నుంచి వచ్చిన అక్టోపస్ కమండోలు రంగంలోకి దిగారు. పిల్లలను అడ్డుగా ఉంచి, తప్పించుకోవాలనే వారి ఎత్తులను చిత్తు చేస్తూ, రక్తపాతానికి ఆస్కారం లేకుండా, టియర్ గ్యాస్ ప్రయోగించడం ద్వారా ఆ ఇద్దరు తీవ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.
"తిరుమలలో బ్రహ్మోత్సవాల వేళ మారణహోమం సృష్టించాలి" అనే ఆ తీవ్రవాదుల వ్యూహాన్ని నిఘా సంస్థలు విచ్ఛిన్నం చేశాయి. ఇదిలావుంటే..
ప్రేయసి కోసం వచ్చి...
2011 మదనపల్లె (అన్నమయ్య జిల్లా)..
ప్రేమలో పడిన మరో కాశ్మీర్ ప్రాంతానికి తీవ్రవాది మదనపల్లెలో పట్టుబడిన సంఘటన కూడా జిల్లాలో సంచలనం రేకెత్తించింది. పెద్దతిప్పసముద్రం (పీటీఎం) మండలం మల్లెల గ్రామానికి చెందిన ఓ ముస్లిం యువతి కాశ్మీర్ వెళ్లింది. అక్కడ మహ్మద్ ఖురేషీ అనే యువకుడితో ప్రేమలో పడింది. దాదాపు ఇది లవ్ జీహాదీగా భావించారు. ఆ యువతిని ప్రేమైకంలో ముంచెత్తిన ఖురేషీ కలిసి జీవించాలని నమ్మించాడు. కొన్నాళ్లకు ఆ యువతి మదనపల్లెకు తిరిగి వచ్చింది. కొన్నాళ్లకు ఖరేషీ కూడా పెట్టే బేడ, సర్దుకుని మదనపల్లెకు చేరుకున్నాడు. తల్లిదండ్రులకు తెలియకుండా ఆ యువతి ఖురేషీకి మదనపల్లె పట్టణానికి సమీపంలోని కుర్రవంక వద్ద ఓ గది అద్దెకు తీసుకుని ఆనందంగా గడుపుతుండగా, కేంద్ర నిఘా సంస్థల సమాచారంతో మదనపల్లె పోలీసులు అప్రమత్తం అయ్యారు. అనుమానాస్పద ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ సాగిస్తుండగా, ఖురేషీ పట్టుబడ్డాడు. అతని నుంచి మందుగుండు సామగ్రి, ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో జిల్లా మరోసారి ఉలిక్కిపడింది.
పట్టుబడిన బురేషీ కాశ్మీర్ ప్రాంతంలో వాటెంటెడ్ జాబితాలో ఉన్నట్లు పోలీసులు కూడా గుర్తించారు. తీవ్రవాది ఖురేషీని అరెస్టు చేసి, రిమాండ్కు పంపించారు. దాదాపు ఏడాది పాటు మదనపల్లె సబ్ జైలు, ఆ తరువాత కడప కేంద్ర కారాగారానికి బదిలీ చేయించుకోవడంలో ఖురేషీ దరఖాస్తులపై దరఖాస్తులు చేసుకోవడం ద్వారా జైళ్లు మార్పించుకుంటూ, కాశ్మీర్ జైలుకు తరలించుకునేలా చేసుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ ప్రాంతం అన్నమయ్య జిల్లా పరిధిలో ఉంది. దీంతో అన్నమయ్య జిల్లా ఇన్ చార్జి ఎస్పీ ఈజీ. అశోెక్ కుమార్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి సారధ్యంలో ముమ్మరంగా తనిఖీలు సాగించారు.

చురుగ్గా తనిఖీలు


తిరుమలలో తనిఖీ చేస్తున్న పోలీసులు

తిరుపతి అలిపిరి చెక్ పోస్టుతో పాటు అలిపిరి, శ్రీవారిమెట్టు కాలిబాట మార్గాల్లో టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్, పోలీసులు సంయుక్తంగా శనివారం రాత్రి కూడా తనిఖీలు ఏకకాలంలో సాగించారు.

గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో చిత్తూరు ప్రాంతం షెల్టర్ జోన్ గా మార్చుకుని, తీవ్రవాదులు స్లీపర్ సెల్స్ గా మారినట్లు ఆ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. అంతకుముందే ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా మారిన తిరుమలతో పాటు జిల్లాలోని ప్రధాన ఆలయాలకు ముప్పు ఉందనే హెచ్చరికల నేపథ్యంలోనే 2004 లో

మొదట ఎస్పీఎఫ్, బలగాలను రంగంలోకి దించారు. కేంద్ర నిఘా హెచ్చరికల నేపథ్యంలో ఆ తరువాత కొన్నేళ్లకు అక్టోపస్ కమాండోలు కూడా ఎలాంటి ఉపద్రవం ఎదురైనా సమర్థవంతంగా తిప్పికొట్టడానికి తిరుమలలో మకాం వేశారు.

మొత్తానికి పహల్ గావ్ అమానవీయ ఘటన నేపథ్యంలో కేంద్రంతో పాటు రాష్ట్ర పోలీసు, నిఘా వర్గాలు కూడా మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. అలిపిరి చెక్ పాయింట్ వద్ద తనిఖీలు ముమ్మరం చేశాయి.

Similar News