NTR | టీడీపీ నేతల ఉత్సాహం.. వర్గపోరు ఎలా బయటపడిందంటే..

టీడీపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడు ఎన్.టి. రామారావు విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-03-29 10:16 GMT

టీడీపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించాయి. అనేక సామాజిక కార్యక్రమలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంలో నేతల మధ్య ఉన్న వర్గపోరు బయటపడింది. ఎవరి దారిలో వారు వేర్వేరుగానే కార్యక్రమాలు నిర్వహించడానికి పోటీ పడ్డారు. తద్వారా వారి మధ్య ఉన్న విబేధాలు కూడా బయట వేసుకున్నారు. ఎన్టీ. రామారావు విగ్రహాల వద్దే రెండు, మూడు గ్రూపులుగా మారిన టీడీపీ నేతలు ఘర్షణలకు కూడా దిగిన సంఘటలు కూడా జరిగాయి. అధికార పార్టీ నేతలు నిర్వహించిన కార్యక్రమాలు కావడంతో ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘర్షణలకు దిగిన టీడీపీ నేతలను నియంత్రించడానికి పోలీసులు పాట్లు పడకతప్పలేదు.


టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలోనే ఆ పార్టీలో ఉన్న వర్గపోరు తీవ్రరూపం దాల్చింది. అంతర్గతంగా రగులుతున్న ఆధిపత్య పోరు కూడా బట్టబయలైంది.

2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్లు దక్కని నేతలది ఓ వర్గం. మాజీ ఎమ్మెల్యేది మరో వర్గం. విజయం సాధించిన ఎమ్మెల్యేలు ఉన్న స్థానంలో వారి ఆధిపత్యం ఒకపక్క. ఇలా ఎవరికి వారు వర్గాలుగా చీలిపోయి, ఘర్షణల మధ్య ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులు అర్పించడంలో ఘర్షణలతో రోడ్డెక్కిన సంఘనలు చోటుచేసుకున్నాయి. వాటిన్నింటికి తోడుగా, పదవులు దక్కక, అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలు కూడా తమ ఆధిపత్యం ప్రదర్శించడానికి కూడా వెనకంజ వేయలేదు.

తిరుపతిలో ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే ఎం. సుగుణమ్మ నివాళులర్పించారు. ఎన్నికల వేళ కూడా టికెట్ ఆశించి, భంగపడిన సుగుణమ్మకు తోడుగానే తిరుపతిలోని అన్నివర్గాల నేతలు కలిసి వెళ్లారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి జీ. నరసింహయాదవ్, మీడియా ఇన్చార్జి శ్రీథరవర్మ, డిప్యూటీ మేయర్, ఆర్.సి. మునికృష్ణ, టౌన బ్యాంకు మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణారెడ్డి తోపాటు నాయకులు అందరూ హాజరు కావడం ద్వారా ఐక్యత చాటుకున్నారు.

పక్కపక్కనే జెండా దిమ్మెలు

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో వర్గపోరు ఎక్కువైంది. మాజీ ఎమ్మెల్యే జీ. శంకర యాదవ్ వర్గం ఓ పక్క. గత ఎన్నికల్లో ఓటమి చెందిన దాసార్లపల్లె జయచంద్రారెడ్డి వర్గం మరో పక్క పోటాపోటీగా ఎన్టీఆర్ జయంతి నిర్వహించడంలో ఓకే ప్రదేశంలోకి రావడంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. బి.కొత్తకోట మండల కేంద్రంలోని జ్యోతిచౌక్ వద్ద రెండు వర్గాలు వేర్వేరుగా టీడీపీ జెండా ఆవిష్కరించడానికి ఇనుప పైపులు నిలిపారు. స్వీట్లు, పూలహారాలతో ఒకే ప్రదేశానికి చేరుకున్న రెండు వర్గాల నాయకుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు చోటుచేసుకున్నాయి. ఒకరిపైకి మరోవర్గం దూసుకురావడానికి ప్రయత్నం చేశారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు రెండు వర్గాలను శాంతపరచడం ద్వారా పరిస్థితి అదుపు తప్పకుండా నివారించారు.

మదనపల్లెలో కూడా భిన్నమైన వాతావరణమే కనిపించింది. టీడీపీ శ్రేణుల మధ్య సఖ్యత లేదనే విషయం మరోసారి వెల్లడైంది. మదనపల్లెలో టీడీపీ ఎమ్మెల్యే షేక్ షాజహాన్ బాషా (జహా) విజయం సాధించారు. ఉదయమే ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు, ఇంకొంతమంది సీనియర్లు కూడా ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు వ్యతిరేకంగానే ఉన్నారనే విషయం ఎన్నికల వేళే బయటపడింది. సీఎం ఎన్. చంద్రబాబు జోక్యం చేసుకుని, మందలించినా, ఇక్కడి పరిస్థితిలో మార్పులేదు. కాగా, జసనేన నేతతో కలిసి తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరాం గత నెలలో ఎమ్మెల్యే షాజహాన్ పై చేసిన ఆరోపణలతో రోడ్డుకెక్కారు. దీంతో జోక్యం చేసుకున్న ఐటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రెండు వర్గాలను అమరావతికి పిలిపించి, గట్టిగానే మందలించి పంపినా, ఏమాత్రం మార్పు లేదనే విషయం తాజా సంఘటనతో మళ్లీ బయటపడింది.

రాజంపేటలో భిన్న ధృవాలు..

కడప జిల్లాలో కూడా ఇందుకు ఏమాత్రం భిన్నమైన వాతావరణం కనిపించలేదు. ప్రధానంగా రాజంపేట (అన్నమయ్య జిల్లా )లో టీడీపీ నియోజకవర్గం ఇన్చార్జి సుగవాసి బాలసుబ్రమణ్యం, అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహనరాజు మధ్య విబేధాలు ఆరడం లేదు. గత ఎన్నికల్లో టికెట్ ఆశించిన భంగపడిన జగన్మోహనరాజు రాజంపేట పట్టణంలోని వారిద్దరు ఎవరికి వారు ఏర్పాటు చేసుకున్న పార్టీ కార్యాలయాల్లో టీడీపీ జెండా ఆవిష్కరించారు. పాత బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ సర్కిల్లో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ. రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళి అర్పించారు. అయితే రెండు వర్గాలుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించడం పట్ల కార్యకర్తలు కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యారు.

బాబుగారి కోసం నిరీక్షణ

అనంతపురం జిల్లాలో పరిస్థితి ఎలా మారిందంటే.. అయ్యవారు వచ్చే వరకు ఆమావాస్య ఆగాల్సిందే అని చెబుతున్నట్లుగా ఉంది.

గుంతకల్లు నియోజకవర్గం గుత్తి పట్టణంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కొడుకు గుమ్మనూరు ఈశ్వర్ రాకకోసం నేతలు మధ్యాహ్నం వరకు నిరీక్షించారని సమాచారం. ఆ ప్రాంతానికి చెందిన జర్నలిస్టు ఏమన్నారంటే,

"గుత్తి పట్టణం ఎన్టీఆర్ సర్కిల్ (పోలీస్ స్టేషన్ సమీపంలో) విగ్రహాన్ని చక్కగా అలంకరించారు. టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలోనే వచ్చారు. కానీ, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కొడుకు ఈశ్వర్ ఈ కార్యక్రమానికి వస్తారని సమాచారం ఇచ్చారు. ఆయన రాకపోవడం వల్ల మధ్యాహ్నం 12 గంటల వరకు ఎన్.టి. రామారావు విగ్రహానికి పుష్పాంజలి ఘటించడానికి నిరీక్షించారు" అని వివరించారు.

గుంతకల్లు నుంచి గత ఎన్నికల్లో కర్నూలు జిల్లా ఆలూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు. గుంతకల్లు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇక్కడ కూడా టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే తోపాటు బీసీ నేతలు కూడా గుంతకల్లులో ఎవరికి వారుగానే సాగారు.

అనంతపురం పట్టణంలో టీడీపీ కార్యాలయ నిర్మణానికి భూమి పూజ చేశారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుల్జాపూర్ స్వప్న తదితరులు పార్టీ ఆవిర్భావం, ఆ తరువాతి నుంచి పనిచేస్తున్న సీనియర్ నేతలను సత్కరించారు.

మీ దయ కోసం...


అనంతపురం జిల్లా టీడీపీకి కోటగా నిలిచిందనడంలో సందేహం లేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో 14కు 14 సీట్లలో టీడీపీ ఎమ్మెల్యేలే విజయం సాధించారు. కాగా, టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం వేళ ప్రతి కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించడం, జెండాలు ఎగురవేయడంలో ఎమ్మెల్యేలు ఉత్సాహం చూపించారు.

అనంతపురం నుంచి టికెట్ ఆశించిన వైకుంఠం ప్రభాకరచౌదరి మాత్రం అమరావతిలో నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లడం ద్వారా సీఎం ఎన్. చంద్రబాబు ఆశీస్సుల కోసం వెళ్లినట్లు చెబుతున్నారు. ఉగాదికి ముందే మార్కెట్ కమిటీ పదవులు భర్తీ చేశారు. ఈ పోస్టు కోసం కాదు. కానీ రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవికోసం ప్రభాకరచౌదరి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం గత ఎన్నికల్లో టికెట్ దక్కని స్థితిలో ఆయన పార్టీపై తిరుగుబాటుకు కూడా వెనకడుగు వేయలేదు. స్వతంత్రంగా అయిన పోటీ చేస్తానని హెచ్చరిక జారీ చేయడమే కాదు. తన పట్టసడలని భీష్మించారు. అయితే, అనంతపురం జిల్లా ఇన్చార్జిగా వ్యవహరించిన ఎంఎల్సీ రామగోపాల రెడ్డి పరిస్థితిని చక్కదిద్దడంలో సఫలం అయ్యారు. దీంతో వైకుంఠం ప్రభాకరచౌదరి మెత్తబడి, దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ విజయానికి సహకారం అందించారు. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతున్నా, పదవి దక్కని స్థితిలో వైకుంఠం ప్రభాకరచౌదరి తన రాజకీయ భవిష్యత్తు కోసం అమరావతికి వెళ్లినట్లు కనిపిస్తోంది.

కర్నూలు అదే పరిస్థితి

కర్నూలు జిల్లాలో కూడా టీడీపీలోని గ్రూపుల వ్యవహారం బయటపడింది. డోన్ నుంచి కోట్ల సూర్యప్రకాషరెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడి ప్రధానవర్గంగా ఉన్న బీసీలు ఆయనకు దూరంగా ఉన్నారని సమాచారం. కోడుమూరు సెగ్మెంట్లో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి వర్గం, డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశరెడ్డి వర్గం వేర్వేరుగానే కార్యక్రమాలు నిర్వహించినట్లు సమాచారం అందింది. అలాగే ఆదోనిలో కూడా టీడీపీ శ్రేణుల మధ్య ఐక్యత కొరవడిందనే సమాచారం. గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడుకు టికెట్ దక్కలేదు. టీడీపీ కూటమిలోని బీజేపీకి ఈ సీటు కేటాయించడంతో అందరి సహకారంతో డాక్టర్ పార్థసారథి విజయం సాధించారు. అయితే, శనివారం నిర్వహించిన టీడీపీ వ్యవస్థాపక దినోత్సవంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, కృష్ణమ్మ వర్గాలు వేర్వేరుగానే కార్యక్రమాలకు పరిమితమయ్యారు.

కార్యకర్తలకు అండగా..

నెల్లూరు నగరంలో మున్సిపల్ శాఖ మంత్రి పీ. నారాయణ టీడీపీ జెండా ఆవిష్కరించారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నివాసంపై కూడా జెండా ఎగురవేవారు. వెంకటగిరిలో ఎమ్మెల్య కురుగొండ్ల రామకృష్ణ జెండాను ఆవిష్కరించడమే కాకుండా, ప్రమాదంలో మరణించిన కొంపల అనసూయమ్మ కుటుంబానికి కార్యకర్తల సహాయనిధి నుంచి రూ. ఐదు లక్షలు, అల్తూరుపాడు పంచాయతీలోని సుజాతకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 2.76 లక్షల చెక్కు అందించారు. నెల్లూరు జిల్లాలోని పది మంది ఎమ్మెల్యేలు నేతలతో కలిసి సమష్టిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలో ఉత్సాహం ప్రదర్శించారు.

రాయలసీమ జిల్లాల్లో అధికార పార్టీలో బయటపడిన అంతర్గత విబేధాలు టీడీపీకి శిరోభారంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై

"ఈ పాటికే కేంద్ర కార్యాలయానికి సమాచారం అందింది" అని టీడీపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. పదవులు కోసం ఈ ఆరాటం అనేది సీఎం ఎన్. చంద్రబాబుకు తెలుసు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కాలం సమాధానం చెబుతుంది" అని ఆయన వ్యాఖ్యానించారు. సమీప కాలంలో భర్త చేసే పదవుల ద్వారా వర్గపోరుకు తెరతీసిన వారికి చెక్ పెట్టే అవకాశం ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం.

Similar News