శ్రీకూర్మావతారులు చనిపోతున్నారు!
శ్రీకూర్మంలోని నక్షత్ర కూర్మాలు ఒక్కొక్కటిగా మృత్యువాత పడుతున్నాయి. ఇందుకు కారణాలు వెల్లడి కావాల్సి ఉంది.;
శ్రీకూర్మం ఈ పేరు వినగానే శ్రీ మహావిష్ణువు గుర్తుకు వస్తారు. ఇక్కడ శ్రీకూర్మనాథ క్షేత్రం ఎంతో చరిత్రాత్మకమైనది. పురాతనమైన కట్టడాలు చూపరులను ఆకట్టుకుంటాయి. మహా విష్ణువు ఇక్కడ కూర్మావతారునిగా కొలువై ఉన్నారని భక్తులు నమ్ముతారు. అయితే ఇప్పుడు ఆ శ్రీకూర్మునికి దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. ఇందుకు కారకులు ఎవరు? ఇంతటి ప్రాధాన్యత కలిగిన శ్రీకూర్మనాథ ఆలయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇంతకూ శ్రీకూర్మనాథ వేవాలయం ఎక్కడ ఉందో తెలుసా? శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని శ్రీకూర్మంలో ఉంది. దేవస్థానంలో పెంపుడు నక్షత్ర తాబేళ్లు ఒక్కొక్కటిగా మృత్యువాత పడుతున్నాయి. దీంతో శ్రీకూర్మని అవతారం చర్చనియాంశమైంది. ఇంతకూ అక్కడ ఏమి జరింది?
శ్రీకూర్మం ఆలయంలో నక్షత్ర తాబేళ్ల మృతికి సంబంధించి అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ లోపాలు రెండూ కారణమని సోషల్ మీడియా పోస్టులలో ఆరోపణలు వచ్చాయి. తాబేళ్ల సంరక్షణలో నిర్లక్ష్యం, పార్కు నిర్వహణలో అవ్యవస్థ కనిపిస్తుందని భక్తులు చెబుతున్నారు. ఈ ఆరోపణలకు సంబంధించి అధికారిక నివేదికలు ఇంతవరకు తయారు కాలేదు. ఆలయంలోని తాబేళ్ల పార్కులో మొత్తం 187 వరకు తాబేళ్లు ఉండాలి. ఇప్పటి వరకు ఇటీవల 15 తాబేళ్లు మృత్యువాత పడ్డట్లు స్థానికులు గుర్తించారు. తాబేళ్లను పెంచేందుకు ప్రత్యేక కాంట్రాక్టర్ ఉన్నారు. తన సిబ్బంది దేవస్థానంలో తాబేళ్లను పెంచుతారు. ఆదివారం ఉదయం మృతి చెందిన తాబేళ్లను దేవస్థానంలో పనిచేసే ఒక వ్యక్తి శ్వేత పుష్కరిణి వడ్డున పడేయడాన్ని కొందరు భక్తులు చూశారు. దగ్గరికి వెళ్లి పరిశీలిస్తే ఏడు మృతి చెందిన తాబేళ్లు, కాలిపోయిన స్థితిలో ఉన్న తొమ్మిది తాబేళ్లు కనిపించాయి. వెంటనే స్థానికులు ప్రజా ప్రతినిధుల దృష్టికి విషయం తీసుకెళ్లారు.
తాబేళ్ల సంరక్షకుడు, ఈవో శ్రీకాకుళంలో ఉంటారు
దేవస్థానం ఈవో భద్రాజీ శ్రీకాకుళంలో ఉంటారు. అలాగే తాబేళ్లను సంరక్షించే సంస్థ యజమాని కూడా శ్రీకాకుళంలోనే ఉంటారు. ఆయన పేరు కెవి రమణమూర్తి. తాబేళ్లు మృతి చెందిన విషయం సంస్థ నిర్వాహకుని దృష్టికి ప్రజా ప్రతినిధులు తీసుకుపోగా రెండు తాబేళ్లు ఆదివారం మృతి చెందినట్లు తన దృష్టికి వచ్చిందని, కారణాలు ఏమిటనేవి తెలుసుకుంటానని చెప్పారు. ఇక ఈవో ఈ విషయం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు.
శ్రీకూర్మం ఆలయంలోని నక్షత్ర తాబేళ్ల సంరక్షణ బాధ్యతను 2011 నుం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖతో కలిసి గ్రీన్ మెర్సీ అనే NGO నిర్వహిస్తోంది. గ్రీన్ మెర్సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, శ్రీకూర్మం ఆలయంలోని స్టార్ టాయిస్ కన్సర్వేషన్ సెంటర్ క్యూరేటర్‌గా కెవి రమన మూర్తి పనిచేస్తున్నారు. ఆయన తాబేళ్ల సంరక్షణ కోసం అటవీ శాఖతో సంప్రదింపులు జరుపుతుంటారు. నక్షత్ర తాబేళ్ల పార్కు నిర్వహణలో గ్రీన్ మెర్సీతో పాటు దేవాదాయ శాఖ కూడా భాగస్వామ్యం వహిస్తుంది. 2015 నాటి సమాచారం ప్రకారం, ఆలయంలో 255 తాబేళ్లు ఉన్నాయి. వీటి సంరక్షణలో కొన్ని సమస్యలు (పోషణ లోపం, ఎన్‌క్లోజర్ లేకపోవడం) ఉన్నాయని గ్రీన్ మెర్సీ సూచించింది.
పోస్టుమార్టం ఎందుకు చేయించలేదు?
నిబంధనల ప్రకారం పోస్ట్‌మార్టం చేయకుండానే తాబేళ్లను దహనం ఎందుకు చేయాల్సి వచ్చిందనేది చర్చనియాంశంగా మారింది. ఆహారంలో ఏదైనా లోపం ఏర్పడిందా అనేది కూడా ఆలోచించాల్సి ఉంది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ తాబేళ్ల రక్షణ పార్కు ఉంది. అధికారులు, కాంట్రాక్టర్ నియమించిన సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది. అయినా ఈ అనర్థం ఎలా జరిగిగదనే దానిపై సమగ్ర విచారణ జరగాల్సి ఉంది.
తాబేళ్లలో శ్రీ మహా విష్ణువు ఉంటాడని బక్తుల నమ్మకం
శ్రీకూర్మంలోని కూర్మనాథ ఆలయంలో ఉండే నక్షత్ర తాబేళ్లలో శ్రీ మహా విష్ణువు కొలువై ఉంటాడని భక్తులు నమ్ముతారు. అందుకే దేవస్థానానికి భక్తులు వెళ్లనప్పుడు అక్కడ పార్కులో ఉండే తాబేళ్లను తదేకంగా చూస్తారు. అవి చిన్నగా నడుచుకుంటూ అటూ ఇటూ తిరుగుతుంటే చూసి ఆనందిస్తారు. నక్షత్ర తాబేళ్లు పెద్దగా పెరగవు. చిన్న సైజులోనే ఉంటాయి. నక్షత్ర తాబేళ్లు (Indian Star Tortoises, Geochelone elegans) ప్రధానంగా శాకాహారులు. ఆలయంలో వీటికి ఇచ్చే ఆహారం గురించి నిర్దిష్ట సమాచారం ప్రకారం భక్తులు తాబేళ్లకు గోంగూర ఆకులను ఆహారంగా సమర్పిస్తారు. ఇది కూర్మావతారానికి గౌరవంగా భావిస్తారు. సాధారణంగా నక్షత్ర తాబేళ్లు సహజ వాతావరణంలో గడ్డి, ఆకుకూరలు, పుష్పాలు, రసవంతమైన మొక్కల ఆకులు, పడిపోయిన పండ్లు వంటివి తింటాయి. ఆలయంలో కూడా వీటికి ఇలాంటి శాకాహార ఆహారం (గడ్డి, ఆకుకూరలు) అందించాలి. అయితే గోంగూర ఆకులు ప్రధాన ఆహారం. ఆలయంలో తాబేళ్ల ఆహారం సరిగ్గా అందించకపోవడం, సరైన సంరక్షణ లేకపోవడం వల్ల అనారోగ్యంతో మృత్యువాత పడినట్లు 2015లో ఒక నివేదికలో పేర్కొన్నట్లు ఆలయంలో పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక ఉద్యోగి తెలిపారు.
నక్షత్ర తాబేళ్ల ఆయు ప్రమాణం ఎంత?
నక్షత్ర తాబేళ్లు సగటున 55 నుంచి 80 సంవత్సరాలు జీవిస్తాయి. కానీ సరైన వాతావరణం, ఆహారం, UVB లైటింగ్ లేకపోతే ఆయుష్షు తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. సమతుల ఆహారం, కాల్షియం, విటమిన్ D3 అందకపోతే ఎముకల వ్యాధులు (Metabolic Bone Disease) రావచ్చని, దీనివల్ల కూడా ఆయుప్రామాణం తగ్గే అవకాశం ఉందని వన్యప్రాణి సంరక్షణ వైద్యులు చెబుతున్నారు. 80-95°F ఉష్ణోగ్రత, 40-60 శాతం ఆర్ద్రత, UVB లైటింగ్ అవసరం. సరైన వాతావరణం లేకపోతే శ్వాసకోశ సమస్యలు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
శ్రీకూర్మం ఆలయంలో సరైన సిబ్బంది, శుభ్రత, వేరుచేసిన ఎన్‌క్లోజర్‌లు లేకపోవడం వల్ల హాచ్‌లింగ్స్ (Hatchlings) (గుడ్ల నుంచి బయటకు వచ్చిన చిన్న తాబేలు పిల్లలను "హాచ్‌లింగ్స్" అంటారు) చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పలు నివేదికలు చెబుతున్నాయి.
ఆలయంలోని దేవుడు
శ్రీ కూర్మనాథ ఆలయంలో ‘శ్రీ మహావిష్ణువు’ కూర్మావతార రూపంలో (తాబేలు రూపంలో) కొలువై ఉన్నారు. ఆయన సహచరిణిగా ‘లక్ష్మీదేవి’ (కూర్మనాయకి) ఉన్నారు. ఇది భారతదేశంలో కూర్మావతార రూపంలో విష్ణుమూర్తిని పూజించే ఏకైక ఆలయం.
కూర్మావతార ప్రతీతి
హిందూ పురాణాల ప్రకారం విష్ణువు దశావతారాల్లో రెండవ అవతారం కూర్మావతారం. క్షీరసాగర మథనం సమయంలో, దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలకగా, మందర పర్వతం సముద్రంలో మునిగిపోకుండా ఉండేందుకు విష్ణువు కూర్మ (తాబేలు) రూపంలో అవతరించి, పర్వతాన్ని తన వీపుపై ధరించాడు. ఈ సంఘటన శ్రీకూర్మం ఆలయంతో ముడిపడి ఉంది.
శ్రీకూర్మం పేరు ఎలా వచ్చింది?
ఈ గ్రామం, ఆలయం పేరు కూర్మావతారం నుంచి వచ్చింది. శ్రీ మహావిష్ణువు కూర్మ రూపంలో ఇక్కడ వెలిశాడని, ఆ కారణంగా ఈ క్షేత్రానికి "శ్రీకూర్మం" అనే పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని తొలుత బ్రహ్మ ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
శ్రీ కూర్మనాథుని గొప్పతనం
శ్రీకూర్మం ఆలయం ప్రపంచంలోనే కూర్మావతార రూపంలో విష్ణువును పూజించే ఏకైక ఆలయం. ఆది శంకరాచార్య, రామానుజాచార్య వంటి గొప్ప ఆధ్యాత్మికవేత్తలు ఈ క్షేత్రాన్ని సందర్శించారు. ఇక్కడ అభిషేకం చేయడం వల్ల గృహవాస్తు దోషాలు తొలగిపోతాయని, పితృదేవతలకు పిండప్రదానం చేస్తే మోక్షం లభిస్తుందని స్థల పురాణం చెబుతుంది. ఆలయంలో నక్షత్ర తాబేళ్లను పెంచడం ఒక విశిష్ట ఆకర్షణ. ఈ తాబేళ్లు కూర్మావతారానికి చిహ్నంగా భావిస్తారు. మహాభారతం ప్రకారం, బలరాముడు ఈ క్షేత్రాన్ని సందర్శించి, ఇక్కడ ఉమారుద్ర కోటేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడని చెబుతారు. ఈ ఆలయంలో స్వామి వారు పడమటి ముఖంగా ఉండటం, రెండు ధ్వజస్తంభాలు ఉండటం వంటి విశేషాలు ఉన్నాయి. ఆలయం కళింగ, ద్రావిడ శిల్పకళా సమ్మేళనంతో నిర్మితమైంది. 108 రాతి స్తంభాలు, అష్టదళ పద్మాకార గోపురం, ఒరిస్సా పట్టచిత్ర శైలి కుడ్యచిత్రాలు ఆకర్షణీయంగా ఉంటాయి.