అరకు కాఫీ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన భారత పార్లమెంట్
ఏపీ బ్రాండ్ అరకు కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. ఆర్గానిక్ సర్టిఫికేషన్ వచ్చింది. భారత పార్లమెంట్ క్యాంటిన్ లో ప్రత్యేకించి స్టాల్ ను ప్రారంభించారు.;
ఆంధ్రప్రదేశ్ లోని అరకు కాఫీకి దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ప్యత్యేకమైన ఖ్యాతి దక్కింది. అరకులో పండే కాఫీ పంట పూర్తిగా సేంద్రీయ ఎరువుతో పండే పంట కావడంతో ఎంతో మంది అరకు కాఫీని ఇష్టపడుతున్నారు. ప్యారిస్ దేశంలో పలు స్టాల్స్ లో అరకు కాఫీ అందుతోందంటే ఎంతటి క్రేజ్ అరకు కాఫీకి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కుంభా రవిబాబు ప్యారిస్ లో స్వయంగా అరకు కాఫీ తాగినట్లు చెప్పారు.
భారత పార్లమెంట్‌లో సోమవారం రెండు అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో లోక్‌సభ క్యాంటీన్‌లో అరకు స్టాల్ ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించారు. రాజ్యసభ క్యాంటీన్‌లో అరకు కాఫీ స్టాల్ ను వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. అరకు లోయలో కాఫీ సువాసన పార్లమెంట్ లో గుబాళిస్తోందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు.
పార్లమెంట్‌లో కాఫీ ప్రియులు ఇప్పుడు ఆవరణలోనే తాజాగా తయారుచేసిన అరకు కాఫీ కప్పును ఆస్వాదించవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. 'మన్ కీ బాత్'లో అరకు కాఫీని ప్రోత్సహించినందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి, ఈ స్టాల్‌ను ఏర్పాటు చేయడానికి దయతో అనుమతి ఇచ్చినందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అరకు లోయలో పండే కాఫీ రుచిని పార్లమెంట్ లో ఎంపీలకు పరిచయం చేసేందుకు అవకాశం ఇవ్వాలన్న ఏపీ ఎంపీల వినతిని లోక్ సభ స్పీకర్ అనుమతించారు.
తూర్పు కనుమల్లో...
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో తూర్పు కనుమలలో ఉన్న అరకు లోయలో కాఫీ తోటలు విస్తారంగా ఉన్నాయి. ఈ కాఫీ చాక్లెట్, కారామెల్, సూక్ష్మమైన పండ్ల ఆమ్లత్వంతో కూడిన ప్రత్యేకమైన రుచితో ఉంటుంది. దీనిని విభిన్నమైన వ్యవసాయ అటవీ వ్యవస్థలో పండిస్తారు. ప్రధానంగా సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి సాగు చేస్తారు. దీనిని గిరిజన రైతులు, సహకార సంస్థలు పండిస్తారు. స్థిరమైన జీవనోపాధిని, సమాజ సాధికారతను ప్రోత్సహించడంలో అరకు కాఫీ తోటలు సాయ పడతాయి. అరకు కాఫీ అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. వాటిలో కేఫ్ డి కొలంబియా పోటీలో "ఉత్తమ రోబస్టా" కూడా ఉంది.
దీనికి 2019 లో దాని ప్రత్యేక లక్షణాల కోసం భౌగోళిక సూచిక (GI) ట్యాగ్ లభించింది. GI ట్యాగ్‌ని అందుకున్న ఇతర భారతీయ కాఫీలలో కూర్గ్ అరబికా, వాయనాడ్ రోబస్టా, చిక్కమగళూరు అరబికా, కర్ణాటక నుంచి బాబాబుడంగిరీస్ అరబికా, కేరళ నుంచి మాన్‌సూన్డ్ మలబార్ రోబస్టా ఉన్నాయి.
కాఫీ ఉత్పత్తి చేసే టాప్ 3 దేశాల్లో బ్రెజిల్, వియత్నాం, కొలంబియా ఉన్నాయి. ప్రపంచంలో కాఫీ ఉత్పత్తిలో భారతదేశం 6వ అతిపెద్ద దేశం. భారతదేశంలో కాఫీ ఉత్పత్తి చేసే టాప్ 3 రాష్ట్రాల్లో కర్ణాటక, కేరళ, తమిళనాడు ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కాఫీ తాగేవారి సంఖ్య చాలా ఎక్కువ. ఇండియాలోనూ రోజు రోజుకీ కాఫీకి డిమాండ్ పెరుగుతోంది. కాఫీ తాగేవారు ఎక్కువ కాలం జీవిస్తారని కొన్ని పరిశోధనలు తేల్చాయి. రోజూ రెండు కప్పులు తాగితే మంచిదని ఆ పరిశోనలు చెబుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అరకు కాఫీ గురించి మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రస్తావించడంతో ఒక్కసారిగా ఈ కాఫీ గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
విశాఖకు 100 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమల్లో అరకులోయ ఉంది. అత్యంత దట్టమైన అడవులు, ప్రకృతి రమణీయయతో తూర్పు కనుమలు ఆకట్టుకుంటాయి. అక్కడి ఉష్ణోగ్రత సాధారణంగా 20 నుంచి 30 డిగ్రీల మధ్య ఉంటుంది. ఎండ చాలా తక్కువగా ఉంటుంది. కాఫీ పంట బాగా పండాలంటే.. ఉష్ణోగ్రత 15 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండాలి. అందువల్ల అరకులోయ ప్రాంతం కాఫీ పంట పండేందుకు అనువైన వాతావరణం ఉన్న ప్రదేశం. అందువల్లే అక్కడి కాఫీకి అద్భుతమైన రుచి ఉంటుంది. ఈ రుచి ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అందరికీ నచ్చుతోంది.
అరకు కాఫీకి మరో ప్రత్యేకత కూడా ఉంది. ప్రపంచంలో మొదటి టెర్రాయిర్ మ్యాప్ చేసిన కాఫీ కూడా ఇదే. అంటే.. ఈ కాఫీ ప్రత్యేక ప్రదేశంలో సాగవుతోంది. అంతేకాదు.. పురుగు మందులు, కెమికల్స్ కాకుండా.. సేంద్రియ పదార్థాలతో మాత్రమే ఈ కాఫీ సాగు చేపడుతున్నారు. అంతేకాదు.. సాధారణ కాఫీలకు 100కు 80 దాకా పాయింట్లు వస్తే, అరకు కాఫీకి 90కి పైగా పాయింట్లు వచ్చాయి. ఇండియాలో ఇన్ని పాయింట్లు సాధించిన తొలి కాఫీ ఇదే. ఈ కాఫీ సహజమైన తీపి, పండ్ల రుచి, పువ్వుల పరిమళాలతో కూడి ఉంటుంది.
అరకు కాఫీ పంటలను అక్కడి గిరిజనులు సాగు చేస్తున్నారు. అడవుల్లో ఈ సాగు జరుగుతోంది. గిరిజనులు అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తున్నారు. ఇందుకోసం వారికి ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు. పైగా అరకు కాఫీ గింజలు కూడా ప్రత్యేకమైన రెడ్ కలర్ గింజలు. వీటిని అత్యంత నాణ్యతా ప్రమాణాలతో సేకరిస్తూ, రోస్టింగ్, ప్యాకింగ్ అన్ని విషయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా చేస్తున్నారు. కాఫీ గింజలు కొనుగోలు చేసే వ్యాపారులు అరకు నుంచే ప్రపంచ దేశాలకు ఈ కాఫీని సప్లై చేస్తున్నారు. ఇండియా అంతటా ఈ కాఫీ పొడి సప్లై ఉంది.
ఈ కామర్స్ లో అరకు కాఫీ
అరకు కాఫీ పొడిని ప్రభుత్వ వెబ్‌సైట్ https://www.arakucoffee.in లో ఆర్డర్ చెయ్యవచ్చు. లేదా అమెజాన్ లాంటి ఈ-కామర్స్ సైట్లలో కూడా కొనవచ్చు. ఐతే.. ఈ కాఫీ పొడుల్లో కూడా 3 రకాలున్నాయి. ఎర్లీ హార్వెస్ట్ - వాష్డ్ ప్రాసెస్ కాఫీని మీడియం రోస్ట్ చేస్తున్నారు. 250 గ్రాముల ప్యాక్ ధర రూ.630 ఉంది. అలాగే.. సెలెక్షన్ అనే కాఫీని మీడియం డార్క్ రోస్ట్ చేస్తున్నారు. ఇది 250 గ్రాముల ప్యాక్ ధర రూ.590 ఉంది. ఇంకా గ్రాండ్ రిజర్వ్ కాఫీని మీడియం రోస్ట్ చేస్తున్నారు. ఇది 250 గ్రాముల ప్యాక్ ధర రూ.890 ఉంది.
Early Harvest Coffee
ఎర్లీ హార్వెస్ట్ కాఫీ గింజలను హార్వెస్ట్ సీజన్‌లో ముందుగా సేకరిస్తారు. అంటే.. అరకులో కాఫీ గింజలను ఒక సీజన్‌లో మొత్తం 10 సార్లు సేకరిస్తారు. ఈ కాఫీ తయారీలో చెర్రీస్ అప్పుడప్పుడే పండుతూ, క్రిమ్సన్ రెడ్ కలర్‌లోకి మారుతాయి. ఆ సమయంలో వాటిని సేకరిస్తారు. అందువల్ల ఈ కాఫీ చాలా కాంతివంతంగా, అత్యంత తాజాగా ఉంటుంది.
Selection Coffee
సెలెక్షన్ కాఫీ తయారీకి వాడే గింజల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కాఫీ తోటలు గిరిజనులు జీవించే ప్రదేశాలకు దగ్గరగా ఉంటాయి. ఇక్కడ సిల్వర్ ఓక్ చెట్ల నీడ కాఫీ చెట్లపై పడుతుంది. ఓక్ చెట్లకు మిరియాల తీగలు అల్లుకుని ఉంటాయి. అలాంటి ప్రదేశంలో పండే ఈ కాఫీ గింజలు.. ప్రత్యేకమైన ప్రాసెస్ ద్వారా అద్భుతమైన రుచిని పొందుతాయి.
Grand Reserve Coffee
ఈ కాఫీ అత్యంత ప్రత్యేకమైనది. ఎందుకంటే.. ఇది సంక్లిష్టమైనది. ఈ కాఫీ తోటలు అత్యంత ఎత్తైన స్క్రీ నేలల్లో పెరుగుతాయి. ఈ నేలలు ఉన్న ప్రాంతంలో జీవ-వైవిధ్య పరిస్థితులు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ కాఫీని అత్యంత సహజమైన పద్ధతుల్లో వాష్ చేస్తారు. కాఫీ గింజల సేకరణ, ప్రాసెస్ అంతా క్లిష్టంగానే ఉంటుంది. కానీ దీని రుచి అమోఘంగా ఉంటుంది.
ప్రపంచం మెచ్చిన కాఫీ
ప్రపంచం మెచ్చిన కాఫీని అందించటంలో ఏపీ ప్రభుత్వం, అరకు గిరిజనుల కృషి ఎంతో ఉంది. ఇప్పుడు ఈ కాఫీ ఏ స్థాయికి చేరిందంటే.. కాఫీతోపాటూ.. కాఫీ ఎక్విప్‌మెంట్ కూడా వెబ్‌సైట్‌లో అమ్ముతున్నారు. అంతేకాదు.. ఈ కాఫీని చాలా మంది గిఫ్టుగా కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ఇది భారత దేశ ప్రత్యేక కాఫీగా మారింది. దీన్ని కొన్నప్పుడల్లా పరోక్షంగా గిరిజనులకు జీవనోపాధి కల్పించినట్లు అవుతుంది. అరకు కాఫీ ద్వారా వచ్చే లాభాలు.. గిరిజనులు డైరెక్టుగా పొందుతారు. మధ్యవర్తులు ఉండరు. అందుకే ఈ కాఫీ ఇండియాకి గర్వకారణంగా మారింది. దీని గురించి ప్రధాని మోదీ ప్రస్తావించడంతో.. ఈ కాఫీకి డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
కాఫీ ఉత్పత్తిలో అరకు ప్రత్యేకత
దేశంలో 12 రాష్ట్రాలు కాఫీని ఉత్పత్తి చేస్తున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో లక్షన్నర ఎకరాల్లో కాఫీ తోటలు సాగవుతున్నాయి. మరో లక్షన్నర ఎకరాలు అభివృద్ధిలో ఉన్నట్లు గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ సి మణికుమార్ ది ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు. అత్యంత నాణ్యమైన కాఫీ గింజలు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. అందుకే అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. సముద్ర మట్టానికి 3,600 ఎత్తులో గిరిజన కుటుంబాలు సంప్రదాయ పద్ధతిలో పండిస్తారు. ఈ కాఫీ గింజలను, ప్రైవేట్ వ్యాపారులతో పాటు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) సేకరిస్తుంది. అందులో కొంత మొత్తాన్ని ఈ వేలం ద్వారా అమ్మకాలు చేస్తుంది. మరికొన్నింటిని అరకువ్యాలీ కాఫీ పేరుతో మార్కెటింగ్ చేస్తోంది.
చాలా ఆనందంగా ఉంది
అరకు కాఫీ పార్లమెంటులో తన స్థానాన్ని సంపాదించుకోవడం చూసి చాలా ఆనందంగా ఉందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఈ ఆర్గానిక్ కాఫీ లక్షన్నర మంది గిరిజన రైతుల అంకితభావాన్ని వారి గొప్ప వారసత్వానికి నిదర్శనమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీని ప్రోత్సహించడంలో, జీఐ ట్యాగ్‌ను పొందడం, గిరిజన రైతులకు మద్దతు ఇవ్వడం, ప్రపంచ వేదికలపై ప్రదర్శించడంలో కీలకంగా ఉన్న దార్శనిక నాయకుడు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పారు. పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్‌కు కృషి చేసిన స్పీకర్ ఓం బిర్లా, ఇతర కేంద్రమంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వీరి మద్దతు గిరిజన సమాజాలను ఉద్ధరించి భారతదేశ సేంద్రీయ వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళుతుందని పేర్కొన్నారు.
మంత్రి సంధ్యారాణి హర్షం
పార్లమెంటులో అరకు కాఫీ స్టాళ్ల ఏర్పాటుపై ఏపీ గిరిజన సంక్షేమ మంత్రి సంధ్యారాణి హర్షం వ్యక్తం చేశారు. స్టాళ్ల ఏర్పాటును ప్రోత్సహించిన సీఎం చంద్రబాబుకు అలానే లోక్‌సభ, రాజ్యసభలో కాఫీ స్టాళ్లను ప్రారంభించిన కేంద్రమంత్రులు రామ్మోహన్, పీయూష్, ఓరమ్, రిజుజుకు మంత్రి సంధ్యారాణి కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఎప్పుడొచ్చిందంటే...
2019 నుండి కొనసాగుతున్న సర్టిఫికేషన్ ప్రక్రియలో ప్రస్తుతం 2,600 మంది గిరిజన రైతులు పాల్గొంటున్నారు. సర్టిఫికేషన్ వల్ల గిరిజన రైతులకు మంచి ధర లభిస్తుంది. అరకు కాఫీకి ఆర్గానిక్ సర్టిఫికేషన్ రావడం వల్ల ఐరోపా దేశాలతో పాటు, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వంటి పెద్ద సంస్థల నుంచి కూడా అరకు కాఫీకి కొనుగోలుదారులు లభించారు. అంతర్జాతీయ మార్కెట్లో అరకు కాఫీకి మంచి గుర్తింపు లభించింది. "అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ(అపెడా)" ధృవీకరించింది.
అంతర్జాతీయ అధ్యయనాలు
అనేక అంతర్జాతీయ అధ్యయనాలు కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ధృవీకరించాయి. అరకు కాఫీని పండిస్తున్న గిరిజన సహకార సంస్థ, ఈ కాఫీ ప్రత్యేకతలను, ఆరోగ్య ప్రయోజనాలను నొక్కి చెబుతోంది. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ(అపెడా) అరకు కాఫీకి ఆర్గానిక్ సర్టిఫికెట్ ని ధృవీకరించింది.
అరకు లోయలో మహిళలు పండిస్తున్న కాఫీలో చక్కటి పరిమళం ఉందని గతంలో ఐరాస ప్రతినిధులు ప్రశంసలు కురిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల మన కీ బాత్ కార్యక్రమంలో అరకు కాఫీ గురించి ప్రస్తావించడంతో దేశవ్యాప్తంగా ఈ కాఫీపై ఆసక్తి మరింత పెరిగింది.
చారిత్రక నేపథ్యం
ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ 1960లో విశాఖపట్నం జిల్లాలోని రిజర్వు అటవీ ప్రాంతంలో కాఫీ పంటను అభివృద్ధి చేసింది. 1985లో ఈ కాఫీ తోటలను అటవీ అభివృద్ధి సంస్థకు అప్పగించారు. 1956లో గిరిజన సహకార సంస్థ ఏర్పాడ్డక, కాఫీ బోర్డు వారు యీ సంస్ధని కాఫీ తోటల అభివృద్ధి కోసం ఉపయోగించుకునేందుకు ఉద్దేశించారు. 1997 జూలైలో జిసిపిడిసి సంస్థ కార్యకలాపాలను సిబ్బందితో సహా ఐటిడిఎలో విలీనం చేసి కాఫీ అభివృద్ధి కార్యక్రమాలను పంచవర్ష ప్రణాళిక బద్ధంగానూ, MGNREGS నిధుల సహాయంతో అభివృద్ధి చేసి నేటికి లక్షన్నర ఎకరాలకు చేరి, కాఫీ తోటలు గిరిజన రైతుల ద్వారా సాగు చేస్తున్నారు.