Excursion to Pulicat Lake | పులికాట్ పక్షుల లోకంలో తేలియాడిన ఆనందం

పక్షుల విడిది కేంద్రం ఓ దృశ్యకావ్యంగా మారింది. పడవలో ప్రయాణిస్తూ, ప్రకృతి ఒడిలో పక్షుల సందడిని ఆస్వాదిస్తున్నారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-01-19 10:59 GMT
సూళ్లూరుపేట పులికాట్ సరస్సులో ఆనందకర దృశ్యం

ఆకాశంలో విహరించే పక్షులు. నీటిపై తేలియాడుతున్న పడవలు. అందులో ప్రయాణం. ఎలా ఉంటుందో ఊహించండి. ఓహ్ మాటలకు అందని భావం. ఇలాంటి దృశ్య కావ్యాన్ని ఫ్లెమింగ్ ఫెస్టివల్ తీసుకుని వచ్చింది. చెరువులో ఈత కొడుతూ, క్యాట్ వాక్ ను తలపిస్తున్న పక్షులు కొన్ని ఆకాశంలో విహారం చేసే పక్షులు ఇంకొన్ని. మరో లోకాన్ని తలపిస్తున్నాయి. సూళ్లూరుపేట సమీపంలో కనువిందు చేస్తున్న దృశ్యాలు పిల్లలకు మరో ప్రపంచం కళ్లముందు ఉంచింది.

ఫ్లెమింగో ఫెస్టివల్ లో రెండో రోజు ఆదివారం పాఠశాలల పిల్లలతో మరింత సందడిగా మారింది. పక్షుల విహారాన్ని చూస్తున్న పిల్లలు కూడా పక్షుల గొంతుతో గొంతు కలుపుతున్నారు. వింత శబ్దాలతో పిల్లలు కూడా పక్షుల్లో మారారు. పసి మనసుల్లో ఆనందం కేరింతలు కొడుతున్న దృశ్యాలను సందర్శకులను మరింత ఉత్సాహ పరుస్తోంది.


రెక్కలు విప్పిన పక్షులు ఆకాశంలో విహరిస్తుంటే, పిల్లల మనసులు కూడా వాటితో పోటీ పడుతున్నాయి. ఈ దృశ్యాలకు సూళ్లూరుపేట సమీపంలోని అటకానితిప్ప, పులికాట్ అభయారణ్యం పక్షుల సందర్శన కేంద్రం ఆలవాలమైంది. బీవీ. పాలెం వద్ద నదిలో పడవ ప్రయాణం మరింత ఉత్సాహం నింపింది.

ప్రత్యేక ఏర్పాట్లు

పక్షుల పండగకు తోడు ఆదివారం కలిసి రావడంతో తిరుపతితో పాటు సూళ్లూరుపేట, నెల్లూరు జిల్లాలోని గూడూరు సమీప ప్రాంతాలలోని పాఠశాలల పిల్లలకు ఆటవిడుపుగా మారింది. ఉచితంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో పిల్లలే కాదు. పెద్దలు కూడా భారీగా పక్షుల పండుగకు తరలివచ్చారు.
తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర ఆదేశాలతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పక్షుల విడిది కేంద్రం నేలపట్టు, అటకానితిప్ప, బీవీ.పాలెం బూటింగ్ పాయింట్ వద్దకు వెళ్లడానికి సూళ్లూరుపేట బస్టాండ్, జూనియర్ కాలేజీ వద్ద ప్రత్యేకంగా ఉచిత బస్సులు సిద్ధంగా ఉంచారు. అక్కడి నుంచి సందర్శన కేంద్రాలకు భారీగా సందర్శకులు ప్రయాణాలు సాగించి, చేరుకున్నారు.
ఉచితంగా రవాణా
20వ తేదీ వరకు : సూళ్లూరుపేట వద్ద 10 ఉచిత బస్సులు సిద్ధంగా ఉంచారు. మహిళలు, పిల్లలు, సందర్శకులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడి నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించే నేలపట్టు, పులికాట్ సరస్సు, బీవీ.పాలెం వద్దకు వెళ్లడానికి ఉచిత రవాణా సదుయాం కల్పించారు.
ఈ రోజు కార్యక్రమాలు
సాయంత్రం 6 గంటల నుంచి 7 గంట వరకు ఫిలిం షో
7 గంటల నుంచి 9 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు
లాహిరి.. లాహిరిలో..

బీవీ. పాలెం వద్ద పులికాట్ సరస్సు వద్ద దృశ్యం మాటలకు అందని భావాలు చెబుతోంది. కొన్ని పక్షులు స్వేచ్ఛగా నీటిపై అంతర్లు కొడుతూ ఆకాశంలోకి దూసుకుపోతున్నాయి. ఇంకొన్ని వలస పక్షులు కూడా ప్రకృతిని ఆస్వాదిస్తున్నట్లు ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక్కడి పులికాట్ సరస్సు వద్ద ఏర్పాటు చేసిన 30 పడవల్లో పెద్దలు, పిల్లలు పడవపై షికారు చేస్తున్నారు. ఆకాశంలో ఎగురుతున్న పక్షుల అందచందాలు ఆస్వాదిస్తున్నారు. అలలపై తేలియాడుతూ, కేరింతలు కొడుతున్నారు. పక్షులను చూసి సందర్శకులు ఆనంద పడుతున్నారా.. వారి కేరింతలు చూసి పక్షులు మురిసిపోతున్నాయా అనే విధంగా అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. బోటులో విహరించే సందర్శకులకు లైఫ్ జాకెట్లు ఇవ్వడంతో పాటు పడవలో ఇద్దరు గజఈతగాళ్లు ప్రయాణించే విధంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
నెమలికి నడక నేర్పేలా...

పులికాట్ సరస్సు వద్ద దృశ్యాలు కన్ను ఆర్పనివ్వడం లేదు. తేలికపాటి నీటిలో సైబీరియా పక్షులు క్యాట్ వ్యాక్ ను తలపిస్తున్నాయి. ఆహార అన్వేషణలో ఉన్న పక్షుల నడక చూపుతిప్పుకోనివ్వడం లేదు. వయ్యారగా కాళ్లు కదుపుతున్న పక్షులు నీటిలోని చేపలు, పురుగుల వేటలో నిమజ్ణం అయ్యాయి. ఇక్కడ వాతావరణం ఆస్వాదించడానికి వచ్చిన సందర్శకులు పక్షుల కదలికలు కట్టిపడేస్తున్నాయి.


Tags:    

Similar News