రోజు రోజుకు పెరుగుతోన్న జగన్ ముద్ర పడిన అధికారుల జాబితా
ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వం తాలూకు వాసనలున్న అధికారులపై వేటు వేయడం పరిపాటిగా మారింది. జీఏడీకి రిపోర్టు చేసే అధికారుల సంఖ్య పెరుగుతోంది.
Byline : The Federal
Update: 2024-06-23 12:51 GMT
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారడంతో గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తాలూకు ముద్ర పడిన ఐఏఎస్ అధికారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగిన ప్రతి సారి వారి జాబితా పెరుగుతోంది. జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు, జగన్‌కు, ఆయన ప్రభుత్వానికి అనుకూలంగాను, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగాను వ్యవహరించారనే కారణాలతో సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)కు అటాచ్ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. వారికి ఎలాంటి పోస్టింగ్‌లకు ఇవ్వకుండా జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ వెయిటింగ్‌లో పెడుతున్నారు.
గత ఐదేళ్లు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ అటు ఐఏఎస్, ఇటు ఐపీఎస్ అధికారులను చాల క్లోజ్‌గా మోనిటర్ చేస్తూ వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు ప్రతిపక్ష నేతలను ఇబ్బందులకు గురి చేశారు? ఎవరు జగన్‌కు, ఆయన ప్రభుత్వానికి తొత్తులుగా పని చేశారనే అంశాలపై చాలా దగ్గరగా చూస్తూ వచ్చారు. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసి, పరిపాలన రంగంలో ఏళ్ల తరబడి అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు ఏ అధికారి ఎలా వ్యవహరిస్తారనే విషయాన్ని ఈజీగానే గుర్తించగలుగుతారు. ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లల్లోను, ఎన్నికల ప్రచారంలోను, తనను అరెస్టు చేసినప్పుడు, ఇతర నేతలను అరెస్టులు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఆయా అధికారులపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ వచ్చారు. ప్రభుత్వం ఎప్పుడూ ఒకేలా ఉండదని, తాము కూడా అధికారంలోకి వస్తామని, అప్పుడు పరిస్థితులు మారుతాయని అంటూ వారికి ఇన్‌డైరెక్టుగా వార్నింగ్‌లు ఇస్తూ వచ్చారు. అయినా కొంత మంది అధికారులు వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, నేతల్లా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. మరి కొంత మంది అధికారులు నాటి ప్రభుత్వ పెద్దల ప్రెషర్ వల్ల వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయనే టాక్ ఉంది. ఎన్నడు లేని విధంగా గత ఐదేళ్లల్లో అధికారుల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం, మంచి పోస్టింగ్‌ల కోసం ప్రభుత్వ పెద్దలు ఏమి చేస్తే అది చేయడానికి కూడా వెనుకాడ లేదనే టాక్ అధికార వర్గాలోను, రాజకీయ వర్గాల్లోను ఉంది.
ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల జరిగాయి. జగన్ ప్రభుత్వం కుప్ప కూలింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 164 సీట్ల అఖండ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు.
ప్రభుత్వం ఇంక కొలువు దీరక ముందే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మార్చారు. మూడు రోజుల క్రితం డీజీపీని మార్చారు. అంతకంటే ముందు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న పీ సీతారామాంజనేయులు, సిట్ చీఫ్‌గా వ్యవహరించిన డాక్టర్ కొల్లురఘురామిరెడ్డిని జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు. తాజాగా శనివారం చేపట్టిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో పలువురిని జీఏడీకి రిపోర్టు చేయాలని సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. 18 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తే వీరిలో ఏడుగురు అధికారులను జీఏడీకి రోపోర్టు చేయాలని ఆదేశించారు.
గుంటూరు కలెక్టర్‌గా ఉన్న ఎం వేణుగోపాలరెడ్డి, విశాఖపట్నం కలెక్టర్‌గా ఉన్న ఎ మల్లికార్జున్, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఎం విజయసునీత, కాకినాడ జిల్లా కలెక్టర్‌గా ఉన్న జె నివాస్, ఏలూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న వి ప్రసన్నవెంకటేశ్, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా ఉన్న కే మాధవీలత, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఎస్ ఢిల్లీరావును జీఏడీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు.
అంతకుముందు బదిలీ చేసిన ఐఏఎస్ అధికారుల్లో కూడా సీనియర్ ఐఏఎస్‌లను కూడా జీఏడీకి అటాచ్ చేశారు. జూన్ 19న సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాదాపు 19 మంది సీనియర్ ఐఏఎస్ అదికారులను బదిలీ చేసింది. వీరిలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న వై శ్రీలక్ష్మి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రజత్ భార్గవ, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్‌ప్రకాశ్‌తో పాటు మరో సీనియర్ ఐఏఎస్ అధికారి మురళీథర్‌రెడ్డిని జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది.
ఇప్పటి వరకు చేపట్టిన ఐపీఎస్ అధికారుల బదిలీల్లో ఇప్పటికే సీనియర్ ఐపీఎస్‌లైన పీ సీతారామాంజనేయులు, ఎన్ సంజయ్, కొల్లు రఘురామిరెడ్డి వంటి అధికారులను జీఏడీకి అటాచ్ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అదనపు డీజీ ర్యాంకు అధికారి పీవీ సునిల్‌కుమార్‌ను కూడా జీఏడీకి అటాచ్ చేసింది. రానున్న రోజుల్లో జగన్ ముద్రపడిన అధికారుల జాబితా పెరగనుందని, వీరందరినీ జీఏడీకి అటాచ్ చేసే అవకాశలే అధికంగా ఉన్నాయనే టాక్ అధికార వర్గాల్లో సాగుతోంది.