అన్నా చెల్లెళ్ల ఎన్నికల ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. కడప నుంచి అవినాష్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో గెలిచేది లేదని వైఎస్ షర్మిలచెబుతున్నారు. కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించాల్సిందేనని సీఎం వైఎస్ జగన్ అవినాష్‌ను రంగంలోకి దించారు. జగన్ తమ్ముడిని గెలిపించుకుంటారా.. చెల్లిలకు అవకాశం కల్పిస్తారా,. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. నా కుటుంబాన్ని నాకు కాకుండా చేసింది కాంగ్రెస్ పార్టీయేనని జగన్ అంటున్నారు. పైగా కాంగ్రెస్ పార్టీ మా కుటుంబాన్ని అష్ట కష్టాలు పెట్టిందని పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. నా చెల్లెలు కాంగ్రెస్ ట్రాప్‌లో పడిపోయిందని ఆమె మాటలు ఎవ్వరూ నమ్మొద్దని జగన్ అంటున్నారు. మరో వైపు రక్త సంబంధం అంటూ షర్మిల మాట్లాడటం.. షర్మిల మాటలను నమ్మొద్దని జగన్ చెప్పడం చూస్తుంటే రక్త సంబంధమనేది మాటల్లో తప్ప మనస్సుల్లో లేదని అర్థమవుతుంది. ఇక వీరద్దరి మధ్య జరగబోయేది ఎన్నికల ఘట్టంలో తుది పోరుగా చెప్పొచ్చు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఎలా జరిగిందో.. ఎవరు చేశారో తెలుసు.. ముఖ్యమంత్రి హోదాలో ఉండి చిన్నాన్నను చంపిన వారికి టికెట్ ఇచ్చి రాజకీయాలను కొనసాగిస్తున్నారు. అందుకే నేను కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నా.. నా నిర్ణయం కుటంబాన్ని చీలుస్తుందని తెలుసు. అయినా ఎన్నికల్లో నిలబడుతున్నానని చెప్పి సంచలనం సృష్టించారు వైఎస్ షర్మిలా. నా పోటీ వైఎస్‌ఆర్ అభిమానుల్లో గందరగోళం సృష్టించే అవకాశం కూడా లేకపోలేదు. అయినా తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవలిసి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక పూరై్త ప్రకటించిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ వివేకా హత్య చుట్టే కడప రాజకీయం
వైఎస్ వివేకా హత్య ఉదంతం రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రధానమైన ఎన్నికల అస్త్రంగా మారింది. చిన్నాన్న నన్ను ఎంపీగా చూడాలనుకున్నారు. ఎందుకు చూడాలనుకున్నారో నాకు ఇప్పడర్థమైంది. అంటూ షర్మిలా వ్యాఖ్యానించడం కూడా సంచలనమైంది. వైఎస్‌ఆర్ బిడ్డ ఎన్నికల్లో నిలబడుతోంది. ఈ నిర్ణయం నాకు సులువైంది కాదు. చాలెంజ్ లాంటిది. అంటూ ఆమె మాట్లాడారు. ఇక షర్మిల మాట్లాడిన ప్రతి మాట ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చుట్టేసింది. నా అనుకున్న వాళ్లందరినీ సీఎం జగన్ నాశనం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డిలో నా రక్తం ఉంది. ముఖ్యమంత్రి అయ్యాక జగన్ పూర్తిగా మారిపోయారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించారు. దీనిని నేను తట్టుకోలేక పోతున్నా. అందుకే కడప నుంచి పోటీ చేస్తున్నా. నన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని, గెలిపిస్తారని నాకు తెలుసు. హత్యలు చేసిన వారి వివరాలను సాక్షాధారాలతో ఉన్నా అధికారాన్ని వాడుకొని జగన్ వారిని రక్షిస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. సాక్షి చానల్ చేసిన తప్పుడు ప్రచారం ప్రజలకు తప్పుగానే అందింది. తప్పుడు కథనాల వల్ల ఎన్ని అనర్థాలు చోటు చేసుకుంటాయో ఇప్పుడు కూడా తెలుసుకోక పోతే జాతి వారిని క్షమించదని ఆమె పేర్కొన్నారు.
న్యాయం కోసం సునీత ఎక్కని గడప లేదు
సునీత తిరగని న్యాయ స్థానం లేదు. అయినా న్యాయం సునీతకు అందని ద్రాక్షగానే మిగిలి పోయింది. అంటూ అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పడం పలువురిని ఆశ్చర్య పరచింది. హంతకుడు పార్లమెంట్ మెట్లు ఎక్క కూడదనే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు నిజమిదే అన్నారు. కాంగ్రెస్ తరఫున వైఎస్‌రాజశేఖర్ రెడ్డి పది సార్లు ఎన్నికల్లో గెలిచారు. పదవులున్నా లేకున్నా పార్టీలోనే నిలబడ్డారు. కాంగ్రెస్‌పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చారు. దేశానికి కాంగ్రెస్ పార్టీనే మంచి చేస్తుందని నమ్మిన వారిలో వైఎస్‌ఆర్ ఒకరు. వైఎస్‌ఆర్ బతికుంటే ఈ పాటీకి రాహుల్ గాంధీ ఖచ్చితంగా ప్రధాని అయ్యుండే వారని అన్నారు.
వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన షర్మిలా ఐదు పార్లమెంట్ స్థానాలు 114 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల జాబితాలను విడుదల చేశారు. మరో మూడు రోజుల్లో తుది జాబితా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.