నేను మీ అమ్మను రా, గొంతు కోయొద్దురా!

ప్రాదేయపడిన తల్లి, కనికరించని కొడుకు.. తల్లి గొంతుకోసి టీవీ చూస్తూ కాలక్షేపం చేసిన కిరాతకుడు

Update: 2025-10-05 11:37 GMT
తల్లి లక్ష్మీదేవి (కుడి)ని చంపిన తనయుడు (ఎడమ)
నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని కిరాతకంగా గొంతుకోసి చంపాడు ఇక్కడో కిరాతకుడు. అడిగిన డబ్బులివ్వలేదని అంత పైశాచికంగా వ్యవహరించిన కొడుకును ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నా అతడిలో ఏ మాత్రం పశ్చాత్తాపం కనపడకపోగా రాక్షసానందం పొందడం గమనార్హం. ఇంతటి ఘాతుకం కడప జిల్లా ప్రొద్దుటూరు శ్రీరామ్ నగర్ లో జరిగింది. తల్లి ప్రాణం తీసిన అనంతరం ఎలాంటి జంగూగొంకూ లేకుండా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ రాక్షసానందం పొందాడు. ఈ ఘటన కలకలం రేపింది.

ప్రొద్దుటూరుకు చెందిన ఉప్పులూరు లక్ష్మీదేవి, విజయ్ భాస్కర్ రెడ్డి దంపతులు శ్రీరామ్ నగర్ లో ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు. పేరు యశ్వంత్ రెడ్డి. లక్ష్మీదేవి ఈశ్వర్‌నగర్‌లో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. యశ్వంత్‌ మూడేళ్ల క్రితం చెన్నైలో బీటెక్‌ పూర్తిచేశాడు. ఉద్యోగాన్వేషణ కోసం హైదరాబాద్‌ వెళ్లాడు. ఖర్చుల కోసం తల్లి ప్రతినెలా అతడికి డబ్బులు పంపించేవారు.
ఈనేపథ్యంలో ఇటీవల తల్లికి ఫోన్‌ చేసిన యశ్వంత్‌.. రూ.3వేలు అడిగితే పంపించారు. మరోసారి ఫోన్‌ చేసి రూ.10వేలు కావాలని పట్టుబట్టాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో తల్లిపై కోపం పెంచుకున్న యశ్వంత్‌.. కుటుంబసభ్యులకు చెప్పకుండా ఆదివారం ఉదయం హైదరాబాద్‌ నుంచి ప్రొద్దుటూరులోని ఇంటికి చేరుకున్నాడు.

వచ్చీరాగానే తల్లితో గొడవకు దిగి దాడి చేశాడు. ఆమె అరిచి కేకలు పెట్టారు. ఆ కేకలు విని బెడ్‌రూమ్‌లో ఉన్న తండ్రి విజయ్‌ భాస్కర్‌రెడ్డి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. కోపంతో ఊగిపోతున్న యశ్వంత్ రెడ్డి తండ్రిని గది లోపలికి నెట్టేసి బయట గడియపెట్టాడు. ఆ తర్వాత కూరగాయల కత్తితో తల్లి గొంతు కోశాడు. ఒరేయ్.. నీ తల్లిని రా.. చంపొద్దురా అని వేడుకున్నా ఆ రాక్షసుడు వినకుండా కూరగాయల్ని కోసినట్టు తల్లి గొంతు కోశాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న లక్ష్మీదేవిని ఈడ్చుకుంటూ వచ్చి బయటపడేశాడు. ఆపై తలుపు వేసుకుని ఇంట్లో దర్జాగా టీవీ చూస్తూ కూర్చున్నాడు.
కొడుకు ఆగడాన్ని తండ్రి చుట్టుపక్కల వారికి తెలియజేయడంతో వాళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వీళ్లు ఉంటున్న ఇంటికి వచ్చి పరిశీలించారు. పోస్టుమార్టం కోసం లక్ష్మీదేవి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Tags:    

Similar News