టీడీపీ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికలో ఉత్కంఠకు తెర
ఇప్పటి వరకు ఎదురు చూసిన నాలుగు ఎంపి స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించి ఉత్కంఠకు తెరదించింది. ఎంపీ స్థానాలు పూర్తి స్థాయిలో టీడీపీ భర్తీ చేసింది.
By : The Federal
Update: 2024-03-29 13:39 GMT
జి.విజయ కుమార్
విజయనగరం ఎంపి అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడును, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసుల రెడ్డిని, అనంతపురం ఎంపి అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణను, కడప ఎంపి అభ్యర్థిగా భూపేష్‌రెడ్డిని ఖరారు చేస్తూ శుక్రవారం జాబితాను విడుదల చేశారు. అయితే సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత వారం, పది రోజులుగా వీరిపైన సర్వేల కసరత్తు చేపట్టారు. అభ్యర్థుల వారీగా చేపట్టిన సర్వేలో వచ్చిన వివరాలను క్రోడీకరించిన తర్వాత వచ్చిన ఫలితాల ఆధారంగా తుది నిర్ణయం తీసుకున్నారు. అలా సర్వేలో ప్రథమ స్థానంలో నిలచిన వారికే సీట్లను ఖరారు చేశారు. ఒంగోలు విషయంలో సర్వే ద్వారా కాకుండా నేరుగా మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఎంపిక చేయాలనే ఉద్దేశంతో ఆయనకే టికెట్ ఖరారు చేసినట్లు తెలిసింది.
కలిశెట్టికి కలిసొచ్చిన విజయనగరం
విజయనగరం ఎంపిగా కలిశెట్టి అప్పలనాయుడును ప్రకటించారు. ఈ సీటు కోసం మరో ముగ్గురు నాయకుల పేర్లను పరిశీలించారు. ఎచ్చెర్ల నియోజక వర్గానికి చందిన కలిశెట్టి అప్పలనాయుడు, కంది చంద్రశేఖర్, మీసాల గీత లను పరిశీలించారు. వేర్వేరుగా వీరి అభ్యర్థిత్వాలపై సర్వే కూడా చేపట్టారు. చంద్రబాబు చేపట్టిన ఐవీఆర్‌ఎస్ సర్వేలో కలిశెట్టి అప్పలనాయుడుకు అనుకూలంగా అభిప్రాయాలు రావడంతో ఆయనకే విజయనగరం ఎంపీ స్థానం ఖరారు చేశారు.
అనంతపురంకు అంబికా
అనంతపురం పార్లమెంట్ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ పేరును ఖరారు చేశారు. ఆయన శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మాజీ అహుడా చైర్మన్‌గా కూడా అంబికా లక్ష్మీనారాయణ పని చేశారు.
ఒంగోలుకు మాగుంటనే
ఒంగోలు సిట్టింగ్ ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు ఖరారు చేశారు. ఆయన నాలుగు సార్లు ఎంపి, ఒక సారి ఎమ్మెల్సీగా పని చేశారు. ఒంగోలు కేంద్రంగానే రాజకీయాలు చేశారు. మాగుంట సుబ్బరామిరెడ్డి మరణానంతరం మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఈ ఎన్నికల్లో తనకు కాకుండా తన కుమారుడికి టికెట్ ఇప్పించుకునేందుకు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ప్రయత్నం చేసి విఫలమయ్యారు. అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని మాగుంట శ్రీనివాసులు రెడ్డికే టికెట్ ఇస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన జాబితాలో టికెట్ దక్కింది.
కడపకు భూపేష్ రెడ్డి
కడప ఎంపీ టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డిని చంద్రబాబు ప్రకటించారు. భూపేష్ రెడ్డి ప్రస్తుతం జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్నారు. మరో వైపు కడప ఎంపి స్థానానికి సిట్టింగ్ ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డినే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇది వరకే ప్రకటించారు. అయితే అవినాష్‌రెడ్డికి ధీటైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు చంద్రబాబు తీవ్రమైన కసరత్తు చేపట్టారు. అందులో భాగంగా కడప జిల్లా టీడీపీ నేతలు ఆర్ శ్రీనివాస్‌రెడ్డి, వీరశివారెడ్డి, భూపేష్‌రెడ్డి, జి ప్రవీణ్‌రెడ్డి పేర్లను చంద్రబాబు పరిశీలించారు. వీరిపైన ప్రత్యేక సర్వే కూడా చేపట్టారు. నేతల వారీగా చేపట్టిన ఐవీఆర్‌ఎస్ సర్వే భూపేష్‌రెడ్డికి అనుకూలంగా రావడంతో ఆయనను కపడ ఎంపిగా ఎంపిక చేసినట్లు సమాచారం.