సింహపురిలో బిగ్ ఫైట్.. "ఫ్యాన్" కు ఎదురుగాలి
సింహపురిలో బిగ్ ఫైట్‌కు దారి తీసింది. సునాయాసంగా గెలిచిన అసెంబ్లీ స్థానాల్లో ఎదురుగాలి వీస్తోంది. ఇది అధికార పార్టీ స్వయంకృతం అని చెప్పడంలో సందేహం లేదు.
(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)
తిరుపతి: ఒకప్పటి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అందుకు ఏమాత్రం కొరత లేకుండా వైఎస్ఆర్సిపిని ఆదరించిన నాయకులు తిరగబడ్డారు. గడిచిన ఐదేళ్లలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారాయి. ఇది కాస్తా.. పెద్దరెడ్ల మధ్య బిగ్ ఫైట్‌కు తెరలేపింది.
నెల్లూరు జిల్లాలో రాజకీయ ఎపిసోడ్‌కు ప్రధానంగా రెండే కారణాలు. ఒకటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్, రెండోది రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మధ్య రగిలిన చిచ్చు. ఇది కాస్త నెల్లూరు రాజకీయాన్ని తలకిందులు చేసింది. ఆధిపత్యం కోసం వైఎస్ఆర్‌సిపి, పట్టు సాధించాలని టిడిపి పాకులాడుతోంది. ఆ పార్టీల్లోని నాయకులు వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్నారు. అధికార పార్టీ నుంచి తిరుగుబాటు చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యుడు టిడిపి నుంచి పోటీ చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ కడప జిల్లాకు ఏమాత్రం తీసిపోని రీతిలో 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఓటర్లు 10కి 10 అసెంబ్లీ స్థానాలు వైయస్ఆర్ సీపీకి కట్టబెట్టారు. ప్రస్తుతం అధికార పార్టీ ఎదురీదుతోంది.
2024 ఎన్నికల్లో .. నెల్లూరు జిల్లాలో మూడు నియోజకవర్గాల మినహా మిగతా ఏడు శాసనసభ స్థానాలు పార్లమెంటు స్థానంలో రెడ్డి సామాజిక వర్గమే ప్రత్యర్థులుగా ఉన్నారు. దీంతో నెల్లూరు జిల్లాలో అధికార వైఎస్ఆర్సిపి ప్రతిపక్ష టిడిపి అభ్యర్థుల మధ్య బిగ్ ఫైట్‌గా మారింది.
మలుపుతిప్పిన ఘటన
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారని ఆరోపణపై ముగ్గురు ఎమ్మెల్యేలను వైఎస్ఆర్సిపి సస్పెండ్ చేసింది. అదే సమయంలో.. పంచాయతీ విషయమై అప్పటి వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి-మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌తో రగిలిన రగడ మరో మలుపు తీసుకుంది. వారంతా టిడిపిలోకి జంప్ అయ్యారు. అక్కడే సీన్ మారింది.
రాజకీయ తుఫాన్
నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని టిడిపి అభ్యర్థిగా రంగంలోకి దించారు. దీంతో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ఆ పార్టీ బరిలో నిలపడంతో. రాజకీయ తుఫాన్‌కు తెరలేసింది. ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కడంతో పాటు ఆ ప్రభావం జిల్లాపై కూడా ఎక్కువగానే కనిపిస్తోంది.
నెల్లూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిడిపిలో చేరికతో జిల్లా రాజకీయ స్వభావం పూర్తిగా మారిపోయింది. ఆర్థిక, అంగబలానికి ఏమాత్రం తక్కువ కానీ ఆయన.. టిడిపిలో చేరిక ద్వారా అధికార వైఎస్సార్సీపీకి ఎదురుగాలులు వీచడానికి మరింత ఆజ్యం పోశారు.
ఒక్కరితో తిరగబడిన రాజకీయం!
అప్పటికే అధికార పార్టీ నుంచి ముగ్గురు తిరుగుబాటు ఎమ్మెల్యేలతో వైఎస్ఆర్సిపిలో గందరగోళం ఏర్పడింది. నెల్లూరు స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన అనిల్ కుమార్ యాదవ్ దూకుడు కూడా వికటించిందని భావిస్తున్నారు. దశాబ్దాల కాలం పాటు ఏకచత్రాధిపత్యంగా నాయకత్వాన్ని నిర్వహించిన రెడ్డి సామాజికవర్గం జీర్ణించుకోలేకపోవడంతో పాటు తమ అస్తిత్వానికి ఎదురు దెబ్బ తగలకుండా జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లు ఇక్కడ వాతావరణం కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో వైయస్సార్సీపి నుంచి తిరుగుబాటు చేసి వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధికార పార్టీకి కొరుకుడు పడ
లేదు. అంతకుముందే ముగ్గురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటికి నలుసుగా మారారు. ఈ పరిస్థితిలో ఎదురు వేస్తున్న వైఎస్ఆర్సిపికి ఐదు నియోజకవర్గాల్లో ఎదురుదెబ్బ తప్పదని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితిని నివారించడానికి వైఎస్సార్సీపీలో కీలకంగా, ట్రబుల్ షూటర్‌గా భావించే ఏ విజయసాయిరెడ్డిని వేమిరెడ్డిపై పోటీకి దింపారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో అధికార వైఎస్ఆర్సిపి నేతల్లో అది కూడా కీలకమైన వ్యక్తులు సాగించే బ్యాక్ డోర్ పాలిటిక్స్ ఎంత మేరకు ప్రయోజనం చేయగలుగుతాయనేది కూడా జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. నియోజకవర్గాల పరిస్థితి పరిశీలిస్తే..
కోవూరులో అమితుమీ
కోవూరు అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పోటీకి దిగారు. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగిన నేపథ్యంలో అది కాస్త వైఎస్ఆర్సిపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతికి కలిసి వచ్చింది. ఆర్థిక అంగఫలాల్లో బలీయమైన శక్తిగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంతికి ఈ నియోజకవర్గంలో అధికార వైఎస్ఆర్సిపి నాయకులు అక్రమంగా సాగించిన గ్రావెల్, ఇసుక, మైనింగ్ వ్యవహారాలతో ఏర్పడిన వ్యతిరేకత టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతికి కలిసి వస్తాయని భావిస్తున్నారు.
ఇద్దరు.. ఇద్దరే
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం కుటుంబం, మేకపాటి కుటుంబం కీలక భూమిక పోషిస్తాయి. అలాంటి నేపథ్యం కలిగిన ఇద్దరు ఆత్మకూరులో తలపడుతున్నారు. సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డితో పోటీపడుతున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తిగా విక్రం రెడ్డి పేరు సంపాదించుకున్నారు. పూర్తి వ్యవసాయ ఆధారిత నెల్లూరు జిల్లాకు జీవనాడి సోమశిల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం, నీటిపారుదల రంగాన్ని అధికార వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చిన్న చూపు చూసిందనే అపవాదు ఉంది. ఇది వైఎస్ఆర్సిపి అభ్యర్థిపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం లేకపోతే భావన వ్యక్తం అవుతుంది. ఈ ప్రాంతంలో టిడిపి అభ్యర్థి మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గతంలో చేసిన అభివృద్ధి పనులు ప్రజల్లో బలంగా ఉన్నాయి. వీటితోపాటు, ప్రభుత్వ వ్యతిరేకత ఆయనకు కలిసొచ్చే అంశాలుగా చెప్పవచ్చు.
రాజకీయ చైతన్యం ఉదయగిరి సొంతం
రాజకీయ చైతన్యానికి ఉదయగిరి మారుపేరుగా నిలుస్తుంది. ఈ నియోజకవర్గం హాట్ హాట్‌గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి వైఎస్ఆర్సిపిలో టికెట్ దక్కలేదు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి టిడిపిలో చేరినా అభ్యర్థిత్వం దక్కలేదు. ఇక్కడ నుంచి ఆయన సోదరుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి, టిడిపి నుంచి కొత్త అభ్యర్థి కాకర్ల సురేష్‌ను పోటీకి నిలిపింది. వీరిద్దరు కూడా స్వపక్షంలోనే ప్రతిపక్షాన్ని చూస్తున్నారు. తమ కుటుంబానికి ఉన్న మంచి పేరు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మేలు చేస్తాయని వైస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు. గడచిన రెండేళ్లుగా సాగించిన సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు వైఎస్ఆర్సిపి నుంచి తిరుగుబాటు చేసి వచ్చిన నాయకులతో తనకు మేలు జరుగుతుందని టిడిపి అభ్యర్థి కాకల సురేష్ ధీమాగా ఉన్నారు. మిట్ట ప్రాంతంగా ఉన్న ఉదయగిరి రైతాంగానికి అధికార పార్టీ నిర్లక్ష్యం చేయడం ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు.
తగ్గేదేలే.... అంటున్న కోటంరెడ్డి
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి నుంచి తిరుగుబాటు చేసి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తగ్గేదెలే.. అని దూసుకుపోతున్నారు. వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి సెంటిమెంట్ మాటలతో ప్రజలకు చేరువ కావడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలో ఉన్న సరే ప్రతిపక్షంగా గొంతు వినిపించే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజలతో మొదటి నుంచి మమేకం కావడం ఆయనకు ఉన్న ఒక ఆస్తిగా భావిస్తారు. నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదని మాటలను తిప్పికొట్టే విధంగా వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కొన్ని పనులు చేయించారు. అయితే ఈ నియోజకవర్గంలో పరిధి కొంత నెల్లూరు నగరంలో కూడా ఉంది. ఇక్కడ టిడిపి అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సోదరులు పోల్ మేనేజ్మెంట్ చేయడంలో మంచి నేర్పరితనం ఉన్న నాయకులుగా పేరుపొందారు. వారి కుటుంబ సభ్యులు ప్రజలతో పూర్తిస్థాయిలో మమేకమయ్యారు. గత ఎన్నికల కంటే భిన్నంగా మళ్ళీ పట్టు సాధిస్తామనే ధీమాతో వారు ఉన్నారు.
నెల్లూరు నగరం ఆసక్తికరం...
నెల్లూరు అర్బన్ నియోజకవర్గం పరిధి ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు ముందు వైయస్ఆర్సీపీలో ఏర్పడిన అలజడి వల్ల నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌కు స్థానభ్రంశం కలిగింది. ఆయన ఎంపీగా పోటీ చేయడానికి రాజకీయ బదిలీ జరిగింది. నగరంలో ముస్లిం మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉన్నందున వైఎస్ఆర్సిపి ఖలీల్ అహ్మద్ను అభ్యర్థిగా పోటీ చేస్తుంటే ఆయనపై మాజీ మంత్రి టిడిపి అభ్యర్థిగా పి. నారాయణ పోటీ పడుతున్నారు.
కావలిలో కష్టమేనా!?
కావలి నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ సాధించడానికి సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్ కుమార్ రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడి నుంచి టిడిపి అభ్యర్థిగా కావ్యకృష్ణారెడ్డికి టిడిపి చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు పోటీ చేయిస్తున్నారు. అధికార పార్టీ నుంచి టిడిపిలో చేరిన నాయకుల సహకారం మెండుగా ఉండే ఈయనకు మాజీ ఎమ్మెల్సీ అండ కూడా ఉంది. వైయస్ఆర్సీపీ అభ్యర్థికి ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు స్థానిక అంశాలు ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు.
బండారం బట్టబయలు
నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా కనిపించని పరిస్థితి సర్వేపల్లి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారింది. వైఎస్ఆర్సిపి నుంచి పోటీ చేస్తున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఈసారైనా గెలవాలి అనే పట్టుదలతో రంగంలోకి దిగిన టిడిపి అభ్యర్థి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్న తీరు ఏమాత్రం వర్ణించడానికి వీలుకాదు. అవినీతి చక్రవర్తి నువ్వు అని కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసే వ్యాఖ్యలను.. గనులను దోచేసావంటూ సోమిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దీటుగా సమాధానం చెబుతున్నారు. వీరిద్దరి మాటలు ఒకరి బండారాన్ని మరొకరు బయట వేసుకున్నారు. వీరి వ్యవహారాన్ని ఓటర్లు టికెట్ లేని సినిమాల ఆస్వాదిస్తున్నారు. అయితే, నాలుగు సార్లు ఓటమి చెందిన సోమిరెడ్డికి సానుభూతితో పాటు కృష్ణపట్నం కంటైనర్ పోర్టు తరలిపోయిన వ్యవహారం కూడా వైఎస్ఆర్సిపికి ప్రతికూలంగా మారే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. అంతేకాకుండా గనుల అక్రమ తవ్వకాలు, ఇసుక రవాణా వంటి కళాపాలు అధికార వైఎస్ఆర్సిపికి దెబ్బతీసే అవకాశం ఉందని చెబుతున్నారు.
వెంకట "కిరికిరి"
వెంకటగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ అభ్యర్థికి ప్రతికూలత ఎక్కువగా ఉంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి ఆ పార్టీలోని గ్రూపులే వ్యతిరేకంగా ఉన్నాయని చెబుతున్నారు. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆనం రామనారాయణ రెడ్డి ప్రభావంతో పాటు ఇటీవల వైఎస్ఆర్సిపిని వేడి టిడిపిలో చేరిన నాయకుల ప్రభావం కూడా వైఎస్ఆర్సిపిపై ఎక్కువగా చూపిస్తుందని భావిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కుమార్తె లక్ష్మిసాయికి బదులు ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు టికెట్ ఇచ్చారు. టిడిపిలోని వర్గ పోరు, అభ్యర్థి పై ఉన్న వ్యతిరేకత వంటి అంశాలన్నీ టిడిపి అభ్యర్థి కోరుకొండ రామకృష్ణకు పూర్తిస్థాయిలో కలిసే రావడంతో పాటు జిల్లాలో మొదట గెలిచేది వెంకటగిరి నియోజకవర్గంలోనే అనే భావన కూడా పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
స్థానికతకు పట్టం..!
గూడూరు ఎస్సీ రిజర్వ్ స్థానం నుంచి పాశం సునీల్ కుమార్ టిడిపి అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. గత ఐదేళ్లుగా పార్టీ కోసం ఆయన అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అదే ఆయన అభివృద్ధిత్వానికి దిక్సూచిగా నిలిచింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న వరప్రసాద రావు స్థానంలో వైఎస్ఆర్సిపి మేరిగా మురళీధర్‌కు అవకాశం కల్పించింది. స్థానికేతరుడు అనే సమస్య ఆయనను వెంటాడుతున్నట్లు చెబుతున్నారు.
మరో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం సూళ్లూరుపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె నెలవల విజయశ్రీకి టిడిపి అభ్యర్థిగా అవకాశం కల్పించారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో కిలివేటి సంజీవయ్యతో పాటు టిడిపి అభ్యర్థి విజయశ్రీ తండ్రి సీనియర్ నాయకుడు కావడం మంచి సత్సంబంధాలు ఉండటం వల్ల దీటైన పోటీనే ఉందని భావిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పరిస్థితి మొత్తం మారడానికి ఒకే కారణం ఉంది. అందుకు ఇద్దరు వ్యక్తులే అని కూడా అంటున్నారు.
రాష్ట్రంలో వైఎస్ఆర్సిపిని ప్రధానంగా వైఎస్. జగన్మోహన్ రెడ్డిని అభిమానంతో కడప తర్వాత అంతటి ప్రాధాన్యతను నెల్లూరు జిల్లా ప్రజలు, ఓటర్లు, నాయకులు ఆదరించారు. మోనార్క్ రాజకీయాల వల్ల వైయస్ఆర్సీపీకి సంవత్సరాల వ్యవధిలోని ఎదురుదెబ్బ తగలడానికి దారి తీసిన పరిస్థితులను మదింపు చేసుకోవడంలో వైఫల్యం చెందారనే భావన వ్యక్తం అవుతోంది. అదుపులేని వనరుల దోపిడీ వ్యవహారాలను కూడా చూసీచూడనట్టు వ్యవహరించిన తీరు వ్యతిరేకతకు కారణంగా భావిస్తున్నారు. ఈ సవాళ్ల మధ్య తిరుగుబాట్లు కూడా పెద్ద దెబ్బతీసాయని అంచనా వేస్తున్నారు. వీటన్నిటి పర్యవసానం ఎలా ఉంటుందనేది ఇంకొన్ని రోజుల్లో జరుగుతున్న పోలింగ్ ద్వారా తేటతెల్లం కానున్నది.