వీరికి గవర్నర్లుగా అవకాశం..

తెలుగుదేశం పార్టీలో వీరు సీనియర్ నాయకులు. 2024 ఎన్నికల్లో వీరు పోటీ చేయలేదు. వీరిని గవర్నర్లుగా పంపించేందుకు చంద్రబాబునాయుడు ఆలోచిస్తున్నారు.

Update: 2024-06-12 03:00 GMT

వీళ్లిద్దరూ గవర్నర్లుగా వెళ్లే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పటికే వీరి గురించి ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి వివరించినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీలో సీనియర్లు కావడంతో వీరిని గవర్నర్లుగా పంపిస్తే గౌరవంగా ఉంటుందని చంద్రబాబునాయుడు భావించారు. 2024 ఎన్నికల్లో వీరు పోటీ చేయలేదు. ఇద్దరూ తమ కుమార్తెలను ఎన్నికల్లో పోటీ చేయించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన వారు. పూసపాటి అశోక్‌ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు. వీరు ప్రస్తుత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తమ కుమార్తెలను రాజకీయ రంగంలోకి దించారు. ఇద్దరూ తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. వయసు రిత్యా పెద్ద వారు కావడం వల్ల వీరికి గవర్నర్లుగా అవకాశం కల్పిస్తే తెలుగుదేశం పార్టీ తరపున గౌరవించినట్లు అవుతుందని, ప్రస్తుతం ఎన్‌డీఏలో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉండటం వల్ల గవర్నర్లుగా పంపించేందుకు అవకాశం ఏర్పడింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పార్టీలో సీనియర్లకు మంచి అవకాశం కల్పించినట్లు అవుతుందని చంద్రబాబునాయుడు భావించినట్లు సమాచారం.
అశోక్‌ గజపతి రాజు..
తొలిసారిగా జనతా పార్టీ తరఫున 1978లో పోటీ చేసారు. ఆపై 1983, 1985, 1989, 1994, 1999, 2009లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసారు. మొత్తం 36 యేళ్ళ రాజకీయ జీవితంలో 7 సార్లు ఎంఎల్‌ఏ గానూ, ఒక సారి ఎంపీ గానూ పదవీ బాధ్యతలు చేపట్టారు. పదవీ కాలంలో ఎన్నో సార్లు ఆంధ్రప్రదేశ్‌ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసారు. 2014లో విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గం నుండి పోటీ చేసి 16వ లోక్‌ సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో క్యాబినెట్‌ మంత్రిగా పౌర విమానయాన శాఖ బాధ్యతలు నిర్వహించారు. గతంలో ఎన్‌టి రామారావు క్యాబినెట్‌లో ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా, చంద్రబాబునాయుడు హయాంలో ఫైనాన్స్, లెజిస్లేటివ్‌ అఫయిర్స్‌ ఇంకా రెవెన్యూ శాఖలో మంత్రిగా పనిచేసారు. తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులుగా ప్రస్తుతం ఉన్నారు.
యనమల రామకృష్ణుడు...
యనమల రామకృష్ణుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్‌ రాజకీయ నాయకుడు. చంద్రబాబు నేతృత్వంలో 2014లో ఏర్పడిన మంత్రి మండలిలో ఈయన స్థానం సంపాదించాడు. శాసనమండలి సభ్యునిగా ఉంటూ మంత్రివర్గంలో స్థానం సంపాదించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో విభజన జరిగే వరకు తెలుగుదేశం పార్టీ తరపున ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగారు. ఈయన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల నుంచి 2004 ఎన్నికల వరకు వరుసగా అన్ని ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ఓటమి చెందిన ఈయన 2013లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా, స్పీకర్‌గా, అధికారంలో లేనప్పుడు పీఏసీ చైర్మన్‌ వంటి పదవుల్లో కొనసాగారు. 1983లో తూర్పుగోదావరి జిల్లా తుని ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్‌ తొలి మంత్రివర్గంలో న్యాయ, పురపాలక శాఖ బాధ్యతలు నిర్వహించారు. 1985–89 మధ్య మంత్రిగా, 1989–94లో పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ చైర్మన్‌గా, 1995–99లో శాసనసభ స్పీకర్‌గా కొనసాగారు. ఎన్టీఆర్‌ను దించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన సమయంలో ఈయనే స్పీకర్‌. 1999–2003లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 2004–08 మధ్య కాలంలో తిరిగి పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ చైర్మన్‌ బాధ్యతలు నిర్వహించారు.
వీరిరువురూ తెలుగుదేశం పార్టీకి జీవనాడి వంటి వారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పార్టీలోనే కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల్లో అశోక్‌ గజపతిరాజు కుమార్తె అదితి విజయలక్ష్మి గజపతి రాజు పోటీ చేసి గెలుపొందగా యనమల కుమార్తె యనమల దివ్య తుని నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.
Tags:    

Similar News