చరిత్ర సృష్టించిన థర్డ్‌ జెండర్లు..ఏపిలో ఎంత మంది ఓటర్లో తెలుసా

థర్డ్ జెండర్లు అంటే ఒకప్పుడు చిన్న చూపు. కానీ ఆ రోజులు పోయాయి. ఎన్నికల ప్రచార కర్తలుగా ఎన్నికల సంఘం నియమించింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గెలుస్తున్నారు.;

Update: 2024-03-15 11:55 GMT
third gender(file photo)

జి. విజయ కుమార్ 

సహజంగా ఓటర్లు అంటే టక్కున గుర్తొచ్చేది స్త్రీలు ఎంత మంది పురుషులు ఎంత మంది అని. ఇంకెలాంటి ఓటర్లు లేరనే భావం మైండ్‌లోకి వస్తుంది. కానీ వారు కూడా భారత దేశస్తులే. ఈ దేశపు పౌరులే. వారూ మనుషులే. వారే థర్డ్‌ జెండర్లు. హిజ్రాలు, ట్రాన్స్‌ జెండర్లుగా వారు ఫేమస్‌ అయితే వారికి సుప్రీం కోర్టు ఒక గౌరవం చేకూర్చుతూ థర్డ్‌ జెండర్లుగా గుర్తించింది. మరో వైపు ఎన్నికల సంఘం కూడా వారికి థర్డ్‌ జెండరుగా గుర్తిస్తూ ఓటు హక్కు కల్పించింది. అలా స్త్రీ, పురుషులతో పాటు థర్డ్‌ జెండర్‌లు కూడా ఓటర్లుగా మారారు. ట్రాన్స్‌ జెండర్లను కూడా స్త్రీ,పురుషులతో సమానంగా ఎన్నికల సంఘం ఓటు హక్కును కల్పిస్తూ గౌరవించింది. తెలంగాణతో పాటు ఉత్తర భారత దేశంలో వారు రాజకీయాలపై అడుగులు వేసి సంచలనాలు సృష్టిస్తుండగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అడుగులు పడటం లేదు. రానున్న రోజుల్లో ఎంట్రీ ఇస్తారేమో చూడాలి.

తొలుత మహిళలుగా..ట్రాన్స్‌ జెండర్లుగా..థర్డ్‌ జెండర్‌గా
గతంలో ట్రాన్స్‌ జెండర్‌లకు కూడా ఓటు హక్కు కల్పించాలని గతంలో ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో 1994లో వారికి తొలి సారి ఓటు హక్కు కల్పించారు. అయితే ట్రాన్స్‌ జెండర్లను మహిళలుగానే గుర్తించి ఓటు హక్కు కల్పించారు. 2009లో మహిళలుగా గుర్తించడం అనేది మారింది. సుప్రీం కోర్టు జోక్యంతో మార్పు చోటు చేసుకుంది. థర్డ్‌ జెండర్‌గా గుర్తించింది. ట్రాన్స్‌ జెండర్ల కోసం «థర్డ్‌ జెండర్‌ కాలమ్‌ను ఓటర్ల జాబితాలో ప్రత్యేకంగా ఎన్నికల సంఘం పొందుపరచింది.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో థర్డ్‌ జెండర్‌ ఓటర్లు
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 3482 మంది «థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నారు. ముమ్మిడి వరం, నర్సాపురం అసెంబ్లీ నియోజక వర్గాలు తప్ప దాదాపు అన్ని నియోజక వర్గాల్లో థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా 94 మంది వరకు ఉన్నారు. కాకినాడలో 94, రాజమండ్రిలో 58, భీమవరంలో 50, విజయవాడ సెంట్రల్లో 50, నెల్లూరు సిటీలో 66, కడపలో 88, ప్రొద్దుటూరు 51, పాన్యంలో 75, నంద్యాల్లో 94, డోన్‌లో 69, గుంతకల్‌లో 76, చంద్రగిరిలో 60 చొప్పున అధికంగా ఉన్నారు. అత్యల్పంగా ఒకరు చొప్పున పలు నియోజక వర్గాల్లో ఉన్నారు. సాలూరులో 4, నెలిమర్లలో 3, పాయకరావుపేటలో ఇద్దరు ఉన్నారు. అమలాపురం, రాజోలు వంటి నియోజక వర్గాల్లో ఒక్కొరు చొప్పున ఉన్నారు. 2021లో స్థానిక ఎన్నికల సమయంలో విడుదల చేసిన ఓటర్ల జాబితాలో రాష్ట్ర వ్యాప్తంగా 4,135 మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. 2011 సెన్సెస్‌ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 22759 మంది ట్రాన్స్‌ జెండర్లు ఉన్నారు.
ఎన్నికల ప్రచార కర్తగా ట్రాన్స్‌జెండర్‌ను నియమించిన ఎన్నికల సంఘం
గతేడాది తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఒక ట్రాన్స్‌ జెండర్‌కు ప్రత్యేక అంబాసిడర్‌గా ఎన్నికల కమిషన్‌ నియమించింది. ట్రాన్స్‌ జెండర్‌ లైలాను ఎన్నికల ప్రచార కర్తగా నియమించి చరిత్ర సృష్టించింది. సాధారణంగా సెలబ్రెటీలను, నటీనటులను సామాజిక వేత్తలను ఎన్నికల ప్రచార కర్తలుగా ఎన్నికల కమిషన్‌ నియమిస్తుంటుంది. కానీ తొలి సారి ట్రాన్స్‌ జెండర్‌కు ఆ గౌరవం దక్కింది. తెలంగాణలో సుమారు 50వేలకుపైగా ట్రాన్స్‌ జెండర్లు ఉండగా 2,557 మంది ఓటర్లు ఉన్నారు.
ఎన్నికల రంగంలోకి ట్రాన్స్‌ జెండర్ల ఎంట్రీ
తెలంగాణలో తొలి సారి ట్రాన్స్‌ జెండర్‌ ఎన్నికల పోటీలోకి దిగారు. 2014లో దోమల మేరీ అనే ట్రాన్స్‌ జెండర్‌ ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి చరిత్ర కెక్కారు. 2023లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో బిఎస్పీ ట్రాన్స్‌ జెండర్‌కు అవకాశం కల్పించారు. వరంగల్‌ ఈస్ట్‌ నుంచి పుష్పలత అనే ట్రాన్స్‌ జెండర్‌ పోటీలో నిలబడ్డారు. 2018 ఎన్నికల్లో బహుజన ఫ్రంట్‌ పార్టీ తరఫున గోషామహల్‌ నియోజక వర్గం నుంచి చంద్రముఖి పోటీ చేసి సంచలనం సృష్టించారు.
చట్టసభల్లోకి వెళ్లి పాలకులుగా మారి
గతంలో చట్ట సభల్లోకి కూడా వెళ్లారు. షబ్నం మౌసీ అనే ట్రాన్స్‌జెండర్‌ ఈ రికార్డును సృషించారు. మధ్యప్రదేశ్‌లో జరిగింది. 2000లో జరిగిన ఎన్నికల్లో సోహగ్‌పూర్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 17,800 ఓట్ల మెజారిటీతో గెలుపొంది చరిత్ర సృషించారు. ఆ తర్వాత ట్రాన్స్‌ జెండర్లు ఎన్నికల్లో పాల్గొనడం మొదలైంది. 2015లో మధు కిన్నార్‌ అనే ట్రాన్స్‌ జెండర్‌ చత్తీస్‌ గఢ్‌లోని రాయిగఢ్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఢిల్లీలో కూడా ట్రాన్స్‌ జెండర్లు ఎన్నికల్లోకి దిగారు. గతేడాది జరిగిన ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ నుంచి బాబీ కిన్నార్‌ కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలుపొందారు.
సుప్రీం కోర్టు తీర్పు
గతంలో సుప్రీం కోర్టు ప్రత్యేక తీర్పును వెల్లడించింది. లింగమార్పిడి చేసుకున్న కమ్యునిటీని థర్డ్‌ జెండర్‌గా గుర్తించింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కేఎస్‌ రాధాకృష్ణన్, ఏకే సీక్రీలతో కూడిన ధర్మాసనం 2014లో ఈ తీర్పును వెలువరించారు.


Tags:    

Similar News