ఈ ఎలక్ట్రిక్ బస్సు తిరిగేది తిరుమలలో.. పర్యవేక్షణ చెన్నైలో..
టీటీడీకి రూ. 1.33 కోట్ల బస్సును అందించిన చెన్నై స్విస్ మొబిలిటీ సంస్థ.;
ఈ ఎలక్ట్రిక్ బస్సు తిరిగేది తిరుమలలోనే పర్యవేక్షణ చెన్నై కమాండ్ కంట్రోల్లో ఉంటుంది. ఇందులో అత్యంత అధునాతన సెన్సార్లు వినియోగించారు. ఈ కాలానికి తగిన సాంకేతికతను వినియోగించినట్లు బస్సు తయారీ సంస్థ ప్రతినిధులు వెల్లడించారని టీటీడీ అదనపు ఈఓ సిహెచ్. వెంకయ్య చౌదరి వివరించారు.
తిరుమలలో కాలుష్యరహిత వాహనాలు నడపడానికి టీటీడీ ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది. దీనికి తమ సహకారంగా చెన్నైకి చెందిన చెన్నైకి చెందిన స్విచ్ మొబిలిటీ ఆటోమోటివ్ లిమిటెడ్ సంస్థ తయారు చేసిన 1.33 కోట్ల రూపాయల విలువైన ఎలక్ట్రిక్ బస్సును ఆ సంస్ధ సిఈవో గణేష్ మణి, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వెంకటరమణ్ బుధవారం కానుకగా సమర్పించారు.
ఈ ఎలక్ట్రిక్ బస్సు నడిపే డ్రైవర్ కూడా ఒళ్లంతా కళ్లు చేసుకుని అప్రమత్తంగా లేకుంటే, వెంటనే పసిగట్టే సెన్సార్లు కంట్రోల్ రూంకు వెంటనే సంకేతాలతో వెంటనే రిపోర్ట్ చేసేస్తుంది. ఆ విధంగా దీనిని కంప్యూటరీకరించారు. తిరుమలలో యాత్రికుల ఉచిత రవాణా కోసం ఈ బస్సును వినియోగించనున్నారు.
మామూలు బస్సుల్లో..
ఎలక్ట్రిక్ బస్సులో సాధారంగా కంప్యూటరైజ్డ్ సాంకేతికతను వాడడం సహజం. బస్సు మొత్తం డ్రైవర్ కంట్రోల్ లో ఉంటుందనేది తెలిసిన విషయమే. ప్రయాణంలో బస్సు బయలుదేరగానే డోర్ మూసివేయడం, ఆగగానే తలుపులు తెరవడానికి అవసరమైన లీవర్ స్టీరింగ్ పక్కనే ఉన్న చిన్న పరికరం ఆపరేట్ చేసే వ్యవస్థ డ్రైవర్ కు అందుబాటులో ఉంటుంది. ఆ బస్సు తిరిగే మార్గంలో ఓ స్టాపింగ్ ఎక్కడ వస్తుందనే విషయం డిజిటల్ బోర్డుపై కనిపించడమే కాదు. బస్సులో ప్రయాణికులను కూడా అనౌన్స్ మెంట్ ద్వారా అప్రమత్తం చేస్తుంది. ముందుగానే కిలోమీటర్ల ఆధారంగా కంప్యూటరీకరించిన విషయాలను కంప్యూటర్ వెల్లడిస్తూ ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ బస్సుల్లో ఉన్న సాంకేతిక అంశాలే అనే విషయం తెలిసిందే.
తిరుమల యాత్రికుల కోసం
తిరుమలలో టీటీడీ ప్రస్తుతం 12 బస్సులు నడుపుతోంది. బుధవారం అందించిన బస్సుతో 13కి చేరాయి. శ్రీవారి దర్శనం కోసం వచ్చే యాత్రికుల కోసం 430 ట్రిప్పులు ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్నట్లు టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని 21 బస్టాపుల్లో ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ఇదిలావుంటే..
తిరుమలలో తిరుగుతున్నా..
మిగతా ఎలక్ట్రిక్ బస్సులతో పోలిస్తే, స్విచ్ మొబిలిటీ ఆటోమోటివ్ లిమిటెడ్ తయారు చేసిన బస్సును ఆషామాషీగా తీసుకోవడానికి వీలులేని సాంకేతిక పరిజ్ణానం వాడారని ఆ సంస్థ సీఈవో గణేష్ మణి, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వెంకటరమణ్ చెబుతున్నారు. ఈ చెన్నై బస్సు చాలా ప్రత్యేకమైనదే అని తెలుస్తోంది. ఈ బస్సు తిరుమలలో తిరుగుతున్నా.. దీని వ్యవహారం మొత్తం చెన్నైలోనే పర్యవేక్షణ ఉంటుంది.
ఈ ఎలక్ట్రిక్ బస్సు తయారు చేసిన స్విచ్ మొబిలిటీ ఆటోమోటివ్ లిమిటెడ్ ప్రతినిధులు చెప్పిన వివరాలను టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి మీడియాకు వివరించారు.
"ఈ ఎలక్ట్రిక్ బస్సు తయారులో అత్యంత అధునాతన టెక్నాలజీ వాడారు. బస్సు డ్రైవర్ కూడా చాలా జాగ్రత్తలతో నడపాల్సి ఉంటుంది. లేదంటే క్షణాల్లో బస్సులోని సెన్సార్లు పసిగడతాయి" అని అదనపు ఈఓ వెంకయ్య చౌదరి చెప్పారు. ఈ బస్సులోని ప్రత్యేకతలను ఆయన వివరించారు.
"ఈ బస్సు మిగతా వాటికి చాలా భిన్నంగా గంటలోనే చార్జింగ్ అవుతుంది. ఈ బస్సు తిరుమలలో తిరుగుతున్నా, కమాండ్ కంట్రోల్ చెన్నైలో ఉంటుంది. నిత్యం అక్కడి నుంచి ట్రాకింగ్ చేస్తుంటారు" అని అదనపు ఈఓ వెంకయ్య చౌదరి వివరించారు.
ప్రధానంగా బస్సు కండిషన్, ఎలా నడుస్తోంది. లోపాలు తెలెత్తగానే అప్రమత్తం చేసే వ్యవస్థ చెన్నైకేంద్రంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ బస్సులో ఫైర్ ప్రొటెక్షన్ ను కూడా ఏర్పాటు చేశారు. వేడి లేదా అనుకోని విధంగా మంటలు చెలరేగినా ఆటోమేటిక్ గా బస్సులోని సెన్సార్లు యాక్టివేట్ కావడం ద్వారా యాత్రికులను ప్రమాదం నుంచి కాపాడతాయని వెంకయ్య చౌదరి వివరించారు. అంతకుముందు
చెన్నై నుంచి తిరుమలకు తీసుకుని వచ్చిన ఈ బస్సుకు శ్రీవారి ఆలయం సమీపంలోని మాడవీధిలో బుధవారం పూజలు నిర్వహించారు. అనంతరం చెన్నైకి చెందిన స్విచ్ మొబిలిటీ ఆటోమోటివ్ లిమిటెడ్ సిఈవో గణేష్ మణి, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వెంకటరమణ్ విద్యుత్ బస్సు తాళాలు టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరికి అందజేశారు. బస్సులోని ప్రత్యేకతలు అదనపు ఈఓకు స్విచ్ మొబిలిటీ ఆటోమోటివ్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు క్షుణ్ణంగా వివరించారు.
తిరుమలలో యాత్రికులు ప్రమాదరహిత ప్రయాణం చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని టీటీడీ అధికారులు చెప్పారు. తిరుమలలో టీటీడీ ఉచిత బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు ఈఓ వెంకయ్య చౌదరి సూచించారు.