ప్రశ్నిస్తే జనసేన నుంచి గెంటివేస్తారా?
కార్యకర్తల మనోవేదన, తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్న;
By : The Federal
Update: 2025-07-12 12:53 GMT
జనసేన పార్టీలో ఏమి జరుగుతోంది? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇదే. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ప్రధాన రాజకీయ పక్షం జనసేన. ఇప్పుడీ పార్టీలో అసమ్మతి, అసంతృప్తి రాజుకున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలలో అసమ్మతి సహజమే అయినా బహిరంగంగా బజార్లకెక్కడం ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో అవకాశం దక్కకుండా చూడాలన్న సంకల్పంతో ఉన్నారు. ఈ లక్ష్యానికి అడుగడుగునా అవరోధాలు ఎదురవుతున్నా, ఆయన వాటిని తొలగించేందుకు కఠిన చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.
కూటమి సజావుగా కొనసాగాలంటే క్రమశిక్షణ తప్పనిసరి. టిడిపి – జనసేన – బీజేపీ మూడు పార్టీలు కలిసి రాష్ట్ర పరిపాలన చేస్తుండటంతో, మూడు పార్టీల నాయకత్వాల్లో సమన్వయం అత్యంత అవసరం. కానీ కొన్ని జిల్లాల్లో కింది స్థాయిలో అసంతృప్తులు, భిన్న స్వరాలు వినిపించడం మొదలైంది. ముఖ్యంగా వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన కొంతమంది నేతలు కూటమికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు రావడం, పార్టీ శ్రేణుల్లో కలవరం రేపుతోంది.
ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తక్షణమే వ్యవహార శైలిని మార్చి, పాత సంబంధాలకు బదులు పార్టీ క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తారు అనే సంకేతాలను పంపిస్తున్నారు.
నాయకత్వ తీరు ఇలా ఉంటే జనసేన పార్టీ కార్యకర్తల నుంచి పై స్థాయి నాయకుల వరకు అసంతృప్తి ఉంది అనేది వివిధ జిల్లాలలో జరుగుతున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా కోవూరు నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జీ, మాజీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ టీవీ రామారావుపై వేటు పడింది. పార్టీ అగ్రనాయకత్వం ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించింది.
కొవ్వూరు నియోజకవర్గం పరిధిలో సహకార సొసైటీల నియామకాల్లో అన్యాయం జరిగిందని టీవీ రామారావు ఇటీవల ఆందోళన నిర్వహించారు. పొత్తు ధర్మాన్ని టీడీపీ పాటించడం లేదని ఆరోపించారు. మొత్తం 13 డైరెక్టర్ల పదవుల్లో మూడు ఇమ్మని జనసేన కోరితే ఒకటే ఇచ్చారని, ఇది అన్యాయం అని ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి ఆందోళన చేశారు. ఈ ఆందోళనను జనసేన అగ్రనాయకత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఆయనపై క్రమశిక్షణ చర్యల కింద వేటు వేసింది.
రామారావు 2009 ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత ఎన్నికలకు దూరం అయ్యారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ లభించలేదు. దీంతో ఆయన వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆ తర్వాత 2023లో జనసేన పార్టీలో చేరారు. 2024లో కూడా ఆయనకు నిరాశే ఎదురైంది. పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని టీడీపీ దక్కించుకుంది. నాటి ఎన్నికల్లో ముప్పిడి వెంకటేశ్వరరావు విజయం సాధించారు. ఇప్పుడు సస్పెండ్ అయ్యారు.
ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి.
పైనుంచి కింది స్థాయి నాయకుల వరకు అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ వాళ్ళందరి తరపున ఎవరైనా ఒక వ్యక్తి మాట్లాడితే చెడు అవుతున్నాడు లేదా సస్పెండ్ అవుతున్నాడు. సస్పెండ్ అయిన వ్యక్తికి నాలుగు రోజులు సానుభూతి పోస్ట్ లు పెట్టడం తరువాత మామూలే అవుతోంది.
సరిగ్గా ఈ దశలోనే శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్ చార్జీ కోట వినూత దంపతులను కూడా పార్టీ నుంచి బహిష్కరించారు. ఇప్పుడీ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వినూత దంపతులు ఓ హత్య కేసులో ఇరుక్కోవడంలో పార్టీ వేటు వేసింది. ఇది సమంజసమే అయినా రామారావు లాంటి వాళ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, అసమ్మతి గళం విప్పిన వారిని పార్టీ కార్యాలయానికి దూరంగా ఉంచడం, కార్యకర్తల్లో అసంతృప్తిని, అసమ్మతిని పట్టించుకునే నాధుడు లేకపోవడం జనసేన కిందిస్థాయి శ్రేణుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోందనే నిజం.
పార్టీ లైన్ ను దాటినందుకు వేటు వేస్తున్న క్రమశిక్షణ చర్యల విభాగం బాధ్యుణ్ణి అందరూ తిడుతున్నారు గాని అసలు నిర్ణయం తీసుకున్న వారిని ఎవరేమీ అనలేకపోతున్నారు. నిజానికి క్రమశిక్షణా విభాగం బాధ్యుణ్ణి తిట్టడం, వివర్శించడం వంటివి చేస్తున్నారు. అసలు నాదెండ్ల మనోహర్ అయినా, నాగబాబు అయినా పార్టీలో ఏ ఇతర వ్యక్తులు అయినా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలియకుండా.. ఆయనకు చెప్పకుండా సొంతంగా నిర్ణయాలు తీసేసుకోగలరా? అంత ధైర్యం ఉందా అనేది అసలు ప్రశ్న. ఆ సాహసం ఎవ్వరూ చేయలేరు.
ప్రాంతీయ పార్టీల అధినేతల్ని ఎవరైనా ఏమైనా అంటే వాళ్లు ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లడానికి సిద్ధపడే చేయాలి. అందరిపైన కత్తి వేలాడుతూనే ఉంటుంది. సస్పెండ్ అయిపోతామనే భయం ఉంటుంది.
నిజంగా జనసేన పార్టీలో తప్పు జరుగుతుందా? కూటమిలో న్యాయం జరగడం లేదా? జనసేన పార్టీ దెబ్బతింటుందా? జనసేన శ్రేణులకు విలువ లేదా? ఇవన్నీ నిజాలే. మరి ఎవరు ప్రశ్నించాలి? ఎవర్ని ప్రశ్నించాలి?
ఒక సందర్భంలో పవన్ కల్యాణే చెప్పినట్టు... నేను తీసుకునే నిర్ణయాలకు పార్టీ నాయకుడు హరిప్రసాద్ నిందలు మోస్తుంటాడు. అందువల్ల పార్టీ అధినేతకు అన్ని విషయాలు తెలుసు. అయితే ఆయన్ను ఎవరూ విమర్శించలేరు.
ఒకవేళ పవన్ కల్యాణ్ కి తెలియకుండానే సస్పెన్షన్లు, బహిష్కరణలు జరుగుతున్నాయని మాట వరసకు అనుకున్నా వాటిని అందరూ కలిసి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లాలి కదా. ఆ ప్రయత్నం ఎందుకు జరగడం లేదు?. అసలు ఆ అవకాశం కిందిస్థాయి కార్యకర్తలకు లేదు. ఎవరైనా ధైర్యం చేసినా సస్పెండ్ అయిపోతారని భయమూ వెంటాడుతోంది. చేస్తే ఎంతమందిని చేస్తారనుకున్నా పిల్లి మెడలో గంట గట్టేదెవరు అనేది ఇక్కడ కీలకం.
పార్టీపరంగా టీవీ రామారావు వైఖరి కూటమికి చేటు చేస్తుందన్న అభిప్రాయంతో, జనసేన ఆయనపై వేటు వేసి క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వేటు తప్పదనే సంకేతం ఇచ్చినా పార్టీ నాయకత్వం ఇప్పటికైనా కిందిస్థాయి కార్యకర్తల అసంతృప్తులు, అసమ్మతులను పట్టించుకునేందుకు ఓ పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని మాత్రం సూచిస్తోంది. అంతేగాని “నచ్చినవారు పార్టీలో ఉండండి, నచ్చని వారు వెళ్లిపోవచ్చు” అని అనడం ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు తగదనే చెప్పాలి.