Tirumala | 9 నుంచి పుష్కరిణిలో తిరుమల శ్రీవారి విహారం

తిరుమల తెప్పోత్సవాలకు సిద్ధం అవుతోంది. ఆ రోజు నుంచి ఆర్జిత సేవలు రద్దు చేశారు.;

Byline :  The Federal
Update: 2025-03-03 02:58 GMT

శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో పెద్ద పండుగ. ఏడాదికి ఒకసారి తిరుమలలో ఐదు రోజులపాటు నిర్వహించే తెప్పోత్సవాలకు అంతటిప్రాధాన్యత, చరిత్ర ఉంది. దీంతో ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి ఆర్జిత సేవలు రద్దు చేశారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి యాత్రికులు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. అదేవిధంగా రోజూ వారి సేవల్లో పల్లకీపై ఉభయ నాంచారులతో కలిసి మలయప్పస్వామి వారు విహరిస్తూ, దర్శనం ఇస్తుంటారు. ఇవన్నీ ఒకఎత్తు.
తిరుమల శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించే తెప్పోత్సవాలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మార్చి తొమ్మిదో తేదీ నుంచి 13వ తేదీ వరకు ఐదు రోజుల పాటు సాయంత్రం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నిర్వహించే ఈ ఉత్సవాలకు కూడా యాత్రికులు విశేషంగా హాజరవుతారు. ఏడాదికి ఒకసారి నిర్వహించే ఈ ఉత్సవాలు కనువిందు చేస్తాయి.
తిరుమల శ్రీవారి పుష్కరిణిలో ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలు ఎలా సాగుతాయంటే..
తెప్పోత్సవాల్లో తొలిరోజు మార్చి 9న శ్రీసీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు.
మార్చి 10న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పలపై మూడుసార్లు విహరిస్తారు.
మార్చి 11న శ్రీదేవీ, భూదేవి సమేతంగా మలయప్పస్వామి మూడుసార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. 12న ఐదు చుట్లు,
13వ తేదీ ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ కనువిందుగా సాగుతాయి. దేదీప్యమానంగా వెలిగే ఫ్లడ్ లైట్ల వెలుగులో సాగే ఈ తెప్పోత్సవాల నిర్వహిణకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
ఆర్జిత సేవలు రద్దు
తిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాల కారణంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేసింది. అందులో భాగంగా మార్చి 9 నుంచి రెండు రోజులపాటు సహస్ర దీపాలంకార సేవ ఉండదు. మార్చి 11, 12, 13వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఆర్జీత సేవలకు సంబంధించి ఆ తేదీలకు ముందు సిఫారసు లేఖలు, సేవా టికెట్లను కూడా జారీ చేయరు.
ఈ ఉత్సవాలు ఎప్పటి నుంచి...
తిరుమలలో 1468లో సాళువ నరసింహరాయలు శ్రీవారి పుష్కరిణి మధ్యలో ‘నీరాళి మండపాన్ని’ నిర్మించారు. తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దాడు. 5వ శతాబ్దానికి చెందిన తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను ఘనతను కీర్తించారని చరిత్ర చెబుతోంది.
తిరుమల శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవం ఏటా ఐదురోజుల పాటు జరుగుతుంది. చైత్ర మాసంలో ఫాల్గుణ పౌర్ణమి నాడు ఈ ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తారు. పౌర్ణమి రావడానికి ముందే ఈ ఉత్సవాలు ప్రారంభించి, పౌర్ణమినాడు పండు వెన్నెలలో తెప్పలపై స్వామివారి ఉత్సవ విగ్రహాలను పుష్కరిణిలో విహరింప చేసే ఉత్సవం కనువిందు చేస్తుంది.
ఎలా నిర్వహిస్తారంటే..
శ్రీవారి పుష్కరిణిలో వార్షిక తెప్పోత్సవం ప్రారంభంలో ఈ నెల తొమ్మిదో తేదీ సాయంత్రం ఆలయానికి ఉత్తర దిక్కులో ఉన్న పుష్కరిణి వద్దకు అందంగా అలంకరించిన విగ్రహాలను తీసుకుని వస్తారు. తెప్పలపై పుష్కరణి మధ్యలో ఉన్న మండపంలో ఉభయ దేవేరులతో పాటు మలయప్పస్వామి విగ్రహాలను ఆశీనులను చేసి, పూజలు నిర్వహిస్తారు.
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగాపుష్కరిణి వద్దకు వేంపు చేస్తారు. అనంతరం అందంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆశీనులై పుష్కరిణిలో మూడు చుట్లు విహరిస్తారు.
తిరుమలలో ఏడాదికి ఒకసారి నిర్వహించే ఈ ఉత్సవాలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందుకు తగిన విధంగా పుష్పాలంకరణతో పాటు అదనంగా విద్యుద్దీపాల అలంకరణ కూడా చేయనున్నారు.

Similar News