TTD budget | తిరుమల:ఈ ఏడాది టీటీడీ బడ్జెట్ ఎంతో తెలుసా.?
బడ్జెట్ ఆమోదానికి టీటీడీ బోర్డు సమావేశం తిరుమలలో ప్రారంభం అవుతుంది. శ్రీవాణి ట్రస్టు నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.;
ఆలయాల నిర్మాణ శ్రీవాణి ట్రస్టు పరిస్థితి ఏమిటి? మరో ట్రస్టు ఏర్పాటు చేస్తారా?
తిరుమల తిరుపతి దేవస్థానాలు Tirumala Tirupati Devasthanams (TTD) నిర్వహణ, కలాపాలు చిన్న రాష్ట్రానికి సమానంగా ఉంటుంది. 2025 -26 వ వార్షిక బడ్జెట్ కు సోమవారం ఉదయం పది గంటలకు (ఇంకొద్ది సేపట్లో) తిరుమల అన్నమయ్య భవన్ లో జరిగే టీటీడీ పాలకమండలి (TTD Trust Board ) సమావేశంలో ఆమోదించనున్నారు. టీటీడీ చైర్మన్ ( TTD Chairman ) బీఆర్. నాయుడు అధ్యక్షతన జరిగే బోర్డు మీటింటులో శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు ఏర్పాటుతో పాటు, ప్రైవేటు బ్యాంకుల్లోని డిపాజిట్లు జాతీయ బ్యాంకులకు తరలించడం, వేసవి సెలవుల్లో (Summer vacation ) యాత్రికుల రద్దీ క్రమబద్ధీకరణ, సదుపాయాల కల్పనపై చర్చించనున్నారు.
చిన్న రాష్ట్రం..
ఇక్కడ ధార్మిక కార్యక్రమాల తోపాటు హిందూ ధర్మప్రచార పరిషత్ (Hindu Dharma Prachar Parishad HDPP ), ఢిల్లీతో పాటు తిరుపతిలో ప్రాథమిక విద్య నుంచి ఎస్వీ విశ్వవిద్యాలయం, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీ పాటు 11 విద్య సంస్థలను నిర్వహిస్తోంది. మూడు ప్రధాన ఆస్పత్రులు కూడా టీటీడీ పరిధిలో ఉన్నాయి. ఇవి కాకుండా, ఇంజినీరింగ్, విద్యార్థుల సంక్షేమం, నీటిపారుదల, రవాణా, మార్కెటింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఐటీ, అటవీశాఖ, గార్డెనింగ్ విభాగం, విద్య సంస్థలు, ఆస్పత్రులు, రెవెన్యూ, సాధారణ పరిపాలన శాఖ వంటి అనేక విభాగాలు కూడా ఉన్నాయి.
వాటన్నింటి నిర్వహణకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులకు అనుమతి ఇవ్వడానికి టీటీడీ పాలక మండలి సమావేశం చైర్మన్ బీఆర్. నాయుడు అధ్యక్షతన సోమవారం ఉదయం పది గంటలకు తిరుమల అన్నమయ్య భవన్ లో ప్రారంభం కానుంది.
2025 -26 వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.5,400 కోట్ల తో బడ్జెట్ పై చర్చించి, ఆమోదించనున్నది. గత ఏడాదితో పోలిస్తే, ఈసారి బడ్జెట్ అంచనాలు రూ.349 కోట్ల రూపాయల పెరుగుదల కనిపిస్తోంది.
ఈ పాలక మండలి భేటీలో వార్షిక బడ్జెట్ తోపాటు అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా పాలక మండలి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశంలో 30 అంశాలకు పైగానే అజెండాలో చేర్చారు. అందులో ముడిసరుకుల కొనుగోలు, ఇంజినీరింగ్ పనులతో పాటు విద్య, ఆస్పత్రుల నిర్వహణకు సంబంధించి కూడా బడ్జెట్ లో నిధుల కేటాయించడానికి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
కొత్త ట్రస్టుపై నిర్ణయం
టీటీడీలో ఇప్పటికే అనేక ట్రస్టులు నిర్వహిస్తున్నారు. అందులో 13 డొనేషన్ పథకాలు, ట్రస్టులు ఉన్నాయి. వీటికి అదనంగా మరో ట్రస్టు జతయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం దాతల నుంచి విరాళాలు స్వీకరించడం ద్వారా నిర్వహిస్తున్న ట్రస్టుల్లో ప్రధానమైనవి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు, శ్రీ బాలాజీ ఆరోగ్య ప్రసాదిని స్కీం (ప్రాణదానం) (Sri Balaji Health Prasadini Scheme), విద్యాదానం, వృక్ష సంరక్షణ, గోసంరక్షణ, వేద పరిరక్షణ, శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ (Sri Venkateswara Bhakti Channel SVBC) వంటి మీడియా సంస్థతో పాటు, శ్రీవెంకటేశ్వర ఇన్సిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ (Sri Venkateswara Institute of Medical Sciences SWIMS) ద్వారా రోగులకు కార్పొరేట్ వైద్య సేవలు అందించడంలో టీటీడీ కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది. ఈ ట్రస్టుల ద్వారా వస్తున్న విరాళాలను జాతీయ బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేయడం ద్వారా వస్తున్న వడ్డీతో ఆ కార్యక్రమాలను నిరాటంకంగా సాగిస్తోంది.
అన్ని రాష్ట్రాల్లో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాలను నిర్మించాల్సిన అవసరాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఆయన ఆదేశాల మేరకు టీటీడీ ద్వారా ఈ కార్యక్రమాలు చేపట్టనున్నారు. దీనికోసం ఆలయాల నిర్మాణ ట్రస్టు ఏర్పాటుకు తిరుమలలో సోమవారం ఉదయం జరిగే పాలక మండలిలో తీర్మానించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం రాజకీయంగా కూడా దుమారం చెలరేగే అవకాశం ఉంది.
శ్రీవాణి ట్రస్టు పరిస్థితి ఏమిటి
దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార కాలనీల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి గతంలోనే శ్రీవెంకటేశ్వర ఆలయాల నిర్మాణం ట్రస్టు (Sri Venkateswara Temple Construction Trust Srivani) ఇప్పటికే మనుగడలో ఉంది. రూ.10,500 యాత్రికుల నుంచి వసూలు చేయడం ద్వారా రూ. పది వేలు శ్రీవాణి ట్రస్టుకు జమ చేయడం, మిగతా రూ.500 కు శ్రీవారి దర్శనానికి వీఐపీ టికెట్ జారీ చేశారు. దీని ద్వారా దాదాపు 1,500 కోట్ల రూపాయలు నిధులు ఈ ట్రస్టులో ఉన్నాయి. 2019 -24 కాలంలో వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోనే కాకుండా, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరిలో కూడా ఆలయాల నిర్మాణం చేశారు. ఇంకా కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రధానంగా
ఆలయాల నిర్మాణానికి శ్రీవాణి ట్రస్టుల ఉండగా.. మళ్లీ ప్రత్యేక ట్రస్టు ఎందుకనే ప్రశ్న తలెత్తింది. దీని ద్వారా శ్రీవాణి ట్రస్టును ఏమి చేస్తారనేది కూడా టీటీడీ స్పష్టత ఇవ్వలేని పరిస్థితి
పెరిగిన బడ్జెట్ అంచనాలు
టీటీడీ బడ్జెట్ అంచనాలు ఏడాదికి ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. తిరుమలకు వస్తున్న యాత్రికుల ద్వారా ఆదాయం కూడా పెరుగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో యాత్రికులకు సదుపాయాలు, కార్యక్రమాలను పెంచుతున్న నేపథ్యంలో బడ్జెట్ అంచనాలు పెంచుతున్నారు. 2024 -25 ఆర్ధిక సంవత్సరానికి రూ.5,400 కోట్ల తో అంచనాలు సిద్ధం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో 2023- 24 లో వైవీ సుబ్బారెడ్డి సారధ్యంలోని పాలక మండలి 4,411.68 రూపాయలతో బడ్జెట్ ఆమోదించింది. 2024 -25 భూమన కరుణాకరరెడ్డి సారధ్యంలోని పాలక మండలిలో 5141.74 కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఆ అంచనాలు మరింత పెరిగినట్టే కనిపిస్తోంది.