Annamayya | మెట్లోత్సవంలో అన్నమయ్య కీర్తనలతో పులకించిన తిరుమల కొండలు

కళాకారుల కీర్తనలు, ప్రదర్శనలు తిరుమల నడకమార్గంలో కనువిందు చేశాయి. అన్నమాచార్యులవారి వర్ధంతిని ఇలా జరుపుకున్నారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-03-25 09:55 GMT

అలిపిరి మెట్లు (Alipiri Steps) పులకించాయి. తిరుమల(Tirumala) గిరులు కీర్తనలతో ప్రతిధ్వనించాయి. మెట్లలపై మువ్వల సవ్వడి. కాళ్లకు కట్టిన గజ్జలతో భజనమండళ్ల కళాకారుల నృత్యాలు. అన్నమయ్య కీర్తనలు ఆలపించే భక్తులు. నడక మార్గంలో సాంప్రదాయ కళాప్రదర్శనలు. తాళ్లపాక అన్నచార్యులవారి వర్ధంతి సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం తిరుమల గిరులు కళా ప్రదర్శనలతో అలరించాయి.


టీటీడీ అన్న‌మాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీమాన్ తాళ్లపాకపాక అన్న‌మాచార్యుల (Taallapaka Annamaachaarya ) 522వ వ‌ర్థంతి మ‌హోత్స‌వంలో భాగంగా అలిపిరి పాదాల మండపం మెట్లోత్సవం వైభవంగా జరిగింది.

తిరుమల నడక మార్గంలో సాగిన ఈ శోభా యాత్ర పచ్చటి చెట్లు కూడా చల్లటి గాలిని అందిస్తూ, ఆస్వాదించాయి. అలిపిరి నుంచి తిరుమల వరకు సాగిన ఈ కళా ప్రదర్శనతో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సేవలో యాత్రికులు తరంచిన కార్యక్రమం మధ్యాహ్నం కనువిందుగా సాగింది. తిరుమలకు వెళుతున్న యాత్రికులు కూడా ఈ కళా ప్రదర్శనలతో సేదదీరారు. అలసట కూడా మరిచారు. కళాకారులతో కలిసి పదం పాడుతూ, కదం కలుపుతూ, తన్మయత్వానికి లోనయ్యారు.

తిరుమల మెట్లోత్సవం సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం ఈ కార్యక్రమం కనువిందుగా సాగింది. అలిపిరి పాదాల మండపం నుంచి ప్రారంభమయ్యే మెట్ల వద్ద శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహాలను ఆశీనులను చేశారు. పూజకార్యక్రమాలు నిర్వహించారు. అన్నమాచార్య వంశస్తుడు తాళ్లపాక హరి నారాయణాచార్యులు స్వామివారి విగ్రహాలకు ప్రత్యేక పూజలు అందించి, అన్నమయ్య కీర్తనలతో స్తుతించారు.
కనువిందుగా యాత్ర

అలిపిరి మెట్ల వద్ద పూజలు చేసే సమయంలో కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆయనతో పాటు ఇంకొందరు కూడా అన్నమయ్య ప్రతిమలను ఎత్తుకుని శ్రీవారిని కీర్తిస్తూ, తిరుమలకు పాదయాత్ర సాగించారు. రాజగోపురం నుంచి మెట్టమీదుగా సాగిన యాత్రలో చదునైన ప్రదేశం వద్ద కళాకారులు ఆలపించిన కీర్తనలు, ప్రదర్శనలు శ్రీవారిని అన్నచార్యుడు స్తుతించిన ఘట్టాలను ఆవిష్కరించారు.
మెట్లోత్సవంలో పుణ్యఫలం

అంతకుముందు అలిపిరి పాదాల మండపం వద్ద స్వామి విగ్రహాలకు పూజల అనంతరం అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు రాజ‌గోపాల‌రావు మాట్లాడారు. పూర్వం కాలం నుంచి ఎందరో మహనీయులు మెట్లమార్గంలో తిరుమలకు నడిచివెళ్లిన చరిత్రను వివరించారు. వసతి, సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్న రోజుల్లో అడవిలో నడకతో వెళ్లిన యాత్రికులు, స్వామివారిని కీర్తించిన ఘట్టాలను వివరించారు. ఇలాంటి మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలం అని ఆయన అన్నారు. అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తి ప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహింారన్నారు. శ్రీవారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టీటీడీ మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.
కార్యక్రమంలో టీటీడీ (TTD) దాస సాహిత్య ప్రాజెక్టు (Dasa Sahitya Project ) ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు, అన్న‌మాచార్య ప్రాజెక్టు (Annamaacharya Project ) క‌ళాకారులు, దాదాపు 700 మందికిపైగా భజన మండళ్ల సభ్యులు భజనలు చేసుకుంటూ తిరుమలకు చేరుకున్నారు.

Similar News