TIRUMALA | తిరుమల : నిషిద్ధ గగనతలం ఎందుకు కావడం లేదు?

శ్రీవారి ఆలయంపై విమానం ఎగరడం. టీటీడీ ఆందోళన వ్యక్తం చేయడం. కేంద్రానికి లేఖ రాసినా స్పందన ఎందుకు ఉండడం లేదు?;

Byline :  The Federal
Update: 2025-03-02 09:21 GMT

తిరుమలను నిషిద్ధ గగనతలంగా ప్రకటించండని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు కేంద్ర విమానయాన శాఖకు లేఖ రాశారు. దాదాపు 20 ఏళ్లుగా ఇది సర్వసాధారణంగా మారింది. కోట్లాది మంది భక్తుల అభిప్రాయలతో ముడివడి ఉన్న ఈ అంశంపై హిందూత్వాన్ని అరాధించే బీజేపీ ప్రభుత్వం కూడా ఎందుకు ఈ నిర్ణయం తీసుకోలేకపోతోంది. దీనికి రెండు కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అందువల్లే టీటీడీ నుంచి లేఖలు వెళ్లినా, యాత్రికులు ఆందోళన వ్యక్తం చేసినా ఫలితం లేకపోవడానికి కారణమని అంటున్నారు.

తిరుమలకు సమీపంలో రెండు రోజుల కిందట ఓ విమానం చక్కర్లు కొట్టింది.
మళ్లీ అలజడి ప్రారంభం కావడం. దీనిపై టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు మరోసారి లేఖ రాశారు
"తిరుమలను నో ఫ్లైజోన్ ప్రకటించండి" అని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడుకు రాసిన లేఖలో అభ్యర్థించారు. తరచూ తిరుమల ఆధ్మాత్మిక క్షేత్రం గగనతలంపై నుంచి విమానాలు ప్రయాణించడం వల్ల యాత్రికుల మనోభావాలు దెబ్బతింటున్నాయని బీఆర్. నాయుడు తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమల పైనుంచే కాదు. ఏడుకొండలకు సమీపంలో విమానాలు ప్రయాణించడం ఆగమశాస్త్రాన్ని అవమానించడం తోపాటు పవిత్రతకు కూడా భంగం కలుగుతోందని విషయాన్ని సూటిగా ప్రస్తావించారు.
టీటీడీ నుంచి ఇలా లేఖలు రాయడం ఇది మొదటిది కాదు. చివరిది అంతకన్నా కాదు. తిరుమలకు సమీపంలో విమానాలు, హెలికాప్టర్లు ప్రయాణించిన ప్రతి సందర్భంలోనూ ప్రసారం అవుతున్న వార్తలు, కథనాలు 2009 నుంచి సర్వసాధారణంగా మారాయి.
" తిరుమల కొండపై తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లు, ఇతర వైమానిక కార్యాకలాపాలతో శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న పవిత్రమైన వాతావరణానికి భంగం కలుగుతోంది" అని కూడా టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు తన లేఖలో ప్రస్తావించారు. తిరుమల పవిత్రత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడటానికి తిరుమల క్షేత్ర గంగనతలాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించడం ద్వారా ముందడుగు వేయాలని ఆయన కోరారు.
అంతా భక్తులే కదా...
రాష్ట్రంలో టీడీపీ ఎంపీలు కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆ పార్టీ ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదిలావుంటే, 2014లో కూడా బీజేపీతో కలిసి టీడీపీ రాష్ట్రంలో అధికారం పంచుకోవడమే కాదు. కేంద్రంలో కూడా కీలకపాత్ర పోషించింది. ఈ రెండు పార్టీల ప్రతినిధులు ప్రభుత్వంలో కీలకభాగస్వామ్యులుగా ఉన్నా, తిరుమల గగనతలంపై విమానాలు చక్కర్లు, కొట్టడం, సమీపం నుంచి ప్రయాణించకుండా నియంత్రించే నిర్ణయం అమలు చేయడంలో మాత్రం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విషయం అర్థం అవుతుంది.
ఈ నిర్ణయం తీసుకోవడం, అమలు చేయడంలో జరుగుతున్న తాత్సారం వెనుక కారణాలు కూడా లేకపోలేదు.
నియంత్రణ సాధ్యం కాదా?
తిరుమల గిరులకు సమీపంలో విమానాల ప్రయాణించడం నియంత్రించడానికి ఆస్కారం ఉన్నప్పటికీ, ప్రైవేటు విమానయాన సంస్థల సొంత వ్యాపారం, ప్రయాణికులను ఆకట్టుకోడానికి కొండల సమీపం నుంచి రాకపోకలు సాగిస్తుంటారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి కేంద్ర విమానయాన సంస్థ ఆజమాయిషీ లేకపోవడమే అనే అభిప్రాయం ఓ అధికారి వ్యక్తం చేశారు. ఫ్లైయింగ్ అనుమతి తీసుకున్న తరువాత, టికెట్ల ధరల నుంచి అన్నీ ఆ సంస్థల నిర్ఱయాలు తీసుకునేందుకు అవకాశం కల్పించడం వల్లే ఈ పరిస్థితికి కారణం అనేది ఆ అధికారి చెప్పడమే కాదు. పార్లమెంటులో మంత్రి కింజరాపు రామ్మోహననాయుడు ఇచ్చిన సమాధానం కూడా ఆ విషయం స్పష్టం చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏంటా కారణాలు...
విమానయాన శాఖా మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పార్లమెంటులో ఇచ్చిన సమాధానం ఓసారి పరిశీలిద్దాం.. "టికెట్ల ధర పెంపుదల విషయం"పై ఆయన ఏమన్నారంటే... "ప్రైవేటు విమానయాన సంస్థలకు రూట్ అనుమతి ఇచ్చినా, టికెట్ల ధర పెంపుదల తమ పరిధిలో ఉండదు" అనేది ఆయన చెప్పిన మాట. చివరికి రూట్ కూడా ఏటీసీ (AIR Traffic control) నియంత్రణలో ఉంటుంది. విమానయాన శాఖ ఈ విషయంలో ఆలోచన చేసే నిర్ణయం తీసుకుంటుందనేది ఆ శాఖ అధికారులు చెబుతున్న మాట. అందులో ప్రధానంగా...
ఎందుకు ఇలా జరుగుతోంది..
ప్రతిసారి తిరుమల గగనతలంపై విమానాలు ప్రయాణించడం. ఆందోళనకు ఆస్కారం కలిగిస్తోంది. తిరుమలకు సమీపంలోనే రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం (తిరుపతి విమానాశ్రయం) ఉంది. తిరుమల నుంచి రేణిగుంటకు గగనతలంలో రేఖాంశాల పరంగా చూస్తే, 10.17 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 6.32 నిమిషాల ప్రయాణానికి దగ్గరగా ఉంటుంది. టేకాఫ్ తరువాత ఓ రౌండ్ వేసి, నియంత్రణలో రేఖలోకి రావడానికి 13.32 కిలోమీటర్ల దూరం తీసుకుంటుంది.
దీనికి 8.28 నిమిషాల సమయం పడుతుందనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (INDIAN Air Force) లో ఉద్యోగ విరమణ చేసిన ఓ పైలెట్ చెప్పిన సమాచారం. రేణిగుంట విమానాశ్రయం నుంచి 259.97 డిగ్రీల రౌండ్ ల కంపాస్ చూపించే దిళశగా టేకాఫ్, ఆ తరువాత టర్న్ తీసుకునేందుకు ఆ సమయం పడుతుందని స్థానిక విమానాశ్రయ అధికారుల మాట. దీంతో
హైదరాబాద్, బెంగళూరు లేదా చెన్నై నుంచి వచ్చే విమానాలు ల్యాండింగ్ చేయాలంటే ఇది అనివార్యంగా మారుతోంది. విమానంలోని ప్రయాణికుల భద్రత, సాంకేతిక అంశాలు అన్నింటిని పరిగణలోకి తీసుకున్న తరువాతే టేకాఫ్, ల్యాండింగ్, టేకాఫ్ కు అనుమతి ఇస్తుంటారని చెబుతున్నారు.
రానున్న కాలంలో ఇది ఇంకా తీవ్రమయ్యే వాతావరణం లేకపోలేదు. రేణిగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాదాణాలకు ధీటుగా సాంకేతిక వసతులు కల్పించారు. ఈ ఏడాది జనవరిలో రేణిగుంట విమానాశ్రయం నుంచి మలేషియాకు అంతర్జాతీయ సర్వీస్ ట్రయల్ రన్ నిర్వహించారు. పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమానాలు రాకపోకలు ప్రారంభమైతే, ఈ సన్నిత అంశంపై మరింత ఆందోళనకు దారితీసేందుకు ఆస్కారం ఉంది.
తిరుమలను నిషిద్ధ గగనతలంతా మార్పించడానికి కేంద్ర ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ, జనసేన ప్రజాప్రతినిధులు ఏమేరకు చొరవ తీసుకుంటారనేది వేచిచూడాల్సిందే.


Similar News