తిరుపతి: గంగ జాతర చూసొద్దామా..

తాతయ్యగుంట గంగమ్మకు ఒడిబాలతో జాతరకు అంకురార్పణ చేశారు. మంగళవారం రాత్రి చాటింపుతో ప్రారంభం అవుతుంది.;

Byline :  The Federal
Update: 2025-05-07 09:46 GMT

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చెల్లెలిగా భావించే తాతయ్యగుంట గంగమ్మ జాతర మంగళవారం రాత్రి లాంచనంగా ప్రారంభం కానుంది. దీనికంటే ముందు ఉదయం ఏడు గంటలకు గంగమ్మ ఆలయ ప్రాంగణంలోని కొడి స్తంభానికి (విశ్వరూప దర్శనం స్థూపం) ఒడిబాలు కట్టారు. అంతకుముందు ఆలయంలోని అమ్మవారి మూలవిరాట్టుకు అభిషేకం నిర్వహించారు.


తిరుపతి గంగమ్మ జాతర ఈనెల ఆరవ తేదీ అంటే మంగళవారం ఉదయం నుంచి కొడి స్థూపానికి ఒడిబాలు కట్టడం, అమ్మవారికి అభిషేకంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు ఈనెల 14వ తేదీ వేకువజామున అమ్మవారి విశ్వరూప దర్శనంతో సమాప్తం అవుతాయి.

జాతర ఇలా ప్రారంభమైంది

గంగమ్మ ఆలయంలో అమ్మవారికి మొదట పసుపు, గంధం, కుంకుమ తోపాటు సుగంధ ద్రవ్యాలతో కలిపిన చూర్ణంతో తయారుచేసిన ధరవంతో అభిషేకం చేశారు. ఆ తర్వాత అమ్మవారిని ఆభరణాలు, నిమ్మకాయలు, ఈ వెన్న రకాల పుష్పాలతో తయారు చేసిన దండలతో గర్భగుడిని అలంకరించారు.
ఆ తర్వాత అమ్మవారి ఆలయానికి ముందు ఉన్న కోడి ఒడిస్తంభాన్ని కూడా అభిషేకం చేశారు. తెలుగు సాంప్రదాయంలో ఆడబిడ్డకు వివాహ సమయంలో పెళ్లికూతురుగా తయారు చేసినప్పుడు వడిబాలు కట్టడం సాంప్రదాయం.
గంగమ్మకు కూడా పసుపు, కుంకుమ, గంధంతో బియ్యం కలిపారు. ఓ వస్త్రంలో ఆ బియ్యం నింపి మూట కట్టారు. ఆ మూటను కొడి స్తంభానికి కట్టడం ద్వారా అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గంగమ్మ ఆలయాన్ని జాతరకు సిద్ధం చేశారు. అర్చకులు రామకృష్ణ శర్మ, మురళి స్వామి సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి .వెంకటేశ్వర్ నియమించిన జాతర ఉత్సవ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. మిరాసీదారులుగా ఉన్న విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఈ పూరి రమేష్ బాబు ఆచారి, ఆ సామాజిక వర్గం ప్రతినిధులు ఈ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యురాలు పనభాకల్ లక్ష్మి, తిరుపతి డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ తో కలిసి ఆలయంలోని విశ్వరూప స్థూపానికి పరిమళ జలాలతో అభిషేకం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు.
చాటింపు: గంగమ్మ జాతర ఈరోజు రాత్రి 7 గంటలకు చాటింపుతో ప్రారంభం అవుతుంది. అవిలాల గ్రామ సమీప ప్రాంతం గంగమ్మకు పుట్టినిల్లుగా భావిస్తారు. ఇక్కడి నుంచి కైకాల వంశానికి చెందిన సాంబయ్య ఓ వెదురు తట్టలో పసుపు, కుంకుమ, అమ్మవారికి అలంకరించే చీర, అక్షింతలతో బయలుదేరుతారు. ఆ తర్వాత పాత తిరుపతికి సరిహద్దులుగా ఉన్న క్రీడలలో పసుపు కుంకుమ చల్లడం ద్వారా బుధవారం నుంచి జాతర జరుగుతుందని ప్రకటిస్తారు.
ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే.. గ్రామస్తులు పొలిమేరలు దాటకూడదు అనేది ఆచారం.
ఒక్కోరోజు ఒక వేషం

మే 6: గంగమ్మ జాతర చాటింపు
మే 7: బైరాగి వేషం
మే 8: బండ వేషం
మే 9: తోటివేషం
మే 10: దొరవేషం
మే 11: మాతంగి వేషం
మే 12: సున్నపు కుండలు
మే 13: గంగమ్మ జాతర
మే 14: ఉదయం 4 గంటలకు విశ్వరూప దర్శనం
మొక్కలు చెల్లించడం ప్రారంభం
తిరుపతి గంగమ్మకు భక్తులు మొక్కులు చెల్లించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంగళవారం ఉదయం పిల్లలకు వేషాలు వేశారు. ఆలయం, పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచడానికి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఆలయం వద్ద భక్తులకు కల్పించిన ఏర్పాటు ఆమె పరిశీలించారు. వ్యర్ధాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం ద్వారా మున్సిపల్ సిబ్బంది సేవలు అందించాలని ఆమె సూచించారు. కమిషనర్ వెంట మునిసిపల్ అధికారులు కూడా ఉన్నారు.

Similar News