"పని భారం తగ్గించండి.. పోస్టులు భర్తీ చేయండి"

తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన చేపట్టడం ఒక్కటే తమకున్న మార్గమని తిరుపతి రుయా ఆసుపత్రి సిబ్బంది.. సూపరింటెండెంట్‌కు విన్నవించారు.

Update: 2024-06-20 11:41 GMT

తిరుపతి రుయా ఆసుపత్రి ఉద్యోగులు ఆసుపత్రి సూరింటెండ్‌కు వినతి పత్రం అందించారు. తమపై పనిభారం పెరుగుతుందని, దానిని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని వారు తమ వినతి పత్రంలో కోరారు. అందుకోసం ఆసుపత్రిలో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలంటూ యునైటెడ్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ రవి ప్రభుకు అందించారు. అంతేకాకుండా తమకున్న సమస్యలను కూడా వినతి పత్రంలో వివరించారు.

రుయా ఆసుపత్రిలో 1,195 పడకలు ఉన్నాయి. కానీ పడకల సంఖ్య ప్రకారం సిబ్బంది లేదు. దాంతో ఉన్న వారిపై పనిభారం అధికంగా పడుతోందని వారు వివరించారు. యాజమాన్యం పర్మినెంట్ ఉద్యోగాల భర్తీని పూర్తిగా విస్మరించిందని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఆప్కాస్ పద్దతిలో తీసుకున్న పోస్ట్‌లు కూడా ఖాళీగా ఉన్నాయని గుర్తు చేశారు. వీటి భర్తీ విషయంలో యాజమాన్యం తీవ్ర అలసత్వం కనబరుస్తోందని, రాష్ట్రంలో నూతనంగా ఏర్పాడిన కూటమి ప్రభుత్వం ఆసుపత్రిలో సిబ్బంది సంఖ్యను పెంచి తమపై పడుతున్న పనిభారాన్ని తగ్గించాలని వారు కోరారు.

వాటితో పాటుగా సీనియారిటీ పాటించడం, యూనిఫామ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ రుసుము చెల్లించడం, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ ఇంక్రిమెంట్ క్లియర్ చేయడం, ఐదు నెలలు గడుస్తున్నా పీఎఫ్ డబ్బులు జమ కాకపోవడం వంటి సమస్యలను కూడా పరిష్కరించాలని పలుసార్లు విన్నవించినా ఏదో ఒక సాకు చెప్తూ వాటిని సాగదీస్తున్నారని, అది ఏమాత్రం సమంజసం కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రుయా ఆసుపత్రిలోని నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలను తక్షణం తీర్చాలని, డిప్యుటేషన్‌లో ఉన్న ఎఫ్ఎన్‌ఓలని విధులకు కేటాయించాలని కోరారు. ఒక్కొక్కరికి నాలుగు ఐదు వార్డులు కేటాయించడం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకుని గతంలో మాదిరిగా ఒక్కొక్కరికి ఒక్కో వార్డునే కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో ఆందోళన చేయపట్టడం ఒక్కటే తమ ముందు ఉన్న ఏకైక మార్గం అంటూ హెచ్చరించారు.

వారి వినతిపై స్పందించిన సూపరింటెండెంట్.. వెంటనే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, వారం రోజుల్లో ఉద్యోగులు, అధికారులు అంతా సంయుక్తంగా చర్చించి అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రుయా ఉద్యోగుల సంఘం నాయకులు టి. నాగ పద్మలత, ఎం. లీలావతి, బి. హరికుమార్, కె. లక్ష్మీనారాయణ, తులసీరామ్, వెంకటేశులు, ప్రసాద్, శాంతమ్మ, రాధా, నవమణి, ఉత్తర కుమారి, కాంచనమాల తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News