ఆంధ్రప్రదేశ్ అంతరిక్ష ద్వారం: తిరుపతి స్పేస్ హబ్
ఆధ్యాత్మికం నుంచి అంతరిక్షం వైపు: తిరుపతి సరికొత్త ప్రయాణం!;
By : The Federal
Update: 2025-09-11 05:59 GMT
ఆంధ్రప్రదేశ్‌ను అంతరిక్ష–రక్షణ రంగాల్లో జాతీయ కేంద్రంగా మార్చే దిశగా కీలక అడుగు పడింది. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిని అంతరిక్ష పరిశోధనా కేంద్రంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 3,450 కోట్ల రూపాయలతో అంతరిక్ష, రక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని తలపెట్టినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
భారతదేశంలో ఇప్పటి వరకు “స్పేస్ సిటీ” అనే కాన్సెప్ట్ లేదు. అమెరికాలో హ్యూస్టన్, యూరప్‌లో టౌలూస్ లాంటి నగరాలు అంతరిక్ష హబ్‌లుగా నిలిచినట్లే, తిరుపతి కూడా ఒక ఇండియన్ స్పేస్ క్యాపిటల్‌గా మారనుంది. తిరుపతి నగరానికి ఇదో కొత్త గ్లోబల్ ఐడెంటిటీ. కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే కాకుండా, శాస్త్ర–రక్షణ కేంద్రంగా పేరు తెచ్చుకుంటుంది. రూ.3వేల 4 వందల కోట్ల పెట్టుబడితో ఈ సిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఇండియా టుడే కాంక్లేవ్ లో నారా లోకేశ్ కూడా చెప్పారు.
ప్రభుత్వం స్పేస్ సిటీ అభివృద్ధి కాంట్రాక్టును స్కై రూట్ ఏరోస్పేస్‌కు అప్పగించింది. ఇది ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు 8 ఏళ్ల కిందట స్థాపించారు. చిన్న ఉపగ్రహాల కోసం తక్కువ ఖర్చుతో కూడిన లాంచ్ వెహికిల్స్ రూపకల్పనలో స్కైరూట్ ప్రసిద్ధి చెందింది.
స్పేస్ సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రౌతుసురమాల, బీఎస్ పురం, కొత్తపాలెం (Routhusuramala, BS Puram, Kottapalem) గ్రామాల పరిధిలో 300 ఎకరాలు కేటాయించింది. స్కైరూట్ రూ.400 కోట్ల పెట్టుబడితో ఈ స్పేస్ సిటీని నిర్మించనుంది.
ఈ ప్రాజెక్టుకు ఆగస్టు 28న రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 6న కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుత ప్లాన్ ప్రకారం, స్పేస్ సిటీలో రాకెట్ తయారీ, అసెంబ్లింగ్, పరీక్షలు, స్టాక్స్ వంటివి ఉంటాయి.
రాష్ట్ర ఏరోస్పేస్ & డిఫెన్స్ పాలసీ ఈ ఏడాది జూన్‌లో విడుదలైంది. దాని ప్రకారం ఇది తొలి స్పేస్ సిటీ కానుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే ఐదేళ్లలో ₹50,000 కోట్ల నుంచి ₹1 లక్ష కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, ఆంధ్రప్రదేశ్‌ను జాతీయ రక్షణ–అంతరిక్ష కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
స్పేస్ సిటీ ప్రత్యేకత ఏమిటంటే...
‘స్పేస్ సిటీ’ అనేది అంతరిక్ష పరిశోధన, ఉపగ్రహ తయారీ, రక్షణ-ఎయిరోస్పేస్ రంగాల్లో పరిశ్రమలు, ల్యాబొరేటరీలు, శిక్షణా కేంద్రాలు కలిపిన టెక్నాలజీ హబ్. స్పేస్ టెక్నాలజీ రంగంలో స్టార్టప్‌లు, MSME యూనిట్లను ప్రోత్సహించే ప్రత్యేక క్లస్టర్ గా అభివృద్ధి చెందడం. ఇక్కడ శాటిలైట్ అసెంబ్లీ యూనిట్లు, విడిభాగాల (కాంపోనెంట్) తయారీ పరిశ్రమలు, టెస్టింగ్ సెంటర్లు ఉంటాయి.
ISRO, DRDO, ప్రైవేట్ స్పేస్ స్టార్టప్‌లు, రక్షణ రంగ కంపెనీల వంటివన్నీ ఒకే ప్రాంగణం నుంచి పని చేస్తాయి.
‘సిలికాన్ వ్యాలీ’ తరహాలో స్పేస్, డిఫెన్స్ రంగానికి సెంటర్ గా భావించవచ్చు.
తిరుపతిని ఎందుకు ఎంపిక చేశారు?
తిరుపతిని ఎంచుకోవడానికి కారణం, సమీపంలోనే శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఉండటమే. రాకెట్ సదుపాయాల ఏర్పాటు కోసం ఇది అత్యంత అనుకూలమైన ప్రదేశమని ప్రభుత్వం భావించింది.
తిరుపతికి దగ్గరలోని షార్ (SHAR), శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం ఉంది. అక్కడి నుంచి భారత్‌లోని దాదాపు అన్నీ రాకెట్ ప్రయోగాలు జరుగుతున్నాయి. జియోగ్రాఫికల్ అడ్వాంటేజ్ వల్ల పరిశోధన, ప్రయోగాలకు అనువైన వాతావరణం.
తిరుపతిలోనే ఇప్పటికే పీఎస్‌ఎల్‌వీ ఇన్టిగ్రేషన్ ఫెసిలిటీ, సెమీ క్రయోజెనిక్ టెస్టింగ్ సెంటర్ వంటి ఇస్రో సెంటర్లు ఉన్నాయి. వీటికి తోడు విశ్వవిద్యాలయాలు, ఐఐఐటీ, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లు ఉండటం వల్ల మానవ వనరులు సిద్ధంగా ఉంటాయి.
స్పేస్ సిటీలో ఏం చేస్తారు?
-ఉపగ్రహ తయారీ, అసెంబ్లింగ్ జరుగుతుంది. వాతావరణ, కమ్యూనికేషన్, రక్షణ ఉపగ్రహాలను తయారు చేస్తారు.
-లాంచ్ వెహికిల్ భాగాల తయారీ: రాకెట్ ఇంజిన్లు, నాజిల్స్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్.
-టెస్టింగ్ సెంటర్లు: స్పేస్‌లో పని చేసే భాగాలను భూమిపైనే సిమ్యులేట్ చేసి పరీక్షించడం.
-స్టార్టప్ హబ్: చిన్న, మధ్య తరహా కంపెనీలు (MSME) కొత్త స్పేస్ టెక్నాలజీలు అభివృద్ధి చేయడం.
-శిక్షణా సంస్థలు: విద్యార్థులు, పరిశోధకులకు (hands-on training)
దీని వల్ల ప్రయోజనాలు ఏమిటీ?
రక్షణ-ఎయిరోస్పేస్ రంగం ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న రంగం. భారతీయ మార్కెట్, గ్లోబల్ డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు రాబట్టడం జరుగుతుంది. ఎక్కువ నైపుణ్యం ఉన్న ఇంజనీర్లు, టెక్నీషియన్లకు వేలల్లో ఉద్యోగాలు వస్తాయి.
ఆత్మనిర్భర్ భారత్ కింద రక్షణ-అంతరిక్ష టెక్నాలజీలో విదేశాలపై ఆధారపడకుండా దేశీయ ఉత్పత్తి పెంచడం.
-SpaceX, Blue Origin, చైనా స్పేస్ కార్పొరేషన్లతో పోటీలో భారత్‌ను ముందుకు తీసుకెళ్లడం.
-ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ విలువ పెరుగుతుంది. టెక్నాలజీ + ఇన్నోవేషన్‌లో రాష్ట్రానికి కొత్త గుర్తింపు. తిరుపతిలో ఏర్పడే ఈ సిటీ శ్రీహరికోటకు బలమైన ‘సపోర్ట్ హబ్’ అవుతుంది. తిరుపతిలోని SV యూనివర్సిటీ, IIT, IISER లాంటి సంస్థలతో కలిసి రీసెర్చ్, ఇంటర్న్‌షిప్ అవకాశాలు పెరుగుతాయి.
ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి?
Space Policy 4.0 ప్రకారం ప్రభుత్వం ₹25,000 కోట్ల పెట్టుబడులు రావచ్చు. ఈ పాలసీ ద్వారా 5,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, సుమారు 30,000 పరోక్ష ఉద్యోగాలు వస్తాయనేది అంచనా. అధికారులు అధికారికంగా వెల్లడించలేదు. వాటిలో గుమాస్తా, సెక్యూరిటీ ఉద్యోగాలతో పాటు అత్యున్నత నైపుణ్య రంగాల్లోనూ అవకాశాలు వస్తాయి.
-Aerospace, Mechanical, Electronics, Computer Science ఇంజినీర్లకు అవకాశం ఉంటుంది.
-Physics, Space Science, Nanotech శాస్త్రవేత్తలు, పరిశోధకులకు ఉద్యోగాలు
-సాఫ్ట్‌వేర్ నిపుణులు: AI, Data Analytics, Cybersecurity.
-టెక్నీషియన్లు: డిప్లొమా హోల్డర్లు, ల్యాబ్ అసిస్టెంట్లు.
-సహాయక రంగం: ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్, HR.
స్థానికులకు ఎలా మేలు జరుగుతుందంటే..
తిరుపతి, చిత్తూరు ప్రాంత యువతకు నేరుగా ఉద్యోగాలు వస్తాయి. స్థానిక యూనివర్సిటీలకు ఇండస్ట్రీ–అకాడెమీల మధ్య అనుబంధం పెరుగుతుంది.
చిన్న పరిశ్రమలు, హోటళ్లు, ట్రాన్స్‌పోర్ట్, అద్దె ఇండ్లు వంటి వాటికి కొత్త డిమాండ్ వస్తుంది. ఎలక్ట్రానిక్ విడి భాగాల తయారీ, వెల్డింగ్, ఫ్యాబ్రికేషన్ రంగాల్లో స్థానికులకు పెద్దపీట వేస్తారు.
స్పేస్ సిటీ అనేది రేపటి అంతరిక్ష, రక్షణ అవసరాల కోసం నేడు నిర్మించే సాంకేతిక–పరిశోధన–పరిశ్రమల మిశ్రమ కేంద్రం. దీంతో తిరుపతి ఆధ్యాత్మికత నుంచి అంతరిక్షం వైపు అడుగువేసే దిశగా పయనించనుంది.