ఎన్నికల ప్రచారంలో టాలివుడ్‌ నటులు

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఇరువురు సినీ హీరోలు ఎన్‌డీఏ కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. వీరి కోసం టాలీవుడ్‌ నటులు ప్రచారానికి దిగారు.

Update: 2024-04-29 05:03 GMT

ఎన్నికల ప్రచారంలో సినీ తారల తళుకులు మెరుస్తున్నాయి. అభ్యర్థుల గెలుపు కోసం నటులు ప్రచారానికి దిగారు. చిరంజీవి కుటుంబం నుంచి దాదాపు అందరూ ప్రచారానికి వస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం పవన్‌ కళ్యాణ్‌ జనసేన అధినేతగా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగటం. గత ఎన్నికల్లో ఓటమి సవిసూచినందున ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో పోటీకి దిగారు. పైగా ఆయన కాపుల ఓట్లు సుమారు 80 వేల వరకు ఉన్న పిఠాపురం ఎంపిక చేసుకోవడం విశేషం.

పిఠాపురం నియోజకవర్గంలోనే నివాసం ఉండేందుకు కూడా నిర్ణయించుకున్నారు. ప్రత్యేకంగా ఒక ఇంటిని తీసుకుని అక్కడ గృహ ప్రవేశం చేశారు. ఆ ఇంటి నుంచి ఎన్నికల ప్రచార యాత్రను మొదలు పెట్టారు. మొదటి నుంచి నిర్వహిస్తున్న వారాహి యాత్ర కొనసాగుతోంది. పవన్‌కళ్యాణ్‌ పెట్టిన జనసేన పార్టీకి ఈ పదేళ్లలో పెద్దగా స్పందన లేదు. ఆయన సోదరుడు ప్రముఖ సినీ హీరో చిరంజీవి కూడా తమ్ముడు పెట్టిన పార్టీ గురించి పెద్దగా ఎక్కడా మాట్లాడలేదు. తమ్ముడికి అండగా మరో సోదరుడు సినీ నటుడు నాగబాబు నిలిచారు. పార్టీలో కార్యదర్శి హోదాలో మొదటి నుంచీ పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు వరుణ్‌తేజ్‌ ఇప్పటికే బాబాయి గెలుపు కోరుతూ పిఠాపురం నియోజకవర్గంలో రోడ్డుషోలు నిర్వహించడం మొదలు పెట్టారు.
పవన్‌ కళ్యాణ్‌ గెలుపు కోరుతూ చిరంజీవి కూడా మే నెల 5న పిఠాపురంలో ప్రచారం నిర్వహించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే చిరంజీవి నుంచి ఇంకా గ్రీన్‌సిగ్నల్‌ రాలేదు. అలాగే సినీ హీరో అల్లు అర్జున్‌ కూడా ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ నటుడు పృద్విరాజ్‌ పవన్‌ను గెలుపును కోరుతూ ప్రచారంలో దూసుకు పోతున్నారు. ఇక జబర్దస్త్‌ కమెడియన్‌ ఆది కూడా పవన్‌కళ్యాన్‌ కోసం ప్రచారం చేస్తున్నారు. పవన్‌కళ్యాణ్‌ గెలుపు కోసం ఒక్కరొక్కరుగా సినీ తారలు ప్రచార రంగంలోకి దిగుతున్నారు. మెగా ఫ్యామిలీ పూర్తి స్థాయిలో రంగంలోకి గిదే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎన్‌డిఎ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడో సారి నందమూరి బాలకృష్ణ పోటీకి దిగారు. ఆయన గెలుపు కోసం కొందరు సినీ తారలు ప్రచారంలోకి దిగనున్నారు. ఎవరెవరు వస్తారనేది ఇంకా ఖరారు కాలేదు. బాలకృష్ణ ఇప్పటికే హిందూపురంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు.
వైఎస్సార్‌సీపీ నుంచి ఇరువురు సినీనటులు ప్రచారంలోకి దూకారు. వారు పార్టీ పదవుల్లో కూడా ఉన్నారు. చలన చిత్ర మండలి అధ్యక్షులుగా ఉన్న పోసాని మురళీకృష్ణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేసేందుకు రెడీగా ఉన్నారు. అదే విధంగా ప్రభుత్వ సలహాదారు అలీ కూడా ఎన్నికల ప్రచారం చేసేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.
నగరి నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్‌కె రోజా ప్రముఖ సినీ హీరోయిన్‌. ఆమె మంత్రిగా ఉన్నారు. మంత్రి అయినా సినీ తారల్లో ఉన్న నటన అప్పుడప్పుడూ బయటకు వస్తూనే ఉంది. ప్రచారాల్లో పాల్గొన్న సమయాల్లో ఒక్కోసారి ఒక్కో చోట డ్యాన్స్‌లు వేయడం, ప్రజలను నవ్వించడం చేస్తున్నారు. బాలకృష్ణ కూడా చాలా చోట్ల సందర్భాను సారంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో డ్యాన్స్‌లు వేస్తూ కనిపిస్తున్నారు. రోజా, బాలకృష్ణ వేరువేరు పార్టీలో ఉన్నప్పటికీ సినీ రంగంలో కలిసి చాలా సినిమాలు చేశారు. మంచి కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్నారు.
తెలంగాణలో కనిపించని సినీ తళుకులు
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఇంతవరకు సినీ నటులు ప్రచారంలోకి దిగలేదు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య పోటీ జరుగుతోంది. సినీ నటులు ప్రచారానికి వస్తారేమోనని ఓటర్లు ఎదురు చూస్తున్నారు. అయితే ఇంత వరకు అటువంటి ఆనవాళ్లు కనిపించలేదు. ఏపీలోనే ఎన్నికల్లో పోటీ పడటంతో పాటు ప్రచారంలో కూడా సినీ తారలు కనిపిస్తున్నారు.
మునుపటి ఆదరణ ఉందా?
సినీ తారల ప్రచారానికి మునుపటి ఆదరణ ఉందా అనేది పలువురు ఆసక్తితో వేస్తున్న ప్రశ్న. కొత్తగా రోడ్డుపైకి వస్తున్న యాక్టరైతే ఎలా ఉంటాడు. ఏమని మాట్లాడుతాడో చూద్దామని జనం వస్తున్నారు. కానీ ఇప్పటికే పలుమార్లు ప్రచారంలో పాల్గొన్న వారి గురించి పెద్దగా జనం పట్టించుకోవడం లేదు. నాడు ఎన్‌టి రామారావుకు వచ్చిన జనం ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. చిరంజీవి సభల్లో అప్పట్లో జనం బాగానే వచ్చారని చెప్పొచ్చు. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్, బాలకృష్ణ రోడ్డు షోలకు కూడా జనం బాగానే వస్తున్నారు. వీరు పూర్తి కాలపు రాజకీయ నాయకులుగా మారిపోయినందున వీరి కోసం జనం రావటం పరిపాటిగా మారింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో జూనియర్‌ ఎన్‌టీ రామారావు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో అటువంటిదేమీ లేదని తేలిపోయింది. ఎన్‌టీఆర్‌ సభలకు జనం గత ఎన్నికల సమయంలో బాగా వచ్చారని చెప్పొచ్చు. తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబునాయుడు, లోకేష్, పురందేశ్వరిలు స్టార్‌ క్యాంపెయినర్లుగా రంగంలో ఉన్నారు.
Tags:    

Similar News