CM Chandrababu | ఆలయాల అనుసంధానంతో పర్యాటకం అభివృద్ధి
దేశాభివృద్ధిలో ఆలయాలు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నాయి. యాత్రికులకు మెరుగైన సేవలు అందిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-02-18 00:30 GMT
మహారాష్ట్ర, గోవా సీఎంలు దేవేంద్ర ఫడ్నవిస్, ప్రమోద్ సావంత్ తో కలిసి సదస్సు ప్రారంభిస్తున్న సీఎం చంద్రబాబు
దేశాభివృద్ధికి ఆలయ పర్యాటకం ప్రధాన వనరు అని సీఎం ఎన్. చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆలయాలను అనుసంధానం చేయడం ద్వారా పర్యాటకాన్ని మరింతగా ప్రోత్సహించనున్నట్లు ఆయన తెలిపారు. కుటుంబ వ్యవస్థ దేశానికి అతి పెద్ద బలం. భారతీయ సంస్కృతి వారసత్వ పరిరక్షణలో దేవాలయాలది కీలక పాత్ర అని కూడా ఆయన వివరించారు దేవుడికి సేవ చేయడం అనేది అన్నింటికంటే గొప్పదని ఆయన అభివర్ణించారు.
అంతర్జాతీయ ఆలయ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో (itcx-2025) మూడు రోజుల సదస్సు తిరుపతిలో సోమవారం ప్రారంభమైంది. టెంపుల్ కనెక్ట్ (Tempile Connect) వ్యవస్థాపకుడు గిరేష్ కులకర్ణి సారధ్యంలో కరకంబాడి వద్ద ఉన్న ఆశ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేశారు. మూడు రోజుల కార్యక్రమాన్ని మహారాష్ర్ట సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం అండ్ చంద్రబాబు ప్రారంభించారు.
ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాదు. దేశాభివృద్ధిలో ప్రధాన ఆదాయ వనరులను కూడా ఆయన అభివర్ణించారు. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయడం ద్వారా ప్రశాంత జీవనానికి బాటలు వేసుకోవాలని ఆయన సూచించారు. ఎందరో భక్తులు కోట్ల రూపాయలు విరాళాలు ఇస్తున్నారు. ఈ విరాళాలను శ్రేయస్సు కోసమే ఖర్చు చేస్తున్నాం అని కూడా ఆయన స్పష్టం చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని కుంభమేళాలో దాదాపు 55 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారని గుర్తుచేసిన సీఎం చంద్రబాబు భారతీయ సంస్కృతి, వారసత్వ పరిరక్షణలో దేవాలయాలదే ప్రధాన పాత్ర అని గుర్తు చేశారు
దేవాలయాల సర్క్యూట్
రాష్ట్రంలోని దేవాలయాలను అనుసంధానిస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల, టిటిడి సేవలను ఆయన గుర్తు చేశారు. దేవుడికి సేవ చేయడం అనేది ఎంతో గొప్ప కార్యక్రమమని చెబుతూ, తిరుమల బాలాజీ అంటే కోట్లాది మంది భక్తులకు విశ్వాసం నమ్మకం ఉందనే విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలోని దేవాలయాల సందర్శనకు వచ్చే భక్తులకు వస్తువులు కల్పిస్తాం అని చెప్నపారు. తిరుమలలో 75% పర్యావరణాన్ని పరిరక్షించి పచ్చదనం పెంపొందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం దేవాలయాల్లో గ్రీన్ ఎనర్జీ ఉపయోగిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తిరుమలలో నిత్య అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఖ్యాతి మాజీ సీఎం ఎన్టీ రామారావు కు దక్కుతుందని ఆయన గుర్తు చేశారు. నిత్యం లక్షలాది మంది భక్తులు ఇక్కడ అన్న ప్రసాదం తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారని, దీనికోసం నాణ్యత ప్రమాణాలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
రాష్ట్రంలోని దేవాలయాల్లో మౌలిక వసతులు పెంచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఇందుకోసం తమ ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల కాలంలోనే దేవాలయాలకు 134 కోట్ల రూపాయలు ఖర్చులు చేసినట్టు చెప్పారు. అందులో అర్చకులకు వేతనాలు చెల్లించడం తోపాటు వేద పాఠశాలలకు నిధులు కూడా కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఈ నిధులను రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల కమిటీల ద్వారా నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.
సాంకేతికత అంది పుచ్చుకోవాలి
రాష్ట్రంలో ఆలయ పర్యాటకం కీలకపాత్ర పోషిస్తున్న విషయాన్ని గుర్తు చేసిన సీఎం చంద్రబాబు ప్రతి ఇంట్లో ఒక ఏఐ (Artificial intelligence) నిపుణుడు తయారవుతున్నారు. సాంకేతికను వినియోగించుకోవడం ద్వారా మరింత పురోభివృద్ధి సాధించాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. దేశంలో యువత సంఖ్య ఎక్కువగా ఉండడం అదృష్టంగా కలిసి వస్తుందని చెప్పిన ఆయన 20047 నాటికి నెంబర్ వన్, లేదా నెంబర్ టు లో నిలిచే విధంగా యువత సాంకేతికంగా అభివృద్ధి వైపు అడుగులు వేయాలని సూచించారు.
ఆలయాలు పెరగాలి
దేశంలోనే కాదు. ప్రపంచ మానవాళి సుఖశాంతులతో ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. దీనికోసం దేశ విదేశాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల సంఖ్య పెరుగుతున్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన, ఇవి మరింత విస్తృతం చేయాల్సిన అవసరాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. తద్వారా ప్రశాంతతను కాపాడడడంత పాటు పర్యాటక రంగానికి కూడా తోడ్పాటు అందుతుందన్నారు. ఆ దిశగానే తమ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.