ఏపీలో బెంబేలెత్తిస్తున్న ట్రాఫిక్ ఫైన్స్
వాహనాలకు ఉండాల్సిన కాగితాలు లేవా? హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణం చేస్తున్నారా? అయితే కాస్త ఆగండి ఈ విషయాలు తెలుసుకోండి.;
ఆంధ్రప్రదేశ్ లో ట్రాఫిక్ నిబంధనలు గతానికి, ఇప్పటికి పూర్తిగా మారాయి. వేలకు వేలు ఫైన్స్ పడుతున్నాయి. కాలం చెల్లిన వాహనాలు నడిపితే కనీసం పది వేలకు తగ్గకుండా ఫైన్ పడుతోంది. ఇక బైకులు, కార్లకు ఉండాల్సిన కాగితాలు లేకుంటే ఫైన్స్ బాది వదులుతున్నారు. ముందుగా వాహనదారులకు క్షేమం గురించి చాలా రోజుల నుంచి చెబుతున్నాం. మైకుల ద్వారా తెలియజేస్తున్నాం. అయినా వినటం లేదు. మేము విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నామని హైకోర్టు వ్యాఖ్యానించింది. అందుకే ప్రయాణికుల క్షేమంతో పాటు వారు నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అనేది చూస్తున్నాం. సాధారణ పైన్స్ వేస్తుంటే చాలా మంది ఫైన్ కట్టి వెళుతున్నారు. అందుకే అసాధారణ ఫైన్స్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు చెప్పారు.
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు నగరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు మరింత పటిష్టం చేశారు. హెల్మెట్ లేకుండా రోడ్డు మీదకు వెళితే రూ. 1,000లు ఫైన్ కట్టాల్సిందే. పోనీలే పాపం అనే పరిస్థితి లేదు. ఎవరినైనా వదలటం లేదు. పోలీస్ కానిస్టేబుల్స్ కూడా చాలా మంది ఇలాగే ఫైన్ కట్టారు.
విజయవాడ కృష్ణలంక సత్యంగారి హోటల్ వద్ద ట్రాఫిక్ పోలీసులు చెకింగ్ చేస్తుంటే ఓ పోలీస్ కానిస్టేబుల్ స్పీడుగా దూసుకొచ్చారు. అక్కడ చెకింగ్ లో ఉన్న ఏసీపీ ఒకరు కానిస్టేబుల్ ద్వారా బైకును పక్కన బెట్టించి వాళ్ల ఎస్పీ గారికి ఫోన్ కలపాలని కానిస్టేబుల్ ను ఆదేశించారు. దీంతో ఆ కానిస్టేబుల్ ఖంగుతిన్నాడు. ఇక్కడ చెకింగ్ జరుగున్నది తెలియడం లేదా? నువ్వు కానిస్టేబుల్ అయితే హెల్మెట్ పెట్టుకోవా? నిన్ను పంపిస్తుంటే వీళ్లందరూ నావైపు చూడాలా? ఇతనిపై కేసు ఫైల్ చేయండని ఆదేశించారు. దాంతో అక్కడి వారంతా ఆశ్చర్య పోయారు. పోలీసులు ఇంత కఠినంగా వ్యవహరించడానికి కారణం న్యాయమూర్తులు. వారి ఆగ్రహానికి ఎక్కడ గురికావాల్సి వస్తుందోనని నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు.
ఫైన్స్ ఎలా ఉన్నాయో తెలుసా?
హెల్మెట్ ధరించ కుండా బైకులపై డ్రైవింగ్ చేస్తే సెక్షన్ 194 (డి) ఎంవి యాక్ట్ ప్రకారం గతంలో రూ. 100లు జరిమానా విధించే వారు. ప్రస్తుతం రూ. 1000లు జరిమానాతో పాటు మూడు నెలలు లైసెన్స్ రద్దు చేస్తారు.
మనిషి ప్రాణానికి, వారి వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే విధంగా తొందర పాటు లేదా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినా, వ్యవహరించినా సెక్షన్ 125 బిఎన్ఎస్ ప్రకారం గతంలో మూడు నెలలు జైలు శిక్ష లేదా రూ. 250లు జరిమానా విధించే వారు. ప్రస్తుతం మూడు నెలలు జైలు శిక్ష లేదా రూ. 2500 వరకు జరిమానా విధిస్తారు.
ప్రభుత్వ అనుమతి లేకుండా రేసింగ్ చేసినా, ట్రయల్స్ చేసినా పాత నిబంధనల ప్రకారం ఎంవీ యాక్ట్ సెక్షన్ 189 ప్రకారం ఒక నెల జైలు శిక్ష లేదా రూ. 500 జరిమానా విధిస్తారు. కొత్త నిబంధనల ప్రకారం 3 నెలలు జైలు శిక్ష లేదా రూ. 5వేలు జరిమానా విధిస్తారు. రెండో సారి అదే విధమైన నేరం చేస్తే సంవత్సరం జైలు శిక్ష, రూ. 10,000లు జరిమానా విధిస్తారు.
సక్రమంగా లేని నెంబరు ప్లేట్లు, అసలు నెంబరు ప్లేట్లు లేకుండా వాహనం నడిపితే పాత నిబంధనల ప్రకారం సెక్షన్ 177 ఎంవీ యాక్ట్ ప్రకారం రూ. 100లు జరిమానా అయితే దీనిని కొత్త నిబంధనల ప్రకారం రూ. 300 లు జరిమానా విధిస్తున్నారు.
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే సెక్షన్ 181 ఎంవీ యాక్ట్ ప్రకారం పాత నిబంధనల మేరకు మూడు నెలలు జైలు శిక్ష లేదా రూ. 500 జరిమానా ఉంది. కొత్త నిబంధనల ప్రకారం మూడు నెలలు జైలు శిక్ష లేదా రూ. 5000 జరిమానా విధిస్తున్నారు.
డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి వాహనం ఇస్తే వాహన ఓనర్ కు సెక్షన్ 190 (2) ఎంవీ యాక్ట్ ప్రకారం పాత నిబంధనలను అనుసరించి వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారు. లేదంటే మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాలి. కొత్త నిబంధనల ప్రకారం రూ. 5000లు జరిమానా విధిస్తున్నారు. లేదా మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాలి.
సైలెన్సర్ లు సొంతంగా తయారు చేయించుకుని వాడి శబ్ధ కాలుష్యం వచ్చేలా చేస్తే ఎంవీ యాక్ట్ సెక్షన్ 190 (2) ప్రకారం గతంలో వెయ్యి జరిమానా విధించే వారు. రెండో సారి చేస్తే రెండు వేలు జరిమానా ఉండేది. కొత్త నియమావళి ప్రకారం రూ. 10వేలు జరిమానా విధిస్తారు. రెండో సారి చేస్తే రూ. 10వేలు జరిమానా ఉంటుంది. జరిమానా కట్టకపోతే మొదటి సారి మూడు నెలలు, రెండో సారి కేస్తే ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తారు.
వాహనానికి ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఎంవీ యాక్ట్ సెక్షన్ 196 ప్రకారం పాత నిబంధనలు అనుసరించి రూ. 1000లు జరిమానా లేదా మూడు నెలలు జైలు శిక్ష విధిస్తారు. కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం మొదటి సారి తప్పు చేస్తే రెండు వేలు, రెండో సారి చేస్తే 4వేలు జరిమానా విధిస్తారు. జరిమానా కట్టకుంటే మూడు నెలలు జైలు శిక్ష ఉంటుంది.
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా వాహనం నడిపితే సెక్షన్ 190 (2) కింద రూ. 1500లు జరిమానా విధిస్తారు. యూనిఫారం లేకుండా వాహనం (ఆటో) నడిపితే మొదటి సారి రూ. 150లు, రెండో సారి రూ. 300 లు జరిమానా విధిస్తారు.
సీటు బెల్ట్ పెట్టుకోకుండా కార్లు నడిపితే సెక్షన్ 194 బి ప్రకారం డ్రైవర్ కు రూ. 1000లు, ప్రయాణికునికి రూ. 1000లు జరిమానా విధిస్తారు.
వాహన దారుడు వాహనానికి రిజిస్ట్రేషన్ లేకుండా, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, రిజిస్ట్రేషన్ రెన్యువల్ లేకుండా వాహనం నడిపితే సెక్షన్ 192 ప్రకారం మొదటి సారి రూ. 2వేలు, రెండో సారి రూ. 5వేలు జరిమానా విధిస్తారు.
అతి వేగంతో వాహనాలు నడిపితే సెక్షన్ 183 (ఓ) ప్రకారం రూ. 1000లు జరిమానా ఉంటుంది. టిప్పర్ రైడింగ్ కు పాల్పడితే సెక్షన్ 194 సి ప్రకారం రూ. 1000లు జరిమానా విధిస్తారు.
హై కోర్టు బూచి చూపించి..
ఈ విధమైన జరిమానాలు మార్చి 1 నుంచి అమలు చేస్తున్నట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. సవరించిన జరిమానాలు అమలు చేయడంతో పాటు ట్రాఫిక్ పోలీస్ వారితో వాగ్వాదాలకు దిగినా, న్యూసెన్స్ క్రియేట్ చేసినా అందుకు అదనపు శిక్షలు ఉంటాయన్నారు.
విశాఖపట్నం బీచ్ రోడ్డులో రైడ్స్ నిర్వహిస్తూ బైకులపై విన్యాసాలు చేస్తున్న 38 మంది రేసర్స్ ను అదుపులోకి తీసుకుని వారి బైక్ లను సీజ్ చేసినట్లు విశాఖపట్నం సిటీ అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ (టాపిక్) కె ప్రవీణ్ కుమార్ తెలిపారు. వీరిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా కోర్టు వారికి రిమాండ్ విధించింది.
వేలకు వేలు ఫైన్స్
ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారిగా వేలకు వేలు ఫైన్స్ వేస్తున్నారు. ఫైన్ కట్టలేని వారు మాత్రమే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. జైలు శిక్ష అనగానే హడిలిపోతున్నారు. అందుకే ఫైన్స్ కట్టి వెళ్లి పోతున్నారు. హెల్మెట్ కంపల్‌సరీ చేయడాన్ని ఎవరూ తప్పనటం లేదు. కానీ ఇతర విషయాల్లో వేలకు వేలు ఫైన్స్ వేయడంపై పెదవి విరుస్తున్నారు. నెల రోజుల నుంచి రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసులు వాహన చోదకులను హడలెత్తిస్తున్నారు. ఈ నిబంధనలు 2025 మార్చి 1 నుంచి మరింత కఠిన తరం చేశారు. విజయవాడలోని ప్రధాన కూడళ్ల వద్ద ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేశారు.
‘భరత్ అనే నేను’ సినిమా చూపిస్తున్నారు..
మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమాలో కూడా ఇలాగే ఫైన్స్ వేస్తారు. వన్ వేలో వెళ్లాల్సిన వాహన దారు దగ్గరగా ఉందని నిబంధనలకు విరుద్ధంగా వెళితే ఆ సనిమాలో రూ. 25వేల ఫైన్ వేస్తారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి వేలకు వేలు ఫైన్స్ వేస్తారు. విదేశాల్లో చదువుకుని వచ్చిన భరత్ అక్కడి నిబంధనలు ఎలా ఉంటాయో చూపిస్తారు. ప్రస్తుతం భారత దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇంత భారీ స్థాయిలో వాహన దారులపై ఫైన్స్ వేయడం లేదని వాహన వినియోగ దారులు వాపోతున్నారు.
ఆర్థిక లోటుకు ఆలంబన..
ప్రస్తుతం ప్రభుత్వం ఆర్థికంగా లోటులో ఉంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫైన్స్ వేస్తే ప్రభుత్వానికి ఆదాయం ట్రాఫిక్ పోలీసుల నుంచి వస్తుంది. పోలీస్ శాఖ అంటేనే ఖర్చు పెట్టే శాఖ అనే పదానికి అర్థం మార్చాలని పోలీసులు కూడా భావిస్తున్నారు. ఒక సారి ఫైన్ కట్టారంటే రెండో సారి నిబంధనలు తప్పకుండా వాహన దారులు పాటిస్తారని పోలీసులు అంటున్నారు. సుమారు నెల రోజుల పాటు అవగాహనా కార్యక్రమాలు చేపట్టిన తరువాత ఈ కొరఢా ఝుళిపించే కార్యక్రమాన్ని చేపట్టారు.