TTD | ఇక నెయ్యి నాణ్యత పరీక్ష తిరుమలలోనే...
ఎన్టీడీబీ అందించిన రూ. 75 లక్షల పరికరాలతో ల్యాబ్ ప్రారంభం.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-07-22 14:54 GMT
శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యత పరీక్షలు తిరుమలలో పరీక్షించనున్నారు. రూ. 75 లక్షల యంత్ర పరికరాలతో ఏర్పాటు చేసిన ల్యాబ్ ను ఈఓ జే. శ్యామలరావు, అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరితో కలిసి టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు మంగళవారం సాయంత్రం ప్రారంభించారు.
తిరుమలలో రోజుకు 2.50 లక్షల లడ్డూల తయారీకి అవసరమైన ప్రైవేటు డెయిరీల నుంచి టీటీడీ కొనుగోలు చేస్తోంది. దీనిని పరీక్షల నిమిత్తం కర్ణాటకలోని మైసూర్ ల్యాబ్ కు పంపించేవారు. ఆ తరువాత గుజరాత్ లోని ఎన్డీడీడీ ల్యాబ్ ను ప్రామాణికంగా తీసుకున్నారు. ప్రస్తుతం ల్యాబ్ ఏర్పాటు చేయడం వల్ల వివాదాలకు, పరీక్షల నివేదికల జాప్యానికి ఆస్కారం లేకుండా పోయింది.
కల్తీ నెయ్యి.. కలకలం..
టీడీపీ కూటమి ఏర్పడిన తరువాత
"శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడిన నెయ్యిలో గొడ్డు కొవ్వు, చేపనూనె కలిపారు" అని సీఎం ఎన్. చంద్రబాబు టీడీఎల్పీ మీటింగ్ లో చెప్పడంతో తీవ్ర దుమారం చెలరెగడం, దీనిపై సుప్రీం కోర్డు ఆదేశంతో రంగంలోకి దిగిన సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో ప్రయివేటు డైరీలకు సంబంధించి నలుగురు డైరెక్టర్లును కూడా అరెస్టు చేశారు. ఈ వివాద వ్యవహారం సాగుతుండగానే..
గుజరాత్ ఎన్డీడీబీ స్పందించింది. తిరుమలలో ల్యాబ్ ఏర్పాటుకు వీలుగా పరికరాలు అందించింది. దీనివల్ల
ఇక సమస్య లేదు
తిరుమలలో ఏర్పాటు చేసిన ల్యాబ్ వల్ల సందేహాలు, ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పోయింది. ల్యాబ్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ,
"గతంలో స్వామివారి ప్రసాదాలు, నెయ్యి లాంటి వస్తువుల నాణ్యతను పరీక్షించేందుకు ఇతర రాష్ట్రాలకు నమూనాలు పంపాల్సి వచ్చేది. ఇప్పుడు తిరుమలలోనే అత్యాధునిక పరికరాలతో నేరుగా పరీక్షలు నిర్వహించగలిగే విధంగా ల్యాబ్‌ను తీర్చిదిదద్దాం"అని బీఆర్ నాయుడు తెలిపారు.
టీటీడీ ఈవో శ్రీ శ్యామలరావు మాట్లాడుతూ, ఇప్పటివరకు తిరుమలలో నెయ్యి నాణ్యతను పరీక్షించే వసతి లేదని చెప్పారు. తొలిసారి నెయ్యిలో కల్తీ శాతం, నాణ్యత శాతాన్ని తక్షణమే విశ్లేషించే సామర్థ్యంతో కూడిన పరికరాలు అందుబాటులోకి రావడం శుభపరిణామం అన్నారు.
తిరుమల ల్యాబ్ లో ఏమున్నాయి?
తిరుమలలో శ్రీవారి లడ్డూప్రసాదానికి నెయ్యి వాడుతారు. ఆహార పదార్థాలు వండేందుకు ముడిసరుకులు కూడా టెండర్ల ద్వారా కొనుగోలు చేస్తారు. వాటన్నింటిలో నాణ్యత పరీక్షలకు తిరుమలలో ఏర్పాటు చేసిన ల్యాబ్ ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన పరికరాలను ఈఓ శ్యామలరావు వెల్లడించారు.
1. GC (Gas Chromatograph),
2. HPLC (High Performance Liquid Chromatograph) వంటి పరికరాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
"రూ.75 లక్షలు విలువైన ఈ పరికరాలను గుజరాత్ లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (NDDB) విరాళంగా అందజేసింది" ఈఓ శ్యామలరావు చెప్పారు.
ఆ ల్యాబ్ లో పనిచేయడానికి సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చామని ఆయన వివరించారు.
తిరుమలలోని ల్యాబ్ సిబ్బంది, పోటు కార్మికులు మైసూర్‌లోని CFTRIలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని ఆయన తెలిపారు. ఇకపై స్వామివారి ప్రసాదాల నాణ్యతను ఇదే ల్యాబ్‌లో పరిశీలించి వెంటనే ఫలితాలు అందించేలా ఏర్పాట్లు చేసినట్టు ఆయన వివరించారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతారామ్, సదాశివరావు, నరేష్, సిఈ సత్య నారాయణ, డిప్యూటీ ఈవోలు భాస్కర్, సోమన్నారాయణ, అధికారులు పాల్గొన్నారు.