శ్రీరెడ్డిపైన ఎన్ని సెక్షన్‌ల కింద కేసు పెట్టారంటే?
సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
By : The Federal
Update: 2024-11-17 09:30 GMT
తప్పై పోయింది. నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. ఇంకెప్పుడు అలా మాట్లాడను. అసభ్యకర పోస్టులు పెట్టను. అభ్యంతరకరమైన వీడియోలు పెట్టను. దయచేసి నన్ను క్షమించండి. పెద్ద మనసు చేసుకొని నన్ను వదిలేయండి. లోకేష్ అన్నా.. మీరు చాలా పెద్ద వారు. మంత్రిగా ఉన్నారు. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు అలాంటి పనులు చేయను అని కాళ్లా వేళ్లా పడిన సినీ నటి, వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త శ్రీరెడ్డిని పోలీసులు వదల్లేదు. ఆమెపై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.
మాజీ సీఎం జగన్‌కు సపోర్ట్‌గాను, టీడీపీ, జనసేన, బీజేపీలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, ఆ పార్టీల నేతలే లక్ష్యంగా అభ్యంతరకరంగా మాట్లాడుతూ, అసభ్యపదజాలంతో వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న సినీ నటి శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని మాజీ కార్పొరేటర్ దాసరి జ్యోతి గుంటూరు నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు, వారి కుటుంబ సభ్యులపై తీవ్ర అభ్యంతరకరంగా శ్రీరెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడిందని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో దాసరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన గుంటూరు నగర పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు.
హోం మంత్రి వంగలపూడి అనితపైన అసభ్యకర వ్యాఖ్యలు చేసిందని, అందుకు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలంటూ తూర్పు గోదావరి జిల్లాలో మరో కేసు నమోదు చేశారు. తూర్పు గోదావరి జిల్లా బొమ్మూరు పోలీసు స్టేషన్‌లో టీడీపీ మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీరెడ్డిపైన కేసు నమోదు చేశారు. పలు సెక్షన్‌ల కింద శ్రీరెడ్డిపైన కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 196, 353(2), 79బిఎన్‌ఎస్, 67 ఐటీఏ–2000–2008 సెక్షన్‌ల కింద శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. శ్రీరెడ్డిని ∙ఎప్పుడు అరెస్టు చేస్తారనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.