ఏపీలో ఊహించని సంక్రాంతి సందడి

రాష్ట్రంలో కూటమి ఊహకు అందని మెజారిటీతో అధికారంలోకి ఎలా వచ్చిందో ఈ సారి సంక్రాంతి సంబరాలు కూడా అలాగే జరిగాయని ప్రజలు చర్చించుకోవడం విశేషం.;

Update: 2025-01-15 12:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబరాలు ఈ పదేళ్లలో ఎప్పుడూ జరగని విధంగా జరిగాయి. సంబరాలనగానే గంగిరెద్దులు, మేళ తాళాలు, లోగిళ్లలో ముగ్గులు, గొబ్బెమ్మలు ఇవి సాధారణం. అయితే ఈ సంవత్సరం ఈ సాంప్రదాయాలతో పాటు ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. మూడు రోజుల పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాలోనూ కోడిపందేలు, జూదం, రికార్డింగ్ డ్యాన్స్ లు అనుకోని విధంగా జరిగాయి. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లో కోడిపందేలు సాధారణం కంటే ఎక్కువగానే జరిగాయి.

లక్షల మంది అతిథులు

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు అతిథులు అనుకోని సంఖ్యలో హాజరయ్యారు. ప్రతి సంవత్సరం సాధారణ స్థాయి అంటే వేలల్లో మాత్రమే అతిథులు వచ్చే వారు. ఈ సారి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలో ఉద్యోగాలు చేస్తున్న వారు చాలా మంది వారితో పాటు వారి స్నేహితులు, సన్నిహితులను తీసుకొచ్చారు. వీరి కోసం వారం రోజులు ముందు నుంచే కొన్ని ఇళ్లు ఖాళీ చేసి ఉంచారు. ఈ సారి హోటళ్లు పూర్తిగా నిండాయి. అవే కాకుండా ప్రత్యేకించి అతిథుల కోసం విడిది ఇళ్లు ఏర్పాటు చేయించడం ఇది మొదటి సారని పలువురు స్థానికులు చెప్పారు. చాలా మంది ఎప్పుడూ అనుభవించని ఆనందాన్ని ఈ సంక్రాంతి సంబరాల్లో అనుభవించారు.

హోరెత్తించిన కోడి పందేలు

సంక్రాంతి అనగానే కోడి పందేలు వేయడం, పోలీసులు రావడం, పందేలు వేసే వారిని, పై పందేలు కాసే వారిని తరిమి పట్టుకోవడం ఇప్పటి వరకు చూశాము. కొన్ని సార్లు పోలీసులు తరిమితే చెరువులోకి దూకి చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఈ సారి పోలీసులు కోడి పందేల బరుల వద్ద ఎవ్వరూ కనిపించలేదు. స్థానిక మహిళలతో పాటు ఇళ్లకు వచ్చిన బంధువుల మహిళలు కూడా కోడి పందేలు చూసేందుకు ముందు కొచ్చారు. కొందరు విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు, వారితో పాటు విదేశీయులు పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చారు. వారు ఈ కోడి పందేల సరదాలు చూసి పట్టలేని ఆనందం వ్యక్తం చేశారు. చాలా సార్లు టీవీల్లో చూస్తుంటాం. ప్రత్యక్షంగా బరులకు దగ్గరగా కూర్చుని కోడి పందేలు చూడటం ఇదే మొదటి సారని ఎన్ఆర్ఐలు చెబుతూ సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు.

Delete Edit

ఎమ్మెల్యేలు బరులు ప్రారంభించిన వేళ..

కోడి పందేలు వేయడం అంటే చట్ట విరుద్ధమని ఇన్నేళ్ల కాలంలో ఎవ్వరూ కోడి పందేలు బహిరంగంగా వేయటం లేదు. అయితే ఈ సంవత్సరం తెలుగుదేశం, జనసేన ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా కోడి పందెపు పుంజులు చంకలో పెట్టుకుని పందేలు ప్రారంభించారు. ప్రధానంగా దెందులూరు నియోజకవర్గంలోని దుగ్గిరాల వద్ద జాతీయ రహదారి పక్కన సుమారు కోటి రూపాయలతో కోడి పందేల బరిని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏర్పాటు చేయించారు. అక్కడ ఆయనే కోడి పందేలు ప్రారంభించారు. సమీపంలో కోడి పందేలకు వచ్చే వారికి ప్రత్యేకించి రెస్ట్ రూములు కూడా ఎమ్మెల్యే ఏర్పాటు చేయించారు.

ఉండి నియోజకవర్గంలోని పెద్దమీరం గ్రామం వద్ద శాసన సభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు కోడి పందేల బరులు ఏర్పాటు చేయించారు. ఆకివీడులో కూడా రఘురామ కోడి పందేల బరిని ఏర్పాటు చేయించారు. ఇవే కాకుండా ఇంకా పలు చోట్ల రఘురామ అనుచరులు కోడి పందేల బరులను ఏర్పాటు చేయించారు. రఘురామ దగ్గరుండి కోడి పందేలు ప్రారంభించారు.

వీర మహిళలు ప్రత్యేక బరులు

ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీకి చెందిన వీర మహిళలు ప్రత్యేకించి కోడి పందేల బరుల నిర్వాహకులుగా మారారు. వీరు బరులు ఏర్పాటు చేస్తే మగవారు నిర్వహణ బాధ్యతలు చూశారు. భీమవరం పట్టణానికి సమీపంలోని తాడేరు గ్రామంలో జనసేన పార్టీకి చెందిన వీరమహిళలు ప్రత్యేకించి కోడి పందేల బరులు ఏర్పాటు చేశారు. వీరే కాకుండా ఈ సారి తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి ఎవరికి వారు కోడి పందేల బరులు గీయించారు. చాలా మంది మహిళలు కోడి పెందేళ్లో యాక్టివ్ గా పాల్గొన్నారు. కోడి పందేలు సాగే ప్రాంతాల్లో మీడియా వారు కూడా సందడి చేశారు. ఒక పక్క వీడియోలు తీసే వారు, మరో పక్క ఫొటోలు తీసే వారు, కోడిని పట్టుకున్న వారి వద్ద నుంచి మీడియాకు వీడియోలు తీస్తూ ఇంటర్వూలు చేసే వారు చేసిన సందడి అంతా ఇంతా కాదు.

అదిరి పోయేలా రికార్డింగ్ డ్యాన్స్ లు

బరులతో పాటు చాలా గ్రామాల్లో రాత్రిపూట రికార్డింగ్ డ్యాన్స్ లు కూడా ఏర్పాటు చేయించారు. పగలు, రాత్రి కోడి పందేలు ఆడే వారు ఆడుతుంటే.. రాత్రి రికార్డింగ్ డ్యాన్స్ లతో హోరెత్తించారు. తాడేరు గ్రామంలో వేయించిన రికార్డింగ్ డ్యాన్స్ సంక్రాంతి రోజు రాత్రి వివాదానికి దారితీసింది. భీమవరం పమీపంలోని తాడేరులో జరిగిన రికార్డింగ్ డ్యాన్స్ లో పాడే పాటలు భీమవరం యువకులకు నచ్చలేదు. దీంతో వారు వేరే పాటలతో డ్యాన్స్ లు వేయాలని పట్టుబట్టారు. మా ఊరికి వచ్చి మీ పట్టుదల ఏమిటంటూ ఇరు వర్గాలకు మధ్య గొడవ జరిగింది. పొట్టు రేగేలా కొట్టుకున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Delete Edit

రాయలసీమ నుంచి వేల మంది గోదావరి జిల్లాలకు..

రాయలసీమ ప్రాంతం నుంచి వేల సంఖ్యలో గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలు చేసేందుకు వెళ్లారు. ఉమ్మడి అనంతపురం, వైఎస్ఆర్ కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి కూడా వేల సంఖ్యలో వెళ్లారు. వీరు కోడి పందేలు చూడటంతో పాటు కోడి పందేలు వేసేందుకు కూడా వెనుకాడలేదు. కొందరు సరదాగా పందేలు కాశారు. స్థానికులతో పందేలు కాసే మాటైతే కనీసం పదివేలకు తక్కువ కాకుండా కాయల్సి ఉంది. అలా కాకుండా వేరే ప్రాంతాల నుంచి వెళ్లిన వారు వారిలో వారు కూడా పై పందేలు కాయొచ్చు. అదే విధంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా చాలా మంది గోదావరి జిల్లాలకు వచ్చారు.

కృష్ణా, గుంటూరు జిల్లాలోనూ అధికంగానే జరిగాయి. కోడి పందేలు విజయవాడ చుట్టుపక్కల ఎక్కువగా నిర్వహించారు. విజయవాడలోని రామవరప్పాడు సెంటర్ కు సమీపంలోని రైల్వే స్టేషన్ వద్ద కోడి పందేల బరిని ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి నున్న వెళ్లే దారి పొడవునా కోడి పందేల బరులు ఏర్పాటు చేశారు. మామిడి తోటల్లో కూడా పందేల బరులు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల ఖాళీగా ఉన్న పొలాల్లో కోడి పందేల గిరులు గీసి పందేలు ఆడారు. పెద్దగా ఎప్పుడూ లేనిది ఈ సంవత్సరం పల్నాడు జిల్లాలోని మాచర్ల, కారంపూడి, పిడుగురాళ్ల, రొంపిచెర్ల, గురజాల, సత్తెనపల్లి వంటి ప్రాంతాల్లోనూ కోడి పందేలు జోరుగా సాగాయి. కోడి పందేలకు పల్నాడు పెట్టింది పేరు అటువంటి ప్రాంతంలో చాలా కాలంగా కోడి పందేలు అంతగా జరిగేవి కాదు. కానీ ఈ సంవత్సరం ఎంతో ఉత్సాహంతో సంక్రాంతి మూడు రోజులు కోడి పందేలు నిర్వహించారు. ఈ ప్రాంతంలోనూ రికార్డింగ్ డ్యాన్స్ లతో హోరెత్తించారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కూడా కోడి పెందేల జోరు సాగింది. ప్రకాశం జిల్లాలో కాస్త నెల్లూరు జిల్లాకంటే ఎక్కువగానే కోడి పందేలు సాగినట్లు స్థానికులు చెప్పారు.

అల్లుళ్లకు తిన్నన్ని పిండి వంటలు

గోదావరి జిల్లాల్లో ప్రధానంగా పిండి వంటలు ఎక్కువగా చేస్తారు. కొత్త అల్లుళ్లు పాత అల్లుళ్లకు కూడా ఘుమఘుమలాడే పిండి వంటలు చేసి పెట్టారు. వారితో పాటు వచ్చిన స్నేహితులు, బంధువులకు కూడా ఎప్పటికీ మరిచి పోలేని విధంగా వంటకాల రుచి చూపించారు. ఇక పందేల్లో ఓడిన కోడి మాంసాన్ని బంధువులకు వడ్డించారు. ఆరు నెలల ముందు నుంచే పందెం కోళ్లను జీడిపప్పు, ఇతర గింజలతో పెంచుతారు. బరువుతో పాటు కోడి యాక్టివ్ గా ఉంటుంది. పందెంలో ఓడిన కోళ్లు అందరికీ వండి పెట్టడం ఇక్కడి ఆచారం దీని ప్రకారం ఎంతో మంది కనుమ రోజు కోడి మాంసం రుచి చూసి పట్టలేని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

కనిపించని పోలీసులు..

ప్రతి ఏడాది సంక్రాంతికి కోడి పందేలు అనగానే హడలెత్తించే పోలీసులు ఈ సారి కోడి పందేల వద్దకు రాలేదు. వారంతకు వారు కొట్టుకుని స్టేషన్ లకు వెళితే తప్ప పోలీసులు వచ్చి కోడి పందేలపై కేసులు పెట్టలేదు. పైగా కోడి పందేలు ఆడే చోటనే డబ్బాలో పేకబొమ్మ చెక్కలు వేసి గళగళమనిపించి టేబుల్ పై వాటిని వేసి పేకలోని ఏ బొమ్మలు కనిపిస్తే వారికి డబ్బులు వచ్చే ఆటకు చాలా క్రేజ్ పెరిగింది. ఇదే కాకుండా డబ్బులు సంపాదించడం, పోగొట్టుకునే జూదపు ఆటలు చాలా ఏర్పాటు చేశారు. తిరునాళ్ళతో సమానంగా మూడు రోజుల పాటు గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ పండగ వాతావరణం నెలకొంది. కొన్ని చోట్ల శివరాత్రి రోజు రథోత్సవాలకు వచ్చినట్లు కోడి పందేలకు జనం తరలి వచ్చారు.

సీఎం సైతం సంబరాల్లో...

సంక్రాంతి సంబరాల్లో ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో పాల్గొన్నారు. సాంప్రదాయ ఆటలను ముఖ్యమంత్రి తిలకించారు. ముఖ్యమంత్రి మనుమడు దేవాన్ష్ కూడా పోటీల్లో పాల్గొని పలువురి దృష్టిని ఆకర్షించారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న 110 మంది మహిళలకు ఒక్కొక్కరికి పదివేల వంతున నగదు బహుమతిని నారా భువనేశ్వరి అందించి పలువురిని ఆశ్చర్య పరిచారు. పంచా చొక్కాలలో ముఖ్యమంత్రి పలువురిని ఆర్షించారు. లోకేష్ తన భార్య కు మంగళగిరి నేత చీరను బహుమతిగా అందించారు. ఇలా సందడితో పాటు పలు రకాల వంటకాల రుచి చూశారు. ఊర్లోని వాలందరితో సీఎం, ఆయన తనయుడు లోకేష్, కుటుంబ సభ్యులు అందరూ కలివిడిగా మాట్లాడుతూ తిరిగారు. వారందరితో కలిసి ఫొటోలు దిగారు. నారావారిపల్లెలో సీఎం కుటుంబం ఈ సారి బాగా సందడి చేసిందని స్థానికులు చెబుతున్నారు.

Tags:    

Similar News