జైల్లో కుర్చీ కావాలన్న వంశీ, ఓకే చేసిన న్యాయాధికారి
కోర్టుకు తీసుకువచ్చిన వంశీలో గతంలో ఉన్న కరిష్మా కనిపించలేదు. జుట్టుకు రంగు వెలిసి తెల్లబారిన జుట్టుతో పాలిపోయిన మొహంతో కనిపించారు.;
By : The Federal
Update: 2025-03-25 11:33 GMT
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే (Former YSRCP MLA) వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi)ని విచారణ కోసం మార్చి 25 అంటే మంగళవారం విజయవాడ ఎస్సీఎస్టీ కోర్టుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా న్యాయాధికారి- నిందితుడు వంశీ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో (YSRCP) గన్నవరం తెలుగుదేశం పార్టీ (TDP) కార్యాలయంపై జరిగిన దాడి కేసు ఇది. ఈకేసులో సత్య వర్ధన్ కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi)ని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు (Vijayawada SC , ST Court) మరోసారి ఆయన రిమాండ్‌ను పొడిగించింది. ఏప్రిల్ 8 వరకు పోలీసుల కస్టడీలో ఉండనున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మరో నలుగురు-గంటా వీర్రాజు, ఎలినేని వెంకట శివరామకృష్ణ ప్రసాద్, నిమ్మల లక్ష్మీపతి, వేల్పూరు వంశీల రిమాండ్ ను కూడా న్యాయాధికారి ఆదేశాలు జారీ చేశారు.
విచారణ సమయంలో వంశీని న్యాయాధికారి నేరుగా పలు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. జైల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయని న్యాయాధికారి అడిగారు.. గతంలో అనారోగ్యం దృష్ట్యా వేసిన పిటిషన్‌లపై మంచంతో పాటు పరుపు, దిండు కూడా అనుమతిస్తూ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయనే దానిపై న్యాయాధికారి ఆరా తీశారు.
'ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉందని' అడిగినదానికి వంశీ పర్లేదని జవాబిచ్చారు. సింగిల్ బ్యారక్ లో ఉన్నందున ఇబ్బందిగా ఉందని, వేరే బ్యారక్ లోకి మార్చాలని లేదా ఇప్పటికే తనతో పాటు రిమాండ్‌లో ఉన్న వారిలో ఒకరిద్దర్ని తన బ్యారక్ లో ఉంచే వెసులుబాటు కల్పించాలని న్యాయాధికారిని వంశీ కోరారు.
దీనికి సంబంధించి గతంలోనే పిటిషన్ దాఖలైంది. అప్పటి పరిస్థితులు, అప్పటి విచారణపై న్యాయాధికారి స్పందించారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేతగా ఉన్న నేపథ్యంలో భద్రత దృష్ట్యా వేరే వారిని వంశీతో కలిపి ఉంచలేమని జైలు అధికారులు, పోలీసులు గతంలోనే కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
దీంతో అప్పటి నుంచి సింగిల్ బ్యారేక్‌లోనే ఉంచాలని న్యాయాధికారి సూచించారు. అదే అంశాన్ని ఈరోజు మరోసారి న్యాయాధికారి ప్రస్తావించారు. భద్రత దృష్ట్యా, జైలు అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా 'వేరే వారిని మీతో ఉంచే అవకాశం లేదని' స్పష్టం చేశారు. ఇలాంటివి కాకుండా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే కోర్టు దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ప్రస్తుతం కోర్టు ఆదేశాల మేరకు మంచం, దిండు, పరుపు సౌకర్యం కల్పించారని.. వీలుంటే ఓ కుర్చీ ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని వంశీ కోర్టు న్యాయాయాధికారిని కోరారు. దీనికి న్యాయధికారి సానుకూలంగా స్పందించి 'ఒక కుర్చీని ఏర్పాటు చేసేలా ఆదేశిస్తామని' వంశీకి చెప్పారు.
ఇరువురు న్యాయవాదులు వంశీ తరఫున కోర్టులో వాదనలు వినిపించారు. వంశీ తరపున న్యాయవాది సత్యశ్రీ వాదనలు వినిపిస్తూ.. చాలా రోజులుగా వంశీ ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో సానుకూలంగా స్పందించాలని విన్నవించారు. ప్రస్తుతం రిమాండ్ పొడిగింపు నేపథ్యంలో మరోసారి వాదనలు వింటామని న్యాయాధికారి చెప్పారు. అనంతరం వంశీ రిమాండ్ ఏప్రిల్ 8 వరకు పొడిగిస్తూ న్యాయాధికారి ఆదేశాలు చేశారు.
బెయిల్ పై వాదనలు విన్న న్యాయాధికారి తీర్పును రిజర్వ్ చేశారు.
కోర్టుకు తీసుకువచ్చిన వంశీలో గతంలో ఉన్న కరిష్మా కనిపించలేదు. జుట్టుకు రంగు వెలిసి తెల్లబారిన జుట్టుతో పాలిపోయిన మొహంతో కనిపించారు. కోర్టు ఆవరణలో నడిచిన వస్తున్న ఆయన్ను చూసి పలువురు.. అరే ఈ మనిషి వంశీయేనా.. అని విస్మయం వ్యక్తం చేశారు. తన ఒరిజినల్ క్రాప్ కి సంబంధం లేకుండా కనిపించారు.