వంగా గీత రికార్డు సృష్టించేనా..

పిఠాపురం బరిలో తలబడనున్న పవన్ కల్యాణ్, వంగా గీత పోటీ రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. వీరిలో విజయం ఎవరిని వరిస్తుందో..

Update: 2024-03-23 10:11 GMT
వంగా గీత, పవన్ కల్యాణ్


జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఎలాగైనా ఓడించి తీరాలన్న పట్టుదలతో ఉన్న వైసీపీ.. ఈసారి ఏకంగా ఓ మహిళనే బరిలోకి దించింది. మహిళ చేతిలో ఓ పార్టీ అధినేత ఓడిపోతే వచ్చే అప్రతిష్ట ఎలా ఉంటుందో పవన్‌కు రుచి చూపించేలా వైసీపీ వ్యూహాన్ని రచించింది. తన అన్న చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ తరఫున పోటీ చేసిన వంగా గీతకు టికెట్ ఇప్పించిన పవన్ కల్యాణ్... 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురంలో ఆమెతో తలపడుతున్నారు. దీంతో పవన్ కల్యాణ్ పోటీ అత్యంత ఆసక్తికరంగా మారింది.
ప్రధాని మోదీ, అమిత్ షా చెప్తే కాకినాడ నుంచి ఎంపీగా బరిలోకి దిగుతానని చెప్పిన పవన్ కల్యాణ్ మనసు మార్చుకుని తాను పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. జగన్‌ను మళ్లీ గెలవనివ్వనని శపథం చేసిన పవన్ కల్యాణ్‌ను అసలు పిఠాపురంలోనే ఓడించి ఓ పాఠం నేర్పాలని వైసీపీ పకడ్భందీ వ్యూహాన్ని రచించింది. పవన్‌కు వ్యతిరేకంగా మహిళా కాపు నేత వంగా గీతను పిఠాపురం అభ్యర్థిగా ప్రకటించింది. వంగా గీత ట్రాక్ రికార్డ్ చూసే పవన్ ప్రత్యర్థిగా ఆమే సరైన నేత అని వైసీపీ భావించినట్టు కనిపిస్తోంది. ఇద్దరి సామాజిక వర్గం ఒకటే కావడం, పిఠాపురంలో కాపులే ఎక్కువగా ఉండడంతో వంగా గీత మంచిపోటీ ఇస్తుందని వైసీపీ భావిస్తోంది.
ఓటమెరుగని వంగా గీత
పవన్‌ ప్రత్యర్థిగా పిఠాపురం ఎన్నికల బరిలో దిగిన వంగా గీత తన రాజకీయ చరిత్రలో ఒక్కసారి కూడా ఓటమిని చవిచూడలేదు. తన రాజకీయ తొలిమెట్టు నుంచి కూడా ఆమె తన విజయపరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు. 1989 నుంచి ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు దేశం పార్టీ తరపున 1995లో కొత్తపేట జడ్పీటీసీగా పోటీ చేసి విజయం సాధించారు. జెడ్పీ చైర్మన్‌గా పని చేశారు. ఆ తర్వాత 2000 నుంచి 2006 వరకు రాజ్యసభ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత టీడీపీని వీడి మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ తరపున 2009 ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని పార్టీ అధ్యక్షుడు చిరంజీవి.. కాంగ్రెస్‌లో విలీనం చేశారు. దాంతో ఆమె వైఎస్‌ఆర్‌సీపీ గూటికి చేరారు. 2019 ఎన్నికల్లో ఆమె కాకినాడ ఎంపీగా పోటీ చేసి విజయ దుందుభి మోగించారు. మళ్ళీ ఇప్పుడు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పవన్ కల్యాణ్ ప్రత్యర్థిగా పిఠాపురం బరిలో నిలబడటానికి సిద్ధమయ్యారు.
వంగా గీతకు ఇవే ప్లస్
పవన్ కల్యాణ్‌ ప్రత్యర్థిగా వంగా గీత నిలబడి గెలవడానికి ఆమెకు కొన్ని ప్లస్ పాయింట్లు తోడ్పడతాయని విశ్లేషకులు చెబుతున్నారు. వాటిలో మొదటిని స్థానికత. ఇప్పటికే టీడీపీ నేత ఎస్‌వీఎస్ఎన్ వర్మ నుంచి కూడా లోకల్ అనే భావన వ్యక్తం అయింది. దీంతో పిఠాపురం ప్రజల్లో కూడా లోకల్ నేత అయితే బాగుంటుందని, స్థానికత ఉన్న నేతకు ఇక్కడ సమస్యలు తెలుస్తాయి కానీ బయటి నుంచి వచ్చిన నేతలకు ఏం తెలుస్తాయన్న భావన వస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. దానికి తోడుగా వంగా గీతకు తన ట్రాక్ రికార్డ్, మచ్చలేని రాజకీయ చరిత్ర కూడా ఎనలేని తోడ్పాడు అందిస్తాయని విశ్లేషకులు చెప్తున్నారు.
టికెట్ ఇప్పించిన నేతపైనే పోటీనా!
2009 ఎన్నికల్లో వంగా గీత.. ప్రజారాజ్యం పార్టీ తరపున పిఠాపురం ఎన్నికల బరిలో నిలబడ్డారు. అయితే ఆమెకు పిఠాపురం టికెట్ రావడం వెనక పవన్ కల్యాణ్ కృషి ఉందని, పిఠాపురంలో వంగా గీత తప్పకుండా గెలుస్తారని పవన్ ధీమాగా చెప్పడంతోనే ఆమెకు టికెట్ ఇవ్వడానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అప్పట్లో వార్తలు తెగ వినిపించాయి. అనేక మంది ఈ వార్తలు వాస్తవమేనని అన్నారు. అటువంటిది ఇప్పుడు 2024 ఎన్నికల్లో వీరి మధ్య పిఠాపురం ఎమ్మెల్యే పోరు సాగనుండటంతో రాష్ట్ర ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం కీలకంగా మారింది. అయితే పవన్ కల్యాణ్‌ను ఓడించింది 2009లో ప్రజారాజ్యం టికెట్‌ను పవన్ ఇప్పించడంతోనే ఎమ్మెల్యేగా గీత కెరీర్ స్టార్ చేశారన్న మచ్చను తొలగించుకోవాలని ఆమె భావిస్తున్నారని కొందరు భావిస్తున్నారు.
ఆకట్టుకున్నోళ్లదే అధికారం
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 2,29,591 ఓటర్లు ఉండగా వారిలో లక్షకు పైగా ఓట్లు కాపు సామాజిక వర్గానివే. మిగిలిన ఓటర్లలో బీసీ, ఎస్సీ ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. వారిలో చాలా మంది వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్దిదారులే. ఇదిలా ఉంటే ఈ నియోజకవర్గంలో నిలబడుతున్న ప్రత్యర్థులు పవన్, గీతా ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. దీంతో ఇతర సామాజిక వర్గాల ఓటర్లను ఎక్కువగా ఆకట్టుకుంటున్న వారినే అధికారం వరిస్తుంది. అయితే వీరిలో వంగా గీత వైపు మైనస్ పాయింట్లు తక్కువగానే కనిపిస్తున్నాయి. పవన్‌కు మాత్రం టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి ఎన్‌వీఎస్‌ఎన్ వర్మ, ఆయన అనుచరవర్గం వినిపిస్తున్న అసమ్మతి స్వరం, బీజేపీతో స్నేహబంధంపై వస్తున్న వ్యతిరేకత మైనస్‌గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా కూటమి పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి పవన్‌కు పూర్తి స్థాయి మద్దతు, సహకారం లభిస్తుందన్న నమ్మకం కూడా చాలా తక్కువగానే ఉందని వైసీపీ వర్గాలు కూడా బాహాటంగానే చెప్తున్నాయి


Tags:    

Similar News