ఏయూ అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ

ఆంధ్రా యూనివర్శిటీ అక్రమాలపై గురువారం అసెంబ్లీలో చర్చ జరిగింది.;

Update: 2025-03-13 08:58 GMT

ఆంధ్రా యూనివర్శిటీ అక్రమాల మీద విజిలెన్స్‌ విచారణ జరిపిస్తామని, 60 రోజుల్లో నివేదిక వచ్చే విధంగా చర్యలు చేపడుతామని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్‌ స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం అక్రమాలపై చర్చ జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రా యూనివర్శిటీలో అనేక అక్రమాలు జరిగాయని, వీటి మీద విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ, గణబాబు, కొణతాల రామకృష్ణలు అసెంబ్లీలో ప్రస్తావించారు. గత ప్రభుత్వంలో ఆంధ్రా యూనివర్శిటీ వీసీగా పని చేసిన ప్రసాదరెడ్డి ఆంధ్రా యూనివర్శిటీని రాజకీయ వేదికలా మార్చారని, వైసీపీ అధ్యక్షుడి తరహాలోనే వ్యవహరించారని విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రా యూనివర్శిటీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

దీనికి మంత్రి నారా లోకేష్‌ సమాధానం చెబుతూ..
యూనివర్శిటీ అనేది అందరికీ ఒక సెంటిమెంటుతో కూడుకున్నది. ఆంధ్రా యూనివర్శిటీ నుంచి ఎంతో ప్రముఖులు వచ్చారు. వారిలో పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు ఉన్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వైస్‌ చైర్మన్‌ ఉన్న వ్యక్తి కూడా ఆంధ్రా యూనివర్శటీలో చదువుకున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త జీఎంఆర్‌ కూడా ఆంధ్రా యూనివర్శిటీలోనే చదువుకొని వచ్చారు. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న చాలా మంద్రి శాసన సభ్యులు కూడా ఆంధ్రా యూనివర్శిటీలో చదువుకున్న వారే. విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకునే ముందు సీఎం చంద్రబాబు తనకు చాలా స్పష్టంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్నైనా ప్రపంచ స్థాయిలో మొదటి 100 ర్యాంకుల్లో నిలుపగలిగితే మన కృషి ఫలించినట్లే అని ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు తాను కృషి చేస్తున్నాను. అందులో భాగంగానే మ్యాథమ్యాటిక్స్‌లో ప్రముఖ ప్రొఫెసర్‌గా ఉన్న రాజశేఖర్‌ను ఏకంగా వీసీగా నియమించాం. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు, కరుక్యులమ్‌ను బలోపేతం చేసేందుకు ఇలాంటి చర్యలు తీసుకున్నాం.
అయితే ఆంధ్రా యూనివర్శిటీలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి. దీనిని సభ్యులు హౌస్‌లో ప్రస్తావించారు. పలు రకాల గ్రాంట్‌లను కూడా మిస్‌ యూస్‌ చేశారు. అధికారాలను కూడా దుర్వినియోగం చేశారు. విద్యార్థులను రాజకీయ పనులకు ఉపయోగించారు. గత సీఎం వైజాగ్‌ వెళ్తే ఆయనకు స్వాగతం పలికేందుకు తరగతిలో ఉన్న విద్యార్థులను తీసుకెళ్లడం వంటి పనులు చేశారు. దీంతో పాటుగా ఆంధ్రా యూనివర్శిటీలో నియామకాలు కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి. లంచాలు తీసుకొని పోస్టులు కట్టబెట్టారు. సాక్షాత్తు ఆంధ్రా యూనివర్శటీ ఒక పార్టీ కోసం పని చేస్తూ ఎన్నికల్లో క్యాంపెయిన్‌ చేశారు. ఇలా ఆంధ్రా యూనివర్శిటీ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. విమర్శలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. వీటిని సభ్యులు కూడా ప్రస్తావించారు. దీని మీద ప్రస్తుతం ఇన్‌చార్జి వీసీ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదిక రావాల్సి ఉంది. అయితే ఆంధ్రా యూనివర్శిటీ అక్రమాల మీద విజిలెన్స్‌ విచారణ చేయాలని సభ్యులు కోరుతున్నారు. ఆ మేరకు విచారణకు ఆదేశాలు జారీ చేస్తాం. 60 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించే విధంగా చర్యలు తీసుకుంటాం. ఆ బాధ్యతను తాను తీసుకుంటానని మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. రిపోర్టు వచ్చిన తర్వాత అక్రమాలకు పాల్పడిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. మరెవ్వరూ ఇలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఉండే విధంగా ఈ చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేష్‌ గురువారం అసెంబ్లీలో స్పష్టం చేశారు.
Tags:    

Similar News