ఎవరి ఖాతాలోకి విజయవడ పశ్చిమ జనసేన ఓట్లు?

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన ఓట్లు ఎవరి ఖాతాలో జమకానున్నాయి. జనసేనాని ఎందుకు నోరు మెదపడం లేదు?

Update: 2024-04-09 05:28 GMT
Pavan with Potina Mahesh

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఇప్పటి వరకు అన్ని వర్గాల వారికి రాజకీయంగా ఆశ్రయం కల్పించిన నియోజకవర్గం ఇది. కాంగ్రెస్, కాంగ్రెస్‌–ఐ, సీపీఐ, పిఆర్‌పీ, వైఎస్సార్‌సీపీ పార్టీలు ఇక్కడి నుంచి గెలుపొందాయి. బిజేపీ, టీడీపీ కూటమి తరపున బీజేపీ అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు ఓటమి పాలయ్యారు. ఇక్కడ భావసారూప్య పార్టీలకు ఓటర్లు పెద్దపీట వేశారని చెప్పొచ్చు. లౌకికవాద పార్టీలను ఓటర్లు స్వాగతిస్తున్నారు. మేలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా బీజేపీ తరపున సుజనా చౌదరి రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో ముస్లిమ్, బీసీ, ఎస్సీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.

జనసేనకు షాకిచ్చిన మహేష్‌
జనసేన పార్టీకి పోతిన వెంకట మహేష్‌ గుడ్‌బై చెప్పారు. పవన్‌కళ్యాణ్‌కు నమ్మిన బంటుగా ఉన్న మహేష్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకోసం పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని మూసి వేశారు. కార్యాలయంలో ఉన్న ప్రచార సామగ్రిని బయట వేసి దగ్ధం చేశారు. నేను చెప్పినట్లు వింటే వినండి, లేకుంటే పార్టీ నుంచి వెళ్లిపోండని పిలుపు నిచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు ఒక్కసారిగా షాకిచ్చినట్లైంది. పోతిన వెంకట మహేష్‌ పది సంవత్సరాలుగా విజయవాడ పశ్చిమ నియోజకర్గంలో జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పోతిన వెంకట మహేష్‌ కుమార్‌కు 21,800 ఓట్లు వచ్చాయి. 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందాలని పట్టుదలతో ఉన్నారు. బీజేపీ పొత్తుతో ముందుకు సాగిన అభ్యర్థులను ఈ నియోజకవర్గంలో ఆదరించలేదు. అయినా తనకు టిక్కెట్‌ వస్తుందనే ఆశతో చివరి వరకు ఎదురు చూశారు. చివర్లో బీజేపీ తరపున సుజనా చౌదరికి సీటు కేటాయించినట్లు బీజేపీ ప్రకటన వెలువడింది. దీంతో కాస్త మనస్థాపానికి గురైన మహేష్‌ మరోసారి ప్రయత్నించారు. సుజనా చౌదరిని మార్చే అవకాశం లేదని నిర్థారణ అయిన తరువాత జనసేన పార్టీని వీడారు.
సరదాకోసం పార్టీలో చేరరు కదా..
సరదాకోసం జనసేన పార్టీలో చేరలేదు. ఎమ్మెల్యేగా గెలిచి చూపిద్దామని చేరాను. కానీ నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. టీడీపీతో అంటకాగుతున్న పార్టీ జనసేన పార్టీ. వాళ్ల అన్న మాదిరి పవన్‌ కళ్యాణ్‌ కూడా జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీలో విలీనం చేసి కాడి కిందపడేస్తాడు అంటూ ఘాటైన విమర్శలు చేశారు పోతిన వెంకట మహేష్‌. జనసేనాని ఏదో ప్రజలకు చేస్తారనే భ్రమలో ఇప్పటి వరకు ఉన్నాను. ఏమీ చేయలేరని స్పష్టమైందని, జనసేనలో ఉన్న వారు వెంటనే బయటకు రాకుంటే వారి భవిష్యత్‌ కూడా గంగలో పోసిన పన్నీరుగా మారిపోతుందన్నారు.
పశ్చిమ నియోజవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు పిఆర్‌పీ తరపున పోటీ చేసి గెలిచారు. ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో బీజేపీలో చేరి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత వైఎస్సార్‌సీపీలో చేరారు. అలాగే జలీల్‌ఖాన్‌ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ, వైఎస్సార్‌సీపీలో కొనసాగారు. ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చిన అభ్యర్థులకు కూడా నిలకడలేని మనస్తత్వం అని, రాజకీయ అవకాశ వాదులని చెప్పొచ్చు. అటు ఇటూ తిరుగుతున్నా వారినే గెలిపిస్తుండటం నియోజకవర్గం ప్రత్యేకత.
మహేష్‌ బీసీ ఉద్యమ కారుడు
బీసీలకు రాష్ట్రంలో రాజ్యాధికారం తప్పకుండా రావాలని, జనాభాలో సగభాగం ఉన్న బీసీలు రాజ్యాధికారంలో భాగస్వాములైతేనే మంచి జరుగుతుందనే ఆలోచనలు చేసిన వ్యక్తి పోతిన మహేష్‌కుమార్‌. ఈయన బీకాంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. పిహెచ్‌డీ కూడా చేశారు. లెక్చరర్‌గా వన్‌టౌన్‌లోని కేబీఎన్‌ కాలేజీలో కొంతకాలం పనిచేశారు. సామాజిక అంశాలపైన మంచి అవగాహన ఉన్న వ్యక్తి. నగరాలు సామాజిక వర్గానికి చెందిన వారు. నివాసం కూడా వన్‌టౌన్‌లోనే. బీసీ సామాజిక వర్గాల్లో ఎంతో మంది దరిద్రమైన జీవితాలు గడుపుతున్నారని, అటువంటి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకున్న వారిలో విజయవాడలో మొదటి వరుసలో ఉంటారు. ఎన్ని ఉద్యమాలు చేసినా పాలకుడిగా ఉండకపోతే ఆశయాలు నెరవేర్చలేమని నమ్మిన మహేష్‌ పవన్‌ కళ్యాణ్‌లోని ఆవేశం, ఆవేదన, ఆక్రోశం నచ్చాయి. ఈయన పాలకుడైతే రాష్ట్రం బాగుపడుతుందని నమ్మిన వారిలో మొదటి వారు. పవన్‌కళ్యాణ్‌పై పళ్లెత్తు మాట ఎవరు మాట్లాడినా, విమర్శించినా వారికి ధీటైన సమాధానం చెబుతూ వచ్చేవారు. నాయకుడిని సచ్చీలుడుగా చూసిన మహేష్‌ కుమార్‌ తనకు రాజకీయ భవిష్యత్‌ ఇకపై జనసేన పార్టీలో ఉండదనుకున్న తరువాత ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. పవన్‌ ఎలా ఉద్యమ కారులను వాడుకుని బయటకు నెట్టేస్తారో తన ఆవేదన ద్వారా వినిపించారు.
Delete Edit
బీసీ ఉద్యమాన్ని కృష్ణయ్య నాశనం చేశారా?
బీసీ ఉద్యమాన్ని, బీసీల కోసం ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తులను సర్వనాశనం చేసింది బీసీ ఉద్యమకారుడైన ఆర్‌ కృష్ణయ్య అని మహేష్‌ ధ్వజమెత్తారు. బీసీలకు ఎంతో చేస్తున్నానని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కూడా బీసీలకు ఏమీ చేయలేదన్నారు. కృష్ణయ్య రాజ్యసభకు జగన్‌ ద్వారా వెళ్లి బీసీ ఉద్యమాన్ని కిందపారేశారని, ఇంతకంటే దారుణం ఉంటుందా అని ప్రశ్నించారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో బీసీ ఉద్యమాన్ని నడిపిన వారు లేనట్లు తెలంగాణ వ్యక్తిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాతినిద్యం కల్పించడం ఏమిటని ప్రశ్నించారు. కృష్ణయ్య బీసీల ద్రోహికాక మరేమవుతారని మహేష్‌ ప్రశ్నించడం పలు ఆలోచనలు రేకెత్తిస్తోంది.
వైఎస్సార్‌సీపీలో చేరుతారా?
పోతిన వెంకట మహేష్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరాలనే ఆలోచనతో ఉన్నారు. వైఎస్సార్‌సీపీలో చేరడం ద్వారా జనంతో కలిసి పనిచేసేందుకు అవకాశం దక్కుతుందనే ఆలోచనను సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం. వైఎస్సార్‌సీపీలో చేరితే తప్పేముంది అంటూ తన స్నేహిలు కొందరి వద్ద మనసు విప్పి మాట్లాడారు.
Tags:    

Similar News