నిలువెత్తు కోడ్ ఉల్లంఘన
పట్టణాల్లో చిరువ్యాపారులపై కోడ్ ఉల్లంఘనంటూ చిందులు వేస్తున్న ఉన్నతాధికారులు, మునిసిపల్ అధికారులకు నిలువెత్తు కోడ్ ఉల్లంఘనలు కనిపించడం లేదు.;
Byline : G.P Venkateswarlu
Update: 2024-03-19 15:00 GMT
వైఎస్సార్ కోనసీమ అంబేద్కర్ జిల్లా జొన్నాడ వంతెన వద్ద రాజమండ్రి వెళ్లే ప్రధాన రహదారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యే సగభాగం కలిపి మొత్తం 60 అడుగుల భారీ కటౌట్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాల రెపరెపల మధ్య ప్రజలకు దర్శనమిస్తోంది. అటుగా వెళుతున్న ఏపీ మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చూసి ఆశ్చర్యపోయారు. జొన్నవాడ వంతెన్న వద్ద 24/7 మైలు రాయివద్ద ఏర్పాటు చేశారు.
కరకట్టపై వెళుతున్న వాహనాలను అన్నింటినీ పోలీస్ అధికారులు, ఉద్యోగులు తనిఖీలు చేస్తున్నారు. గోదావరి వంతెనకు ఆనుకుని ఉన్న ఈ కటౌట్‌న తనిఖీ అధికారులకు వందడుగుల దూరంలోనే వుంది. అలాగే ఎందుకు ఉంచారనేది ఎవరికీ అర్థంకాని వ్యవహారం. ఈ జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఏమి చేస్తున్నారనేది ప్రజాస్వామిక వాదుల ప్రశ్న. గోడపై పోస్టర్లు తుడిచేస్తున్న అధికారులకు ఇంత కటౌట్ గురించి ఎందుక పట్టించుకోలేదు.
సెక్రటేరియట్‌లో కూర్చుని చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో భారీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కటౌట్స్ ఎక్కడున్నా తొలగించాలని, ఫ్లెక్సీలు కనిపిస్తే తీసి వేయాలని ఆదేశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి ఫొటో వేసిన రేషన్ వ్యాన్‌లు వీధుల్లో తిరుగుతున్నాయి. చిరు వ్యాపారులకు ఎవరైనా రాజకీయ నాయకులు సాయం చేసి వారి బొమ్మలు వేసుకుంటే ఆ బండ్లకు తెల్లరంగు వేసే వరకు అధికారులు ఊరుకోవడం లేదు. కొన్ని చోట్ల ఇంకా నాయకుల విగ్రహాలకు ముసుగులు కప్పలేదు.
ఇక మీసేవలో తీసుకునే అన్ని సర్టిఫికెట్లమీద వైఎస్సార్‌సీపీ కలర్స్, వైఎస్ జగన్ ఫొటో ఉంటోంది. దీనిపై విమర్శలు చెలరేగుతున్నాయి. పైగా వెబ్‌సైట్లలో మంత్రులు, ముఖ్యమంత్రి ఫొటోలు ఇంకా ఉన్నాయి. చీఫ్ సెక్రటరీ తొలగించమని చెప్పినా అధికారుల చెవికెక్కలేదు.
స్కూల్ బ్యాగులు, సర్వే రాళ్లు, పాసుపుస్తకాల విషయంలో మనం ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో వ్యక్తి ఆరాధనను ఎందుకు ప్రోత్సహించాలనేది పలువురి ప్రశ్న. ఈ విధంగా సాగితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రశ్నార్థకమవుతుంది. దేశమంతా నియమావళి అమలవుతున్నా రాష్ట్రంలో మాత్రం అమలు కావడం లేదని ఈ కటౌట్ స్పష్టం చేస్తున్నది. కటౌట్ల లాంటివి తొలగించే అవకాశం ఉన్నా అధికారుల తీరు మారటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్నికల కోడ్ ఉల్లంఘన విషయమై ఏపీలో అధికారుల నిర్లక్ష్యాన్ని రిటైర్డ్ ఏపీ ఎన్నికల కమిషన్, సిటిజన్ ఫర్ డెమొక్రటిక్ సంస్థ కార్యదర్శి డాక్టర్ ఎన్ రమేష్‌కుమార్ సోషల్ మీడియా పరంగా ప్రశించారు. రాజమండి గోదావరి గట్టున ఏర్పాటు చేసిన సీఎం కటౌట్‌ను ఆయన చూపిస్తూ తీసిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ వైఫల్యాన్ని ఈ విజిల్ యాప్ ద్వారా కంప్లైంట్ చేయాలి. ఈ విషయాన్ని సిటిజన్ ఫర్ డెమొక్రటిక్ మీకు తెలియజేస్తోందని సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు.