విశాఖ స్టీల్ కు సమ్మె సెగ
20 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమైన కాంట్రాక్టు కార్మికులు.;
ఒకపక్క విశాఖ ఉక్కు కర్మాగారంపై ప్రైవేటీకరణ కత్తి ఇంకా వేలాడుతూనే ఉంది. ఈ కార్మికుల గుండెల్లో రైళ్లను పరుగెత్తిస్తూనే ఉంది. వీరి జీతాల్లో కోత కూడా కొనసాగుతోంది. మరోపక్క యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తూ పోతోంది. వారికి అండగా నిలుస్తున్న కార్మిక సంఘాల నేతలపై కక్ష సాధిస్తోంది. సస్పెన్షన్లు, షోకాజ్ నోటీసుల పేరిట బెదిరిస్తోంది. ఈ తరుణంలో ఈనెల 20 నుంచి వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు. దీంతో ఇప్పుడిప్పుడే నష్టాల నుంచి లాభాల బాటలోకి పయనిస్తున్న ఈ ప్లాంట్ ఉత్పత్తిపై పెను ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
కాంట్రాక్టు కార్మికులకు మద్దతుగా ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న కార్మిక సంఘాల నేతలు
దాదాపు నాలుగున్నరేళ్ల క్రితం ప్రైవేటీకరణ ప్రకటన వెలువడినప్పట్నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల్లో అలజడి రేగుతూనే ఉంది. ప్రైవేటీకరణ యోచనను నిరసిస్తూ ప్లాంట్ కార్మికులు నిరంతరాయంగా రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు నుంచి కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ విన్నవించుకుంటూనే ఉన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి భరోసా దక్కలేదు. పైగా ఈ కర్మాగారంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం తొలగిస్తోంది. గతంలో నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం ఉన్నఫళంగా విధుల నుంచి తప్పించింది. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో కొద్దిరోజులకు తిరిగి విధుల్లోకి తీసుకుంది. కొన్నాళ్ల పాటు వారి జోలికివెళ్లని యాజమాన్యం మళ్లీ ఇటీవల దఫదఫాలుగా మరో మూడు వేల మంది వరకు తొలగించింది. దీంతో మళ్లీ కాంట్రాక్టు కార్మికులు ఆందోళన బాట పట్టారు. వారికి ప్లాంట్ రెగ్యులర్ ఉద్యోగులతో పాటు అన్ని యూనియన్ల నేతలు అండగా నిలిచారు. తొలగించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, పూర్తి స్థాయి జీతాలు చెల్లించాలని, లేనిపక్షంలో సమ్మెకు దిగుతామని ఇప్పటికే కాంట్రాక్టు కార్మికులు యాజమాన్యానికి స్పష్టం చేశారు. దీనిపై కొద్దిరోజుల క్రితం వివిధ కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు సమ్మె సన్నద్ధతపై చర్చించేందుకు సమావేశమయ్యారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న యాజమాన్యం నలుగురిని సస్పెండ్ చేసింది. ఏడుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇలా కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వైఖరిని వ్యతిరేకిస్తూ ఈనెల 20 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని కాంట్రాక్టు కార్మికులు స్పష్టం చేశారు. వీరికి శాశ్వత ఉద్యోగులు, ఉక్కు యూనియన్ల నాయకులు సంఘీభావం తెలిపారు.